కలెక్టరేట్, జూలై 10 : జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో ఆస్తి, ప్రాణ నష్టం జరుగకుండా జిల్లా యంత్రాంగం పూర్తి అప్రమత్తంగా ఉన్నట్లు కలెక్టర్ ఆర్వీ కర్ణన్ తెలిపారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా అధికారులు ఎప్పటికప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు వెల్లడించారు. ఆదివారం హైదరాబాద్ నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు.
లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక దృష్టి సారించి ఆయా చోట్ల నివాసమున్న ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా జిల్లావ్యాప్తంగా అన్ని శాఖల అధికారులను సిద్ధం చేసినట్లు తెలిపారు. దిగువ మానేరు జలాశయ పరీవాహక ప్రజలను అలర్ట్ చేసినట్లు స్పష్టం చేశారు. వర్షాలపై పరిస్థితిని ఎప్పటికప్పుడు జిల్లాలోని పరిస్థితులు సమీక్షిస్తూ, తగిన ఆదేశాలు జారీ చేస్తున్నట్లు చెప్పారు. ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. భారీ వర్షాలతో అతలాకుతలం అవుతున్న దృష్ట్యా ఎలాంటి నష్టం జరుగకుండా, ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
లోతట్టు ప్రాంతాలను గుర్తించి అక్కడి ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించాలని, అవసరమైన పక్షంలో సహాయ శిబిరాలు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. విద్యుత్ స్తంభాలు పడిపోతే, సరఫరాలో ఎలాంటి అంతరాయం కలిగినా వెంటనే సవరించాలన్నారు. నీరు అధికంగా ప్రవహించే రహదారులు, కాజ్‌వేలలో ప్రజలు ఇబ్బంది పడకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి రక్షణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్లు గరిమా అగర్వాల్, శ్యామ్ ప్రసాద్‌లాల్, ఇరిగేషన్ ఎస్ఈ శివకుమార్, ఈఈ నాగభూషణం, ఆర్డీవో ఆనంద్‌కుమార్, ఎలక్ట్రిసిటీ ఎస్ఈ గంగాధర్, మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, డీపీవో వీరబుచ్చయ్య, అగ్నిమాపక శాఖాధికారి వెంకన్న పాల్గొన్నారు.
కలెక్టరేట్లో కాల్‌సెంటర్ ఏర్పాటు..
కొద్ది రోజులుగా జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో కలిగే ఇబ్బందుల దృష్ట్యా కలెక్టరేట్లో కాల్‌సెంటర్ ఏర్పాటు చేసినట్లు అదనపు కలెక్టర్ జీవీ శ్యాంప్రసాద్ లాల్ తెలిపారు. వర్షాల మూ లంగా జిల్లాలో ఏప్రాంతంలోనైనా, ఎవరికి ఎలాంటి సమస్యలు ఎదురైనా 0878-2265206 నంబర్‌కి ఫోన్ చేయాలని పేర్కొన్నారు. కాల్సెంటర్లో 24 గంటల పాటు సహాయ చర్యలు చేపట్టేందుకు సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు.
మానేరుకు పోటెత్తుతున్న వరద..
నగర శివారులోని మానేరు రిజర్వాయర్‌లోకి వరద పోటెత్తుతున్నది. రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో మోయతుమ్మెద వాగు పొంగిపొర్లుతున్నది. ఎగువ నుంచి వస్తున్న నీటితో ప్రాజెక్టులో మట్టం క్రమంగా పెరుగుతున్నది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల వరకు 1,343 క్యూసెక్కుల నీరు రాగా, 9.493 టీఎంసీల నీటి మట్టం ఉంది. ఇది మధ్యాహ్నం మూడు గంటల వరకు 9.517 టీఎంసీలకు చేరుకుంది. సాయంత్రం వరకు 3,566 క్యూసెక్కులకు వరద పెరగడంతో రిజర్వాయర్‌లో నీటి మట్టం 9.541 టీఎంసీలకు చేరింది. మరో రెండు రోజులు వర్షాలు ఉన్నట్లు వాతావరణ శాఖ పేర్కొంటున్న నేపథ్యంలో రిజర్వాయర్‌లోకి భారీగా నీరు చేరే అవకాశాలున్నాయి.