కమాన్చౌరస్తా, జూలై 10 : దక్షిణాయనం ప్రారంభంతో ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు వచ్చే తొలి ఏకాదశి పర్వదినాన్ని భక్తులు ఆదివారం భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. చాతుర్మాస్య దీక్షలు ప్రారంభం సందర్భంగా గృహస్తులు, స్వామీజీలు దీక్షాస్వీకారం చేశారు. తొలకరి ప్రారంభంతో వర్షాలు కురిసి పంటలకు అనుకూలంగా వాతావరణం మార్పు చెందింది. ఆలయాల్లో ప్రత్యేక అభిషేకాలు, పూజలు, హవనాలు నిర్వహించారు. వర్షం కురుస్తున్నా ఇంటిల్లిపాది విందులో పాల్గొన్నారు.
చొప్పదండి మండలంలో..
చొప్పదండి, జూలై 10 : మండలంలో తొలిఏకాదశిని ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. ఆషాఢమాసంలో వచ్చే ఏకాదశిని తొలిఏకాదశిగా, హిందువుల తొలి పండుగగా భావిస్తారు. మండలంలోని ఆలయాల్లో ప్రజలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నరసింహస్వామి ఆలయంలో..
కరీంనగర్ రూరల్, జూలై 10: కరీంనగర్ మండలంలోని చెర్లభూత్కూర్ గ్రామంలో స్వయంభూ లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో ఆలయ అర్చకుడు సుధాకర్ చార్యులు తొలి ఏకాదశి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆదివారం అషాఢ ఏకాదశి సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి, లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పలువురు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వర్షం కారణంగా వన భోజనాలు రద్దు చేసుకున్నారు. స్వామి వారి పూజలు, తీర్థప్రసాదాలు తీసుకొని వెనుదిరిగారు.