కరీంనగర్ రూరల్, జూలై 9: విద్యార్థులు మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మంథని జేఎన్టీయూ వైస్ ప్రిన్సిపాల్ శ్రీధర్‌రెడ్డి సూచించారు. కరీంనగర్ శివారులోని వివేకానంద ఇంజినీరింగ్ కళాశాల వార్షికోత్సవాన్ని శనివారం ‘స్పెక్ట్రమ్-2022’ పేరిట నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి మాట్లాడారు. కళాశాలలో చదివిన అనేక మంది విద్యార్థులు విదేశాల్లో మంచి హోదాలో ఉన్నారని గుర్తు చేశారు. కళాశాల వైస్ చైర్మన్ అరవింద్‌రావు మాట్లాడుతూ, కళాశాలలో ఈ సంవత్సరం నుంచి విద్యార్థులు ప్లేస్మెంట్లో ఉద్యోగాలు సాధించేలా సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రారంభిస్తామని తెలిపారు. విద్యార్థులు ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలని పిలుపునిచ్చారు.
కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ టీవీవీ సుధాకర్ మాట్లాడుతూ, కళాశాలలో ఈ సంవత్సరం ప్లేస్మెంట్లో ఎంపికైన విద్యార్థులను అభిదనందించారు. అలాగే, వర్షాన్ని సైతం లెక్క చేయకుండా వచ్చిన విద్యార్థుల తల్లిదండ్రులను అభినందించారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కళాశాల ఏడీ డైరెక్టర్ బీ గోవిందరావు, బిట్స్ పిలానీ మేనేజింగ్ డైరెక్టర్ చింతకాయల ఆశీష్, తరుణ్‌శర్మ, వివిధ విభాగాల హెచ్వోడీలు, అధ్యాపకులు పాల్గొన్నారు.