ఆరెంజ్ హెచ్చరిక : మరో రెండు రోజులపాటు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు, ప్రజాప్రతినిధులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. కరీంనగర్ జిల్లాకు ఆరేంజ్ హెచ్చరిక జారీ చేసింది. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా తమ తమ నియోజకవర్గాల్లోనే ఉండి పరిస్థితిని సమీక్షించాలని స్పష్టం చేసింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైతేనే ఇండ్ల నుంచి బయటికి రావాలని సూచించింది.
కరీంనగర్, జూలై 9 (నమస్తే తెలంగాణ): జిల్లాలోని అనేక చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా గంగాధర మండలంలో 88.4 మిల్లీ మీటర్లు పడగా, రామడుగు, చొప్పదండి, కరీంనగర్, మానకొండూర్, వీణవంక, తిమ్మాపూర్, హుజూరాబాద్ తదితర మండలాల్లో జోరుగా పడ్డాయి. చిగురుమామిడి, తిమ్మాపూర్ మండలాల పరిధిలో ఉన్న మోయతుమ్మెద వాగుకు స్వల్పంగా వరద వచ్చింది. ఎల్ఎండీ రిజర్వాయర్‌లోకి 973 క్యూసెక్కుల వరద వస్తున్నట్లు ఇరిగేషన్ అధికారులు తెలిపారు. ఇటు హుజూరాబాద్ మండలంలోని చిలుక వాగు, శంకరపట్నం మండలంలోని కేశవపట్నం వాగులు కూడా స్వల్పంగా పారుతున్నాయి. వీణవంక మండలంలోని కొన్ని కుంటల్లో నీరు చేరడంతో చిన్న చిన్న కుంటలు మత్తడి పడుతున్నాయి. గంగాధర మండలం హిమ్మత్‌నగర్‌లో ఎగుర్ల కనకయ్య అనే వ్యక్తికి చెందిన ఇల్లు కూలి పోవడం మినహా జిల్లాలో ఇప్పటి వరకు ఎలాంటి నష్టం వాటిల్లలేదు.
ఉమ్మడి జిల్లాలో కుండపోత
ఉమ్మడి జిల్లాలోని వర్షం దంచికొట్టింది. ప్రధానంగా పెద్దపల్లి, జగిత్యాల, సిరిసిల్లలో కుండపోత పోయగా, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమై, ఇండ్లలోకి వర్షపు నీరు చేరింది. వాగులు, వంకలు పారుతుండగా, చెరువులు, కుంటలకు జలకళ వచ్చింది. అటు కడెం గేట్లు ఎత్తడంతో ఎల్లంపల్లికి ఇన్‌ఫ్లో పెరిగింది. దీంతో 10గేట్లు ఎత్తి దిగువకు పార్వతీ బరాజ్‌లోకి నీటిని విడుదల చేస్తున్నారు. పార్వతీ బరాజ్‌కు ప్రవాహం పెరగడంతో 50గేట్లు ఎత్తి విడుదల చేస్తున్నారు. అటు మానేరు వాగుకు వరద ప్రవాహం పెరిగింది. ధర్మపురి, కమ్మునూర్ వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహించింది. సిరిసిల్ల జిల్లాలో వర్షంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. అంతటా కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు.