మల్యాల, జూలై 9 : ముఖ్యమంత్రి కేసీఆర్ ముందుచూపుతో అమలు చేసిన పథకాలతో వ్యవసాయ రంగం పండుగలా మారిందని, రైతులకు న్యాయం జరిగిందని రాష్ట్ర ఎస్సీ, మైనార్టీ, దివ్యాంగ సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. పంట ఉత్పత్తుల సత్వర కొనుగోలుకే వ్యవసాయ మార్కెట్ కమిటీలను నిర్మిస్తున్నదని చెప్పారు. 40 ఏండ్లు పాలించిన కాంగ్రెస్, కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతాంగానికి చేసిందేంలేదని దుయ్యబట్టారు.
భూ సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా తెచ్చిన ధరణి పోర్టల్‌పై ప్రతిపక్షాలు అనవసర రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. శనివారం మల్యాల, కొడిమ్యాల మండలాలను కలుపుతూ ఏర్పాటు చేసిన మల్యాల మార్కెట్ కమిటీ పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవానికి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జగిత్యాల జడ్పీ చైర్పర్సన్ దావ వసంతతో కలిసి మంత్రి హాజరయ్యారు. జిల్లా మార్కెటింగ్ వ్యవసాయ అధికారి ప్రకాశ్ చైర్మన్‌గా కొరండ్ల నరేందర్‌రెడ్డి, వైస్ చైర్మన్‌గా ఆసం శివకుమార్, పాలకమండలి సభ్యులతో ప్రమాణం చేయించి బాధ్యతలు అప్పగించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన ధరణి పోర్టల్‌తో 99 శాతం భూ సమస్యలు పరిష్కారానికి అవకాశం లభించిందన్నారు. తహసీల్దార్లకే భూ రిజిస్ట్రేషన్ల బాధ్యతలు అప్పగించడంతో ఒకేరోజూ రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ చేసుకొనే వీలు కలిగిందన్నారు. ధరణిపై సభలో ఉన్న ప్రజలను ఉద్దేశించి ధరణి ఉండాలా? వద్దా? అని ప్రశ్నించగా కొనసాగించాలని సమాధానం వచ్చింది. కేంద్రం యాసంగి వడ్లను కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బందిపెట్టిందని దుయ్యబట్టారు. కానీ రైతు పక్షపాతి అయిన సీఎం కేసీఆర్ ఆర్థిక భారానికి వెరవకుండా సకాలంలో కొనుగోలు చేసి ఆదుకున్నారని చెప్పారు. సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుపై ప్రజలు జేజేలు కొడుతుంటే.. ప్రతిపక్షాల రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు.
కాంగ్రెస్, బీజేపీ రాష్ట్రంలో చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో మల్యాల, కొడిమ్యాల జడ్పీటీసీలు రాంమోహన్‌రావు, పునుగోటి ప్రశాంతి, ఎంపీపీలు మిట్టపల్లి విమల, మేన్నేని స్వర్ణలత, మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షుడు మిట్టపల్లి సుదర్శన్, పునుగోటి కృష్ణారావు, సహకార సంఘాల అధ్యక్షులు అయిల్నేని సాగర్‌రావు, బోయినిపల్లి మధుసూదన్‌రావు, మేన్నేని రాజనర్సింగరావు, బండ రవీందర్‌రెడ్డి, పోలు రాజేందర్, టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు జనగం శ్రీనివాస్, పులి వెంకటేశంగౌడ్, ఆర్బీఎస్ కన్వీనర్లు రాజేశ్వర్‌రెడ్డి, అంకం రాజేశం, సర్పంచ్‌లు బద్దం తిరుపతిరెడ్డి, గరికంటి మల్లేశం, మార్కెట్ కార్యదర్శి శ్రీదేవి, డైరెక్టర్లు బొంకూరి వేణురావు, రెహనాసుల్తానా, జోగినిపల్లి లక్ష్మి, సంఘ మల్లయ్య, అనంతరెడ్డి, సుదాకర్‌గౌడ్, దేవ య్య, బీరయ్య, లక్ష్మణ్, నాగరాజు ఉన్నారు.
సామాన్యుల నడ్డివిరిచింది..
మోదీ ప్రభుత్వం ఇబ్బడిముబ్బడిగా ధరలు పెంచి సామాన్యుల నడ్డివిరిచింది. ప్రభుత్వ రంగ సంస్థలను అంబాని, ఆదాని చేతుల్లో పెట్టేందుకు కుట్రలు చేస్తున్నది. నల్లా చట్టాలు తెచ్చి వ్యవసాయాన్ని నిర్వీర్యం చేసేందుకు యత్నించారు. కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అభివృద్ధిని మరిచి కులమతాల పేరిట ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. నేను ఎమ్మెల్యేగా మల్యాల మండలంలో 48 కోట్ల అభివృద్ధి పనులు, కొడిమ్యాలలో 43 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టా. కానీ, బండి సంజయ్ చేసిందేంటో చెప్పాలి.
– ఎమ్మెల్యే సుంకె రవిశంకర్
విద్యా వైద్యంపైనే ప్రత్యేక దృష్టి
తెలంగాణలో సీం కేసీఆర్ విద్య, వైద్య రంగాలకు పెద్దపీట వేస్తున్నారు. ఈ ఉద్దేశంతోనే మన ఊరు-మన బడి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. వైద్యరంగానికి పెద్దపీట వేస్తూ జిల్లాకో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తున్నారు. మాజీ ఎంపీలు వినోద్‌కుమార్, కల్వకుంట్ల కవిత పార్లమెంట్లో గళమెత్తి నిధులు తీసుకవచ్చారు. కానీ, ప్రస్తుత ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అర్వింద్ పార్లమెంట్లో నోరుమెదపడం లేదు. ప్రజలకు పనికొచ్చే పైసా పనిచేయడం లేదు. బీజేపీ ప్రభుత్వం అడ్డగోలు ధరలు పెంచుతున్నా ఒక్క మాటమాట్లాడడం లేదు. మోదీ గరీబోళ్లకు యముడు, బండి సంజయ్‌కు మాత్రం దేవుడు.
– జడ్పీ చైర్పర్సన్ దావ వసంత