సకల వసతులతో కార్పొరేట్‌కు దీటుగా నాణ్యమైన విద్యనందిస్తూ ఏటా ఉత్తమ ఫలితాలు సాధిస్తున్న మోడల్ స్కూళ్లకు ఎంతో ప్రత్యేకత ఉంది. విద్యార్థులను చదువులో మెరికలుగా తీర్చిదిద్దుతుండడంతో ఈ విద్యాలయాలకు ఆదరణ పెరుగుతున్నది. ఏటా ప్రవేశాలకు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వెల్లువెత్తుతుండగా, ఈ సంవత్సరం అడ్మిషన్ల గడువు నేటితో ముగియనున్నది.
-తిమ్మాపూర్ రూరల్, జూలై 9
గ్రామీణ ప్రాంత విద్యార్థులకు అందుబాటులో నాణ్యమైన విద్యనందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మోడల్ స్కూళ్లను ప్రవేశపెట్టింది. మోడల్ స్కూళ్లలో హైస్కూల్ విద్యతో పాటు ఇంటర్మీడియట్ కూడా నడుస్తున్నది. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీ కోర్సులు అందుబాటులో ఉండగా ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు.
ఆహ్లాదకరమైన వాతావరణం..
తిమ్మాపూర్ మండల కేంద్రంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో మోడల్ స్కూల్ నిర్మించారు. గతంలో కోర్సుకు 80సీట్లు ఉండగా, ప్రస్తుతం ప్రతి కోర్సులో సీట్లను 40కి తగ్గించారు. కార్పొరేట్ స్థాయిలో విద్యను అందిస్తుండగా, బాలికలకు ఉచితంగా హాస్టల్ వసతి కూడా ఉంది. హాస్టల్, స్కూల్లో విద్యార్థుల సంరక్షణకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఇంగ్లిష్ మీడియంతో కూడిన విద్యను అందిస్తుండగా తిమ్మాపూర్ మండల విద్యార్థులకు ప్రథమ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మిగిలిన సీట్లను ఇతర ప్రాంతాల విద్యార్థులకు ఇవ్వనున్నారు.
ఇలా దరఖాస్తు చేసుకోవాలి
విద్యార్థులు ఆన్లైన్ ద్వారా www.tsmode lschools.in వెబ్వైట్లో లాగిన్ అయి తిమ్మాపూర్ మోడల్ స్కూల్ ఎంపిక చేసుకుని కోర్సును ఎంచుకొని దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకున్న అప్లికేషన్ ఫారం ప్రింట్ తీసుకుని కళాశాలలో ఇవ్వాలని ప్రిన్సిపాల్ పద్మ, వైస్ ప్రిన్సిపాల్ ఆదిత్య తెలిపారు. దరఖాస్తుకు ఎలాంటి ఫీజు లేదని చెప్పారు. అప్లికేషన్ చేసుకునే సమయంలో పాఠశాల, కోర్సు ఎంపికను జాగ్రత్తగా చూసుకోవాలని సూచించారు.
సద్వినియోగం చేసుకోవాలి
మోడల్ స్కూల్లో ఇంటర్‌ను ప్రతిష్టాత్మకంగా చదివే విద్యార్థులనే తీసుకుంటున్నాం. ఇంగ్లిష్ మీడియంలో ముఖ్యమైన కోర్సులు అన్ని అందుబాటులో ఉన్నాయి. మండల విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి. ఆన్లైన్లో ఎలాంటి తప్పులు లేకుండా నమోదు చేసుకోవాలి. కార్పొరేట్ విద్యాలయాల్లో వేల ఫీజులు చెల్లించే బదులు, ప్రభుత్వం ఉచితంగా అందిస్తున్న విద్యను సద్వినియోగం చేసుకోవాలి.
– ఏ పద్మ, ప్రిన్సిపాల్, మోడల్ స్కూల్