నమస్తే నెట్వర్క్, జూలై 7 : కేంద్రం మరోసారి వంట గ్యాస్ ధర పెంచడంతో టీఆర్ఎస్ భగ్గుమన్నది. తొలిపండుగ ఏకాదశి పూట ఒకేసారి 50 బాదడంతో కన్నెర్ర జేసింది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసనలతో హోరెత్తించింది. ఖాళీ సిలిండర్లను ప్రదర్శిస్తూ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలు చేపట్టారు. రోడ్లపై కట్టెల పొయ్యిలు పెట్టి వంటలు చేస్తూ ‘మోదీ దిగిపో.. బై బై మోదీ’ అంటూ నినదించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో జరిగిన ఆందోళనలో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొనగా, ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, దాసరి మనోహర్‌రెడ్డి, సుంకె రవిశంకర్, కోరుకంటి చందర్, ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డితో పాటు పార్టీ జిల్లాల అధ్యక్షులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. – నమస్తే నెట్వర్క్, జూలై 7
సామాన్య ప్రజలపై భారం వేస్తూ కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌పై 50 పెంచడంపై టీఆర్ఎస్ శాఖ భగ్గుమంది. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపట్టింది. రోడ్లపై ఖాళీ సిలిండర్లు ప్రదర్శిస్తూ.. కట్టెల పొయ్యిలపై వంట చేస్తూ నిరసన తెలిపింది. పెద్దపల్లి జిల్లా ధర్మారంలో జరిగిన ఆందోళనల్లో మంత్రి కొప్పుల ఈశ్వర్ పాల్గొన్నారు. పెద్దపల్లిలో జరిగిన ధర్నాకు ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి హాజరయ్యారు. గోదావరిఖని రాజీవ్ రహదారిపై రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ నేతృత్వంలో పెద్ద ఎత్తున ధర్నా, రాస్తారోకో చేపట్టారు. మెట్పల్లి పట్టణంలో ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఆధ్వర్యంలో టీఆర్ఎస్ శ్రేణులు, మహిళలు ఆందోళన చేపట్టారు. ఎమ్మెల్యే నివాసం నుంచి ర్యాలీగా పాత బస్టాండ్‌కు చేరుకుని 63వ జాతీయ రహదారిపై బైఠాయించారు. కట్టెల పొయ్యి వెలిగించి వంట చేశారు.
జగిత్యాల – పెద్దపెల్లి రహదారిపై జడ్పీ చైర్పర్సన్ దావ వసంత ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సిరిసిల్లలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి అధ్వర్యంలో నిరసన తెలిపారు. ఖాళీ సిలిండర్లు పక్కన పెట్టి కట్టెల పొయ్యి వెలిగించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, జడ్పీ చైర్పర్సన్ అరుణ ఇక్కడ పాల్గొన్నారు. కరీంనగర్‌లోని తెలంగాణ చౌక్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో భారీ నిరసన తెలిపారు. ‘మోదీ దిగిపో.. బై బై మోదీ’ అంటూ నినాదించారు. చొప్పదండిలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లను పెట్టి రోడ్డుపై కట్టెల పొయ్యితో వంట చేస్తూ నిరసన తెలిపారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మను కట్టెల పొయ్యితో దహనం చేశారు. హుజూరాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో ధర్నా, రాస్తారోకో నిర్వహించారు.
మహిళా లోకం భగ్గుమంటున్నది..
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇష్టమొచ్చినట్లు నిత్యావసరాల ధరలు పెంచుతున్నది. పెట్రోలు, డీజిల్ రేట్లను పెంచి అన్ని వర్గాలపై తీవ్రమైన భారం మోపింది. రూ. 400 ఉన్న సిలిండర్ ఇప్పుడు ఏకంగా రూ.1105కు చేరింది. మోదీ తీరుపై మహిళాలోకం భగ్గుమంటున్నది. వంటింట్లో చిచ్చుపెట్టిన కేంద్రంపై ఉద్యమానికి సిద్ధమవుతున్నది. ఇప్పటికైనా పెంచిన ధరలను ఉపసంహరించుకోవాలి. లేదంటే వచ్చే సాధారణ ఎన్నికల్లో తగిన ఫలితం అనుభవించాల్సి వస్తది.
– ఎమ్మెల్సీ పాడి కౌశిక్‌రెడ్డి
పేదలపై మోయలేని భారం
ఓ వైపు ముడి చమురు ధరలు తగ్గినా కేంద్రం మాత్రం ఏటా గ్యాస్ సిలిండర్ ధరలను పెంచుతున్నది. సామాన్యులపై మోయలేని భారం మోపుతున్నది. 2014లో 410 ఉన్న సిలిండర్ ధరను 1125కు పెంచింది. ఎనిమిదేండ్ల పాలనలో 170 శాతం పెంచి పేదల జీవితాలతో చెలగాటమాడుతున్నది. బీజేపీ పాలనకు ముందు దేశం అప్పు 55 లక్షల కోట్లు ఉంటే, మోదీ పాలనలో రెండింతలైంది. సర్కారు ఆస్తులను అమ్మి ప్రైవేట్‌పరం చేసి దేశాన్ని బీజేపీ అప్పులమయం చేసింది. ప్రజల మధ్య మత కల్లోలాలు సృష్టిస్తూ.. రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తూ.. అధోగతి పాలు చేస్తున్నది.