పెద్దపల్లి, జూలై 7 (నమస్తే తెలంగాణ) : అనాదిగా వేదాలకు, మేధావులకు నిలయంగా విశ్వవ్యాప్తం చెందిన వేద నిలయం, సరస్వతీ పుత్రుల జన్మస్థలం అలనాటి మంత్రపురి నేటి మంథని. అక్కడ పుట్టిపెరిగి హైదరాబాద్ రాష్ట్రంలో విద్యావేత్తగా ఎదిగి విద్యారంగంలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చిన విద్యావేత్త వరహాల భీమయ్య. 1911 డిసెంబర్ 20న జన్మించిన ఆయన, వరహాల రాజన్న-అంబక్క దంపతులకు ఏకైక సంతానం. 1935వ దశకంలోనే ఎమ్మెస్సీలో గోల్డ్‌మెడల్ సాధించి, నిజాం సంస్థానంలో విద్యా శాఖ మంత్రిగా, దొండెరాజ్ మహారాజ్‌కు వ్యక్తి గత సహాయకుడిగా పనిచేశారు.
హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావుకు వ్యక్తిగత కార్యదర్శిగా, సలహాదారుడిగా పనిచేసిన భీమయ్య, నీతి నిజాయితీగా, ముక్కుసూటితనంతో తన విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించారు. అప్పటి ప్రభు త్వం (1950-51)లో విద్యా సంస్కరణలకు నాంది పలకడంలో కీలక పాత్ర పోషించారు. రాష్ట్ర వ్యాప్తంగా మొట్టమొదటి సారిగా ప్రైమరీ, మిడిల్ స్కూల్, హైస్కూళ్లను అప్‌గ్రేడ్ క్రమంగా చేయించారు. అనేక వెనుకబడ్డ, మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలలు, కళాశాలలను అప్‌గ్రేడ్ చేయడంతోపాటు సర్కారు విద్యను ప్రజలందరికీ చేరువయ్యేలా అనేక సంస్కరణలు అమలు చేయించడంలో భీమయ్య కృషి అనిర్వచనీయం. రాష్ట్రం లో తెలుగులోనే విద్యా బోధన జరగాలనే చారిత్రాత్మక నిర్ణయం అప్పటి ప్రభుత్వం తీసుకోవ డం వెనుక భీమయ్య అకుంఠిత దీక్షాదక్షత, దూ రదృష్టి ఎంతో ఉన్నది. ఆయన కృషితోనే నేడు తెలుగులో విద్యాబోధన కొనసాగుతున్నది.
మంథని ప్రభుత్వ హైస్కూల్ ఆవరణలో భీమయ్య విగ్రహం..
1946లో మంథనిలో ఏర్పాటైన మిడిల్ స్కూల్‌ను వరహాల భీమయ్య అప్‌గ్రేడ్ చేయించారు. మారుమూల ప్రాంతంగా ఉన్న మంథనిలో ఎందరో బడుగు, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత విద్య అందుబాటులోకి తెచ్చారు. ఈ పాఠశాల అభివృద్ధితోపాటు అనేక మంది పేద, విద్యార్థుల జీవితాల్లో విద్యతో వెలుగు నింపేందుకు కృషి చేశారు. 1956 జనవరి 6న.. 45 ఏళ్ల వయసులో అనారోగ్యంతో భీమయ్య చనిపోగా, స్మారకంగా పాఠశాల ఆవరణలో విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. మంథనికి చెందిన శ్రీ సీతారామ సేవా సదన్ ఆధ్వర్యంలో 2011 డిసెంబర్ 20న ఆయన విగ్రహాన్ని అప్పటి మంత్రి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు ఆవిష్కరించారు.
భీమయ్య స్మారకార్థం ఓయూలో గోల్డ్ మెడల్ ప్రదానం..
తెలుగు విద్యా వ్యాప్తికి చేసిన కృషిని గుర్తించిన వరహాల భీమయ్య స్మారకంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉస్మానియా యూనివర్సిటీలో ఏటా కెమిస్ట్రీ విభాగంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు గోల్డ్ మెడల్ ప్రదానం చేస్తున్నది. తాజాగా మంథనికి చెందిన విద్యార్థి యువత ఆధ్వర్యంలో వరహాల భీమయ్యను స్మృతిస్తూ ‘విద్యా స్రష్ట విశిష్ట పురస్కార ప్రదానోత్సవాన్ని’ ఈ నెల 9న (శనివారం) నిర్వహిస్తున్నారు. ఈ అవార్డును తెలంగాణ ప్రభుత్వ పాఠ్య పుస్తకాల రచయిత, ఎన్సీఈఆర్టీ జనరల్ బాడీ పూర్వ సభ్యులు, తెలుగు తప్పనిసరి అమలు కమిటీ సభ్యుడు, రీడింగ్ క్యాంపెయిన్ స్టేట్ కో-ఆర్డినేటర్, కరికులం రూప కల్పన, పరీక్షల సంస్కరణ కమిటీ సభ్యుడు సువర్ణ వినాయక్ అందుకోనున్నారు.
రేపు వినాయక్‌కు భీమయ్య స్మారక అవార్డు..
మంథని ఫ్రెండ్స్ క్లబ్లో విద్యార్థి యువత ఆధ్వర్యంలో వరహాల భీమయ్య స్మారక అవార్డును మంథనికి చెందిన మరో విద్యావేత్త సువర్ణ వినాయక్‌కు శనివారం అందజేసేందుకు ఏర్పాట్లు చేశారు. ఉదయం 11గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి హన్మకొండ, నిజామాబాద్ అడిషనల్ కలెక్టర్లు కామొజ్జల చంద్రమోహన్, గట్టు సంధ్యారాణి, ప్రముఖులు కొల్లారపు ప్రకాశ్‌రావు, రావికంటి శ్రీనివాస్, చంద్రుపట్ల సుధాకర్ రెడ్డి, కర్రు సురేశ్, ఖాజామొయినొద్దీన్, సీహెచ్ పోచయ్య హాజరవుతున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు.