కరీంనగర్ రూరల్, జూలై 7: విద్యార్థులు ఉన్నత లక్ష్యాన్ని ఎంచుకొని, ఆ దిశగా ముందుకు సాగాలని మార్తాండ రావు చారిటబుల్ మెమోరియల్ ట్రస్టు చైర్పర్సన్ రాజ్యలక్ష్మి పిలుపునిచ్చారు. కరీంనగర్ రూరల్ మండలం నగునూర్ జడ్పీ ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాల విద్యార్థులకు మార్తాండరావు చారిటబుల్ ట్రస్టు ఆధ్వర్యంలో గురువారం ఆమె తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ చెన్నాడి అమిత్‌కుమార్‌తో కలిసి నోట్‌బుక్స్ పంపిణీ చేశారు. ఈసందర్భంగా ట్రస్టు చైర్పర్సన్ రాజ్యలక్ష్మి మాట్లాడుతూ, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు చదువులో రాణించి తల్లిదండ్రులకు, గురువులకు మంచి పేరు తేవాలని సూచించారు. 2015 నుంచి పాఠశాల అభివృద్ధికి తమవంతు సహకారం అందించడంతో పాటు ప్రతి సంవత్సరం విద్యార్థులకు నోట్ బుక్స్ అందిస్తున్నట్లు తెలిపారు.
విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ మెడికల్ కౌన్సిల్ సభ్యుడు డాక్టర్ చెన్నాడి అమిత్‌కుమార్ మాట్లాడుతూ, 2015 నుంచి మార్తాండరావు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా విద్యార్థులకు నోట్‌బుక్స్ పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. బోయినపల్లి మండలం కోరం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలతో పాటు పలు గ్రామాల్లోని పాఠశాలలను దత్తత తీసుకుని విద్యార్థులకు నోట్ బుక్స్ అందిస్తున్నట్లు తెలిపారు. నగునూర్‌లోని ప్రతిమ వైద్యశాలలో గ్రామంలోని చిన్నారులకు ఉచిత వైద్యసేవలందిస్తున్నట్లు పేర్కొన్నారు. పాఠశాలలో విద్యార్థుల కోసం ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి, వైద్య సేవలందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ సభ్యులు భాగ్యలత, సంపత్‌రావు, ప్రధానోపాధ్యాయుడు కట్ల వెంకటేశ్వర్లు, విద్యా కమిటీ చైర్మన్ రాజు, ఎంపీటీసీలు అంకమల్ల శ్రీనివాస్, సాయిల వినయ్‌సాగర్, దావు రవి తేజ, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.