కార్పొరేషన్, జూలై 7: కేంద్ర ప్రభుత్వం గ్యాస్ సిలిండర్ ధర పెంచడంపై జిల్లా టీఆర్ఎస్ శాఖ భగ్గుమంది. టీఆర్ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు నగరంలోని తెలంగాణ చౌక్‌లో పార్టీ జిల్లా అధ్యక్షుడు, సుడా చైర్మన్ జీవీ రామకృష్ణారావు ఆధ్వర్యంలో ఖాళీ సిలిండర్లతో నిరసన తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్న మోదీ దిగిపో.., బై బై మోదీ అంటూ నినదించారు. బీజేపీకి, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు మాట్లాడుతూ, కేంద్రం ధరలను ఇష్టానుసారంగా పెంచుతూ ప్రజలపై పెను భారం మోపుతున్నదని విమర్శించారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నదని దుయ్యబట్టారు.
తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను చూడలేని బీజేపీ రాష్ట్రంపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నదని విమర్శించారు. బీజేపీకి ప్రజలు తగిన బుద్ధి చెప్పాలన్నారు. మేయర్ వై సునీల్‌రావు మాట్లాడుతూ, పేదలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇస్తున్నామని చెప్పుకొంటున్న మోదీ ప్రతి నెలా సిలిండర్ ధర పెంచుతూ సామాన్యులపై పెను భారం మోపుతున్నారని దుయ్యబట్టారు. కార్పొరేట్ కంపెనీల కోసమే కేంద్రం పని చేస్తున్నదని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీకి ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్ర రాజు, కార్పొరేటర్లు సుధగోని మాధవి, గుగ్గిళ్ల జయశ్రీ, గంట కళ్యాణి, గందె మాధవి, ఐలేందర్‌యాదవ్, టీఆర్ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్ పొన్నం అనిల్‌కుమార్‌గౌడ్, టీఆర్ఎస్ నాయకులు చల్ల హరిశంకర్, మెండి చంద్రశేఖర్, కాశెట్టి శ్రీనివాస్, శ్రీధర్, మహిళలు తదితరులు పాల్గొన్నారు.