13 చోట్ల రూ. 5 కోట్లతో పనులు
మేయర్ వై సునీల్‌రావు
కార్పొరేషన్, జూలై 7: నగరంలోని 13 చౌరస్తాలను రూ. 5 కోట్లతో సుందరీకరిస్తున్నట్లు మేయర్ వై సునీల్‌రావు తెలిపారు. నగరంలోని జ్యోతినగర్‌లో రూ. 10 లక్షలతో చేపట్టనున్న వివేకానంద చౌరస్తా, అల్గునూర్‌లో రూ.36 లక్షలతో అభివృద్ధి చేయనున్న అంబేద్కర్ విగ్రహ చౌరస్తా సుందరీకరణ పనులను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, అంబేదర్, స్వామి వివేకానంద విగ్రహాల ఏర్పాటుతో పాటు ఐలాండ్స్‌ను సుందరంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. ఈ చౌరస్తాలను గ్రీనరీతో పాటు పౌంటెన్లతో అందంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. ఇప్పటికే చౌరస్తాలకు సంబంధించి డిజైన్లను పూర్తి చేసి, టెండర్ల ప్రక్రియ కూడా పూర్తి చేసినట్లు వెల్లడించారు. ప్రతి చౌరస్తాలో ట్రాఫిక్ సిగ్నలింగ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. నాలుగు నెలల్లో సుందరీకరణ పనులు పూర్తి చేస్తామని చెప్పారు. నగరంలో ఇప్పటికే రూ.8 కోట్లతో పలు పార్కులను సుందరంగా తీర్చిదిద్ది ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు.
పర్యావరణ సమతుల్యతను కాపాడాలి
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణ సమతుల్యతను కాపాడేందుకు కృషి చేయాలని మేయర్ వై సునీల్‌రావు పిలుపునిచ్చారు. హరితహారంలో భాగంగా ఎన్టీఆర్ విగ్రహం నుంచి పద్మనగర్ వరకు బైపాస్ రోడ్డు డివైడర్ల మధ్యలో మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ, హరితహారం మొకలు నాటేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. కరీంనగర్‌ను గ్రీన్ సిటీగా మార్చేందుకు నగర వాటికలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నర్సరీల్లో ఆరు లక్షల మొకలు సిద్ధంగా ఉన్నాయని, డివిజన్లలో అవెన్యూ ప్లాంటేషన్‌తో పాటు నగర ప్రధాన రహదారుల మధ్యలో మొకలు నాటుతామని స్పష్టం చేశారు. డివిజన్ల వారీగా ఇంటింటికీ మొకలు పంపిణీ చేస్తామని తెలిపారు. ప్రధానంగా ఈసారి నగరవాటికలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ హరితహారంలో భాగస్వాములై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమాల్లో మున్సిపల్ కమిషనర్ సేవా ఇస్లావత్, కార్పొరేటర్లు గందె మాధవి, సల్ల శారద-రవీందర్, జంగిలి ఐలేందర్‌యాదవ్, నేతికుంట యాదయ్య, టీఆర్ఎస్ నాయకులు చల్ల హరిశంకర్, సత్తినేని శ్రీనివాస్, బల్దియా అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.