గన్నేరువరం, నవంబర్ 22: ప్రభుత్వ సూచనల మేరకు యాసంగిలో రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయాధికారి వాసిరెడ్డి శ్రీధర్ సూచించారు. సోమవారం మండలంలోని గుండ్లపల్లి ఐకేపీ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన సందర్శించారు. రైతులతో మాట్లాడారు. ధాన్యం కొనుగోల్లు ఏవిధంగా జరుగుతున్నాయో అడిగి తెలుసుకున్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలుగకుండా ఏర్పాట్లు చేయాలని కొనుగోలు కేంద్రం నిర్వాహకులకు సూచించారు. అలాగే గ్రామంలో రైతులు సాగు చేస్తున్న వేరు శనగ పంటలను రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ గూడెల్లి తిరుపతితో కలిసి పరిశీలించారు. తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన చర్యలను రైతులకు వివరించారు. అనంతరం గుండ్లపల్లి రైతు వేదికలో వ్యవసాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. పంటల సాగు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతులు మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలని వారికి సూచించారు. కార్యక్రమంలో రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు గూడెల్లి తిరుపతితోపాటు ఏవో కిరణ్మయి, ఏఈవో నరేశ్ తదితరులు పాల్గొన్నారు.