రామడుగు, జూలై 6: అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పని చేసి, గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని ఎంపీపీ కలిగేటి కవిత సూచించారు. స్థానిక మండల పరిషత్ కార్యాలయ సమావేశ మందిరంలో ఎంపీపీ కలిగేటి కవిత అధ్యక్షతన బుధవారం మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. మండలంలోని అన్ని ప్రభుత్వ శాఖల అధికారులు మూడు నెలల్లో జరిగిన ప్రగతి నివేదికలు చదివి వినిపించారు. కాగా, విద్యుత్ శాఖ సబ్ ఇంజినీర్ మాట్లాడుతుండగా పందికుంటపల్లి సర్పంచ్ ఎల్లయ్య కల్పించుకొని గ్రామ పంచాయతీకి చెందిన ఒకే మీటర్‌కు రూ. లక్షా 24 వేల 612 బిల్లు వచ్చిందని సభ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై అధికారి సమాధానమిస్తూ బిల్లు ఒకసారి పరిశీలించి చూస్తామని హామీ ఇచ్చారు. ఏపీవో రాధ ప్రగతి నివేదిక చదువుతుండగా దేశరాజ్‌పల్లి సర్పంచ్ కోల రమేశ్ మాట్లాడుతూ, పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో మొక్కలు నాటి, ట్రీగార్డులను ఏర్పాటు చేయడానికి గ్రామ పంచాయతీలకు ప్రత్యేక నిధులు ఎంత ఇస్తున్నారని ప్రశ్నించారు.
తహసీల్దార్ రాజ్‌కుమార్ ప్రగతి నివేదికలు చదివి వినిపిస్తుండగా వెంకట్రావుపల్లి సర్పంచ్ జవ్వాజి శేఖర్ కల్పించుకొని కొత్త రేషన్ కార్డులు ఎప్పుడు వస్తాయని అడుగగా, రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉందని తెలిపారు. ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీశారు. అనంతరం ఎంపీపీ కవిత మాట్లాడుతూ, సర్వసభ్య సమావేశం సమస్యలను పరిష్కరించేందుకే ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. సభ్యులు సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని సూచించారు. గ్రామాల అభివృద్ధికి అధికారులు, ప్రజాప్రతినిధులు సహకరించాలని కోరారు. జడ్పీ కో-ఆప్షన్ సభ్యుడు శుక్రొద్దీన్, ఎంపీడీవో ఎన్నార్ మల్హోత్రా, తహసీల్దార్ రాజ్‌కుమార్, ఎంఈవో అంబటి వేణుకుమార్, ఏవో యాస్మిన్, సీడీపీవో కస్తూరి, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.