పెగడపల్లి, జూలై 6 : క్యాన్సర్‌ను తొలి దశలోనే గుర్తించి చికిత్స తీసుకుంటే ప్రాణాలకు ముప్పుండదని జగిత్యాల జిల్లా ఎస్పీ సింధూశర్మ పేర్కొన్నారు. ఎల్ఎం కొప్పుల సోషల్ సర్వీస్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో పెగడపల్లి మండలం ఎల్లాపూర్ ప్రభుత్వ పాఠశాలలో బుధవారం ఏర్పాటు చేసిన ఉచిత క్యాన్సర్ నిర్ధారణ, మెగా వైద్య శిబిరాన్ని ట్రస్ట్ చైర్మన్, మంత్రి ఈశ్వర్ సతీమణి కొప్పుల స్నేహలత, కూతురు నందినితో కలిసి ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం క్యాన్సర్ వ్యాధి బాగా పెరిగిపోయిందని, 35 ఏళ్లు దాటిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఎల్ఎం కొప్పుల సోషల్ ఆర్గనైజేషన్ ద్వారా మారుమూల ప్రాంతంలో ఇలాంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ట్రస్ట్ చైర్మన్‌ను అభినందించారు.
క్యాన్సర్ నిర్ధారణ పరీక్షల కోసం ఎంఎన్ఏ హాస్పిటల్ వైద్యులు రావడం ఎంతో గొప్ప విషయమన్నారు. ట్రస్ట్ చైర్మన్ స్నేహలత మాట్లాడుతూ, పేదలకు ఉచితంగా వైద్య సేవలు, విద్యను అందించడంతోపాటు, వారికి అన్ని రకాలుగా అండగా ఉండేందుకే ఎల్ఎం కొప్పుల సోషల్ ఆర్గనైజేషన్‌ను ప్రారంభించినట్లు వివరించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు వ్యాధులపై నిర్లక్ష్యంగా ఉంటారని, వారికి అవగాహన కల్పించి, రోగ నిర్ధారణ పరీక్షలు చేసేందుకు వీటిని నిర్వహిస్తున్నట్లు వివరించారు. ఉచిత మెగా వైద్య శిబిరానికి విశేష స్పందన రాగా, అందులో 526 మందికి వైద్య పరీక్షలు చేసి, మందులు పంపిణీ చేశారు. క్యాన్సర్‌కు సంబంధించి 32 మందికి హైదరాబాద్ ఎంఎన్‌జే అంకాలజీ వైద్యులు పరీక్షలు చేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కాసుగంటి రాజేందర్రావు, సర్పంచ్ ముద్దం అంజమ్మ మల్లేశం, ఎంపీటీసీ కొత్తపల్లి రవీందర్ తదితరులున్నారు.