ధర్మారం, నవంబర్ 22: ఒగ్గుడోలుకు తరగని ఆదరణ లభిస్తున్నదని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. సమైక్య పాలనలో నిరాదరణకు గురైన కళాకారులు, తెలంగాణ భాషకు స్వరాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు వచ్చిందన్నారు. ధర్మారం మండలంలో సోమవారం మంత్రి ఈశ్వర్ పర్యటించారు. ధర్మారంలో ఫ్లెక్సీ ముద్రణ దుకాణాన్ని ప్రారంభించారు. అనంతరం మండల పరిషత్ కార్యాలయంలో దళిత మహిళలకు కుట్టు మిషన్ శిక్షణపై అవగాహన సమావేశానికి, తర్వాత నర్సింహులపల్లెలో జరిగిన ఒగ్గుడోలు శిక్షణ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై కళాకారులకు ధ్రువీకరణ పత్రాలు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆయాచోట్ల మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రధానంగా సీఎం కేసీఆర్‌తో తెలంగాణ తెలుగు భాషకు ఎంతో గుర్తింపు వచ్చిందన్నారు. కళాకారులకు ప్రత్యేక గుర్తింపును ఇచ్చి వారికి ఉపాధి కల్పిస్తున్నారని పేర్కొన్నారు. గొల్లకుర్మల వారసత్వ ఒగ్గుడోలు కళకు రాష్ట్ర తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ ఎంతో గుర్తింపునిస్తున్నదన్నారు. ఆ శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ ఇచ్చిన ప్రోత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒగ్గుడోలు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించడంతో ఎంతో మందికి ఈ కళపై ఆసక్తి పెరుగుతుందన్నారు.
జాతీయ, అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన నర్సింహులపల్లి వాసి ఒగ్గుడోలు కళాకారుడు బొప్పనపల్లి ఐలయ్య 21 రోజుల పాటు వివిధ జిల్లాలకు చెందిన యువతకు శిక్షణనివ్వడం ఎంతో ప్రశంసనీయమని కొనియాడారు. 21 రోజుల పాటు కళాకారులకు భోజన వసతి కల్పించిన కొలుముల దామోదర్ ఫౌండేషన్ వారిని, ఇతర దాతలను మంత్రి ఈశ్వర్ అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి ఈశ్వర్‌ను ఐలయ్య సన్మానించారు. శిక్షణ పొందిన వారికి మంత్రి జ్ఞాపికలు అందజేశారు. కాగా, అంతకు ముందు మంత్రి ఈశ్వర్‌కు ఐలయ్య అధ్వర్యంలో ఒగ్గుడోలు కళాకారులు ఘనస్వాగతం పలికి ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఉస్మానియా యూనివర్సిటీ ఒగ్గుడోలు కళ పరిశోధన విద్యార్థి కావటి సతీశ్ అధ్యక్షత వహించగా, జడ్పీటీసీ పూస్కూరు పద్మజ, సర్పంచ్ అడువాల అరుణజ్యోతి, ఎంపీటీసీ దాడి సదయ్య, ఉప సర్పంచ్ కత్తెర్ల కోమలత, నంది మేడారం ప్యాక్స్ చైర్మన్ ముత్యాల బలరాంరెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ గుర్రం మోహన్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండలాధ్యక్షుడు మిట్ట తిరుపతి, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు కోమటిరెడ్డి బుచ్చిరెడ్డి, ఎంపీడీవో జయశీల, తహసీల్దార్ వెంకట లక్ష్మి, ఒగ్గు, బీర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఒగ్గు ధర్మయ్య, ప్రధాన కార్యదర్శి ఒగ్గు రవి, పెద్దపల్లి మాజీ ఎంపీపీ సునీతారాజేందర్, అడ్వకేట్ మేకల మల్లేశం, నాయకులు మారం తిరుపతి, యాదవ సంఘం మండలాధ్యక్షుడు సందినేని కొమురయ్య, సర్పంచులు, ఎంపీటీసీ సభ్యులు, జీపీ సభ్యులు కొలుముల దామోదర్ ఫౌండేషన్ ఇన్చార్జి వేల్పుల నాగరాజు, ఆవుల ఎల్లయ్య, ఆవుల మల్లయ్య, కత్తెర్ల లచ్చయ్య, ఒగ్గుడోలు కళాకారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.