కార్పొరేషన్, జూలై 5: నగరాభివృద్ధే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారు. నగరంలోని కోర్టు రిజర్వాయర్ పరిధిలో ఏఈ క్వార్టర్స్ నిర్మాణ పనులకు మంగళవారం ఆయన భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కరీంనగర్‌ను స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. నగర అభివృద్ధికి సీఎం కేసీఆర్ భారీగా నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ నిధులతో అన్ని డివిజన్లలో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, ఇతర అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. నగర ప్రజలకు రోజూ నీటి సరఫరా అందిస్తున్నట్లు తెలిపారు. కోర్టు రిజర్వాయర్ సామర్థ్యాన్ని పెంచేందుకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు పేర్కొన్నారు. అలాగే, రూ.35 లక్షలతో ఏఈ కార్యాలయాన్ని ఆధునీకరించి, సమావేశ మందిరం నిర్మిస్తామని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో నగర ప్రజలు మంచినీటి కోసం తీవ్ర ఇబ్బందులు పడినట్లు పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయడంతో రిజర్వాయర్ల సామర్థ్యం పెంచి ప్రజలకు రోజూ నీరందిస్తున్నట్లు స్పష్టం చేశారు.
త్వరలోనే 24 గంటల మంచినీటి సరఫరా
నగరంలో 24 గంటల మంచినీటి సరఫరా అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఇప్పటికే నగరంలోని రాంపూర్, హౌసింగ్‌బోర్డుకాలనీ, భగత్‌నగర్ రిజర్వాయర్ల పరిధిలో 24 గంటల మంచినీటి సరఫరాకు సంబంధించి పనులు ప్రారంభించామన్నారు. అతి త్వరలోనే ట్రయల్ రన్ ప్రక్రియ చేపడుతామన్నారు. నగరంలో పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా మంచినీటిని అందించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. కోర్టు రిజర్వాయర్‌లో ప్రస్తుతం ఉన్న ట్యాంక్‌లకు తోడు రూ. 1.95 కోట్లతో 9 లక్షల లీటర్ల సామర్థ్యంతో మరో ట్యాంక్ నిర్మించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రజలకు తమపై ఉన్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా పని చేస్తున్నట్లు తెలిపారు.
మొక్కలు నాటి సంరక్షించాలి
పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని మంత్రి గంగుల కమలాకర్ పిలుపునిచ్చారు. 9వ డివిజన్లోని ఫిల్టర్ బెడ్, ఎల్ఎండీ సమీపంలో ఆయన మొకలు నాటి నగర వనాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, పెద్ద ఎత్తున వనాలను పెంచి పచ్చదనం ద్వారా వాతావరణ సమతుల్యతను కాపాడాలన్నారు. మానవాళికి పచ్చని చెట్లే జీవనాధారం అని సూచించారు. సీఎం కేసీఆర్ హరితహారం కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టి విజయవంతంగా కొనసాగిస్తున్నారని తెలిపారు. రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం ద్వారా అడవుల శాతం పెరిగిందన్నారు. ఈసారి నగరవనాల పేరిట పెద్ద సంఖ్యలో మొకలు నాటుతామని తెలిపారు. డివిజన్ల వారీగా ఇంటింటికీ మొకలు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. కలెక్టర్ ఆర్వీ కర్ణన్, మేయర్ వై సునీల్‌రావు, అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి-హరిశంకర్, కార్పొరేటర్లు ఐలేందర్‌యాదవ్, బండారి వేణు, బుచ్చిరెడ్డి, రాపర్తి విజయ, టీఆర్ఎస్ నాయకులు చల్ల హరిశంకర్, కాశెట్టి శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.