పెగడపల్లి, జూలై 3 : పది రోజుల క్రితం ముంబై ఎయిర్‌పోర్టులో కిడ్నాపైన నందగిరి గ్రా మానికి చెందిన మత్తమల్ల శంకరయ్య కథ సుఖాంతమైంది. ఎట్టకేలకు పది రోజుల తర్వాత ఉత్కంఠకు తెరపడింది. ఈ నెల 22న ముంబై ఎయిర్‌పోర్టులో కిడ్నాపైన శంకరయ్యను పోలీసులు పాం డిచ్చేరిలో పట్టుకున్నారు. శంకరయ్య క్షేమంగా సో మవారం నందగిరికి రానుండడంతో కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముంబై పో లీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్ర కారం, జీవనోపాధి కోసం ఐదేళ్ల క్రితం దుబాయి వెళ్లిన శంకరయ్య, ఇంటికి తిరిగి వచ్చేందుకు గత నెల 22వ తేదీన దుబా యి నుంచి వచ్చి ముంబై ఎయిర్పోర్టలో దిగాడు. ఇంటికి ఫోన్ చేసి తాను ముంబై ఎయిర్‌పోర్టులో దిగినట్లు, ఇంటికి వస్తున్నట్లు తెలిపాడు. నాలుగు రోజులైనా ఇంటికి తిరిగి రాకపోయే సరికి భార్య అంజవ్వ, కొడుకు హరీశ్, ఇతర కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. ముంబైలో ఉన్న బంధువులకు సమాచారమిచ్చినా అతడి ఆచూకీ దొరకలేదు.
దీంతో శంకరయ్య కొడుకు హరీశ్ ముంబై వెళ్లి, అక్కడే ఉంటున్న నందగిరి పంచాయతీ వార్డు సభ్యుడు గర్వంద సతీశ్ గౌడ్ సహకారంతో పలు చోట్ల గాలించినా, అతని జాడ దొరక్కపోవడంతో అక్క డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. శంకరయ్య వద్ద బంగారం, కొంత నగదు ఉండడంతో వచ్చేటప్పుడు విమానంలో పరిచయమైన వ్యక్తి, అతడి అనుచరుల సహాయంతో కిడ్నాప్ చేసి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేశారు. కాగా గత నెల 27న తమిళనాడులోని తిరుచ్చి జిల్లా నుంచి తమకు శంకరయ్య కాల్ చేసి తాను ఒక దవాఖానలో ఉన్నానని, తనను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేసి ఇక్కడకు తీసుకొచ్చినట్లు దవాఖాన సిబ్బంది ఫోన్ నుంచి కొడుకు హరీశ్‌కు కాల్ చేశాడు. ఆ నంబర్‌ను ట్రేస్ చేసిన ముంబై పోలీసులు, ఆ కోణంలో దర్యాప్తు ప్రారంభించి, తిరుచ్చి వెళ్లారు.
కిడ్నాపర్లు ఈ నెల 1న శంకరయ్యను కట్టి బంధించిన ఫొటోను పంపి రూ.15 లక్షలు ఇస్తేనే వదిలి వేస్తామని బెదిరింపులకు గురిచేశారు. ఫొటో పంపిన ఫోన్ లోకేషన్ ట్రేస్ చేసిన పోలీసులు తంజావూర్, కుంభకోణంలో గాలించి, అక్కడి నుంచి పాండిచ్చేరీ వెళ్లి గాలించి శనివారం రాత్రి శంకరయ్యను దాచి ఉంచిన స్థావరాన్ని గుర్తించారు. పోలీసుల రాకను గుర్తించిన కిడ్నాపర్లు శంకరయ్యను అక్కడే వదిలి పెట్టి పారిపోయారు. అక్కడి నుంచి సురక్షితంగా శంకరయ్యను ముంబై పోలీసులు రాత్రి చెన్నైకి, ఆదివారం అక్కడి నుంచి ముంబైకి విమానంలో తీసుకొచ్చారు. అక్కడి పోలీసులు పూర్తి వివరాలు సేకరించి, శంకరయ్యను కొడుకు హరీశ్, వార్డు సభ్యుడు సతీశ్ గౌడ్‌కు అప్పగించారు. సోమవారం అతడిని స్వగ్రామం నందగిరికి తీసుకురానున్నారు. కిడ్నాప్ విషయాన్ని మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీశ్ రావు, గంగుల కమలాకర్‌కు కుటుంబ సభ్యులు, టీఆర్ఎస్ నాయకులు వివరించడంతో వెంటనే స్పందించిన వారు జిల్లా ఎస్పీ ద్వారా, అక్కడి పోలీసులకు సమాచారం అందించి, అతని ఆచూకీ తెలుసుకునేందుకు సహకరించారు.