మెట్పల్లి, జూలై 3: పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు తనయుడు డా. సంజయ్ అండగా నిలుస్తున్నారు. సామాన్య, మధ్య తరగతి కుటుంబాలకు చెందిన అభ్యర్థులకు తన సొంత ఖర్చులతో ఉచితంగా శిక్షణ ఇప్పించాలని నిర్ణయించారు. తన తండ్రి ‘కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు ఫౌండేషన్’ పేరిట మెట్‌పల్లిలోని వాసవి గార్డెన్స్‌లో ఉచిత శిక్షణ కేంద్రం ఏర్పాటు చేశారు. ఈ నెల 10న మంత్రి కేటీఆర్ ప్రారంభించగా, విశేష స్పందన లభిస్తున్నది. కోచింగ్ సక్సెస్‌ఫుల్‌గా నడుస్తున్నది.
మూడు నెలలపాటు శిక్షణ..
గ్రూప్స్, ఇతర ఉద్యోగాలకు మూడు నెలల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. కరీంనగర్‌కు చెందిన లక్ష్యం అకాడమీ ఆధ్వర్యంలో సుశిక్షితులైన హైదరాబాద్, విజయవాడకు చెందిన వివిధ సబ్జెక్టుల్లో విశేష ప్రావీణ్యం కలిగిన శిక్షకులతో కోచింగ్ ఇప్పిస్తున్నారు. ప్రస్తుతం కోచింగ్ కేంద్రంలో 450 మంది అడ్మిషన్లు తీసుకోగా, అందులో 172 మంది యువతి, 278 మంది యువకులు ఉన్నారు. కోరుట్ల, మెట్పల్లి పట్టణాలతోపాటు మల్లాపూర్, ఇబ్రహీంపట్నం, మెట్పల్లి, కోరుట్ల మండలాలకు చెందిన నిరుద్యోగ అభ్యర్థులు దీనిని సద్వినియోగం చేసుకుంటుండగా, వీరిలో అత్యధికంగా మహిళలే ఉన్నారు.
సకల వసతులు.. ఫ్రీ భోజనం..
కేంద్రంలో ప్రతి రోజూ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తరగతులు నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల వరకు మాత్రమే విరామం ఇస్తున్నారు. ఈ సమయంలో భోజనం కోసం ఎక్కడికో వెళ్లకుండా కోచింగ్ కేంద్రం వద్దే ఉచితంగా భోజనం పెడుతున్నారు. ఆదివారం మినహా అన్ని రోజుల్లో క్లాసులు చెబుతుండగా, వారానికోసారి గుడ్డు, మిగతా రోజుల్లో కూరగాయలతో కూడిన మంచి రుచికరమైన భోజనం వడ్డిస్తున్నారు.
గ్రూప్స్‌కు ప్రిపేరవుతున్నా
గ్రూప్స్‌కు ప్రిపేరవుతున్నా. హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకోవడం నాలాంటి వాళ్లకు ఇబ్బందే. డా. సంజయ్ నేతృత్వంలో మెట్పల్లిలో ఉచితంగా కోచింగ్ కేంద్రం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉన్నది. మా వేములకుర్తి నుంచి ప్రతి రోజూ వచ్చి వెళ్తున్నా. అనుభవజ్ఞుతులతో కోచింగ్ ఇప్పిస్తున్నారు. చాలా చక్కగా అర్థమయ్యే విధంగా బోధన చేస్తున్నారు. ఉచిత కోచింగ్ తీసుకోవడం అదృష్టంగా భావిస్తున్నా. తప్పకుండా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం కలుగుతుంది.
– గుడ్ల సంజీవ్, వేములకుర్తి (ఇబ్రహీంపట్నం మండలం)
వసతులు బాగున్నాయి..
నేను ఎంఏ, బీఈడీ పూర్తి చేశా. ఇది వరకు గ్రూప్-2, 4 పరీక్షలకు హాజరైనప్పటికీ సరైన కోచింగ్ తీసుకోకపోవడం వల్ల ఉద్యోగం సాధించలేకపోయిన. ఇప్పుడు గ్రూప్-1కు దరఖాస్తు చేసిన. విద్యాసాగర్‌రావు ఫౌండేషన్ పేరిట ఆయన కొడుకు డా. సంజయ్ ఆధ్వర్యంలో ఉచితంగా కోచింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేయడం సంతోషదాయకం. మా లాంటి మధ్యతరగతి కుటుంబాల అభ్యర్థులకు ఈ ఉచిత కోచింగ్ కేంద్రం ఎంతో మేలు చేస్తుంది. ఇక్కడ మంచి ఫ్యాకల్టీతో పాటు భోజనం, ఇతరత్రా వసతులు బాగున్నాయి. కోచింగ్ కేంద్రానికి ప్రతి రోజూ కోరుట్ల మండలం అయిలాపూర్ నుంచి ఆర్టీసీ బస్సులో వచ్చి వెళ్తున్నా. అయిలాపూర్ నుంచి మెట్‌పల్లికి వచ్చిపోవడానికి రోజుకు 80 ఖర్చు అవుతున్నది. మా లాంటి వారి కోసం ఆర్టీసీ బస్ పాస్ ఇప్పించినట్లయితే ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పుతుంది. ఈ విషయంపై ఎమ్మెల్యే సారు స్పందించి బస్‌పాస్‌లు ఇప్పించాలి.
– మైలారపు రాజ్యలక్ష్మి, అయిలాపూర్ (కోరుట్ల మండలం)
అవకాశాలను అందిపుచ్చుకోవాలి
వివిధ శాఖల్లో ఉద్యోగాల భర్తీకి సర్కారు నోటిఫికేషన్లు ఇస్తున్నది. ఇంత కాలం ఉద్యోగాల కోసం ఎదురు చూసిన నిరుద్యోగ యువతకు ఇది మంచి అవకాశం. ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకోవాలి. పట్టుదల, తపనతో పట్టుబట్టి చదివి కొలువు సాధించాలి. దూర ప్రాంతాలకు వెళ్లి పోటీ పరీక్షల కోసం కోచింగ్ తీసుకునే స్థోమత, పరిస్థితులు అనుకూలించని వారెందరో ఉన్నారు. అలాంటి వారి కోసం పైసా ఖర్చు లేకుండా కోచింగ్ ఇవ్వడంతో పాటు మధ్యాహ్నం పూట భోజనం అందిస్తున్నాం. అవసరమైన పుస్తకాలను ఉచితంగా ఇస్తున్నాం. మూడు నెలల పాటు కొనసాగే కోచింగ్ కేంద్రానికి క్రమం తప్పకుండా హాజరవ్వాలి. శ్రద్ధగా విని పోటీ పరీక్షలో రాణించి ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు సాధించి మన కోరుట్ల నియోజకవర్గానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షిస్తున్నా.
– కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు, కోరుట్ల ఎమ్మెల్యే
అభ్యర్థుల వద్దకే శిక్షకులు
గతంలో పోటీ పరీక్షలకు సన్నద్ధం కావాలంటే కోచింగ్ కోసం హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లక తప్పేది కాదు. అక్కడ నివాసం, భోజనం వంటి వసతులతో పాటు ఇతరత్రా వాటి కోసం ఆర్థిక పరమైన ఇబ్బందులు పడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోని అభ్యర్థుల చెంతకే శిక్షకులు వచ్చి కోచింగ్ ఇవ్వడం శుభపరిణామం. దీని వల్ల నాణ్యతతో కూడిన బోధన అందుతున్నది. భోజనం, వసతులకు ఇబ్బంది ఉండదు. ఆర్థిక పరమైన సమస్యలు తలెత్తవు. కోరుట్ల నియోజకవర్గంలోని నిరుద్యోగ యువతకు ఇదొక మంచి అవకాశం. ముఖ్యంగా గ్రూప్స్, ఇతరత్రా పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. హైదరాబాద్, విజయవాడ తదితర ప్రాంతాలకు చెందిన ట్యూటర్లు కోచింగ్ ఇస్తున్నారు. శిక్షణ తీసుకున్న అభ్యర్థుల్లో చాలా మంది ఉద్యోగాలు పొందుతారని ఆశిస్తున్నాం.
కోచింగ్ చాలా బాగుంది
నేను బీఎస్సీ (బీజడ్సీ) చదివా. పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ పోస్టులకు దరఖాస్తు చేసుకున్నా. పరీక్షలకు సిద్ధమవుతున్న క్రమంలో మెట్పల్లిలో ఉచితంగా శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న మా ఊరు వేంపేట నుంచి ప్రతి రోజూ బస్సులో వచ్చి వెళ్తున్నా. ట్యూటర్లు చాలా బాగా కోచింగ్ ఇస్తున్నారు. వివిధ సబ్జెక్ట్‌లలో అనుమానాలను నివృత్తి చేస్తున్నారు. వీరి కోచింగ్ ఉద్యోగ పోటీ పరీక్షలకు ఎంతో దోహదపడుతున్నది. కోచింగ్ తీసుకోవడం వల్ల కచ్చితంగా ఉద్యోగం సాధిస్తాననే నమ్మకం నాలో పెరుగుతున్నది.
– చందనగిరి రవీనా, వేంపేట (మెట్పల్లి మండలం)
సులువుగా మార్కులు సాధించవచ్చు
గ్రూప్-1,2,3,4 పోటీ పరీక్షలకు సోషియాలజీ ఉపయోగపడే సబ్జెక్ట్. కనీసం 35 నుంచి 50 ప్రశ్నలు వస్తాయి. సామాజిక అంశాలు, సమాజంలోని పరిస్థితులపై అవగాహన పెంచుకోవడం వల్ల తేలిగ్గా మార్కులు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. నేను గుంటూరు నుంచి ఇక్కడికి వచ్చా. ఉద్యోగ పోటీ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఈ కోచింగ్‌ను చక్కగా వినియోగించుకున్నట్లయితే తప్పకుండా మంచి ఫలితాన్ని పొందుతారు.