సారంగాపూర్, జూలై 3: కరీంనగర్ డెయిరీకి తెలంగాణతోపాటు దేశ స్థాయిలో మంచి ఆదరణ ఉందని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. చాలా తక్కువ సంస్థలు మాత్రమే డెయిరీ విభాగంలో విజయవంతమయ్యాయని, అందులో కరీంనగర్ డెయిరీ ఒకటి కావడం గర్వకారణమని చెప్పారు. సారంగాపూర్ మండలం కమ్మునూర్లో ఏర్పాటు చేసిన బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్ కేంద్రాన్ని కరీంనగర్ డెయిరీ చైర్మన్ చల్మెడ రాజేశ్వర్‌రావుతో కలిసి ఆయన ఆదివారం ప్రారంభించి మాట్లాడారు. కరీంనగర్ డెయిరీలో దాదాపు 70వేల మంది సభ్యులుగా ఉన్నారని, రైతులకు దాణా, గేదెలు, ఆహారం తదితర విషయాల్లో డెయిరీ తరపున అవగాహన కల్పిస్తారని పేర్కొన్నారు.
డెయిరీలో నాణ్యమైన ఉత్పత్తులను తయారు చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో మంచి సారవంతమైన భూములు, నీళ్లు ఉన్నా, సీఎం కేసీఆర్ అన్ని మౌలిక సదుపాయాలు కల్పించినా రైతుల విషయంలో మార్కెటింగ్ లోపం ఉందన్నారు. రైతులు ఐక్యంగా ఉండి ఒక సొసైటీగా ఏర్పడితే ప్రభుత్వ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. కాగా బీర్పూర్లో పంచాయతీ నిధులతో నిర్మించే సీసీరోడ్డు పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు. అనంతరం కోమన్‌పల్లికి చెందిన చిత్తరి రామయ్య ఇటీవల మృతి చెందగా బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ఎండీ శంకర్, కేడీసీసీబీ జిల్లా సభ్యుడు ముప్పాల రాంచందర్‌రావు, ఎంపీపీ మసర్తి రమేశ్, జడ్పీటీసీ పాత పద్మ రమేశ్, వైస్ ఎంపీపీ బల్మూరి లక్ష్మణ్ రావు, సర్పంచ్ బందెల మరియారాజేశం, సింగిల్ విండ్ చైర్మన్ నవీన్ రావు, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు నల్లమైపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.