మెట్పల్లి, జూలై 3: సర్కారు నిర్మిస్తున్న డబుల్ బెడ్రూం ఇండ్లు నిరుపేదల ఆత్మగౌరవ ప్రతీకలని కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్‌రావు అభివర్ణించారు. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని చెప్పారు. మెట్పల్లి శివారు అర్బన్ హౌసింగ్ కాలనీ సమీపంలోని డబుల్ బెడ్రూం ఇండ్ల లబ్ధిదారులకు ఆదివారం హక్కు పత్రాలు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పేదలకు పైసా ఖర్చులేకుండా సకల వసతులతో కూడిన ఇండ్లను అందిస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కిందన్నారు. ఇలాంటి గొప్ప పథకం తెలంగాణలో రాష్ట్రంలో తప్పా మరెక్కడా లేదని చెప్పారు. అంతేకాకుండా ఆసరా, షాదీముబారక్, కల్యాణలక్ష్మి లాంటి స్కీంలను తెచ్చి అభాగ్యుల బతుకుల్లో వెలుగులు నింపుతున్నదని పేర్కొన్నారు. మెట్పల్లి పట్టణానికి 310 డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరు కాగా, ఇప్పటికే 110 ఇండ్లను నిర్మించి లబ్ధిదారులకు అందించామన్నారు. త్వరలోనే మరో 200 ఇండ్లు కట్టించి అందజేస్తామని ప్రకటించారు. అర్హులందరికీ ఇండ్లు వస్తాయని, ఎలాంటి ఆందోళన చెందవద్దని సూచించారు. నిరంతరం ప్రజల కోసం తపించే తనను నాలుగుసార్లు గెలిపించి అసెంబ్లీకి పంపించారన్నారు. అయితే కుల, మతాల మధ్య చిచ్చుపెట్టే పార్టీకి చెందిన నాయకులు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు. వారికి ప్రజల చేతిలో పరాభవం తప్పదని హెచ్చరించారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా టీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రాణవేని సుజాత, ఉపాధ్యక్షులు చంద్రశేఖర్‌రావు, తహసీల్దార్ సత్యనారాయణ, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.