కోల్‌సిటీ, జూన్ 23: కళా భవన్ నిర్మాణంలో కదలిక వచ్చింది. కొంత కాలంగా కళా సంఘాల సమాఖ్య ప్రతినిధులు చేస్తున్న ప్రయత్నం ఫలించనున్నది. కళాభవన్ నిర్మాణానికి రామగుండం నగర పాలక సంస్థ ఆమోదం తెలిపి, టెండర్ ప్ర క్రియను పూర్తి చేసినా అనుకోని విధంగా అర్ధంతరంగా నిలిచింది. అప్పటి నుంచి కళాకారుల ప్రాధాన్యత, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కళాభవన్ నిర్మాణంలో ప్రత్యేక చొరవ చూపుతూ వస్తున్నారు. కళాభవన్ నిర్మాణానికి రీ టెండర్ నిర్వహణకు అనుమతి దాదాపు ఖరారు కాగా, మరో నాలుగు రోజుల్లో టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేయనున్నట్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఆర్ అండ్ బీ శాఖ ఇన్చార్జి సూపరింటెండెంట్ ఇంజినీర్ తీపి కబురు చెప్పడంతో పారిశ్రామిక ప్రాంత కళాకారుల్లో సర్వత్రా హర్షం వ్యక్తమవుతుంది.
రామగుండం పారిశ్రామిక ప్రాంతం నుంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కళారంగంలో ఎదిగిన వారున్నారు. మూడు దశాబ్దాలుగా ఈ ప్రాంతంలో కళాభవన్ నిర్మాణం కోసం సీనియర్ కళాకారులు పోరాటం చేస్తున్నారు. 2018లో రామగుండం నగర పాలక సంస్థ కళాభవన్ నిర్మాణానికి ముందుకు వచ్చి గోదావరిఖనిలోని 28వ డివిజన్ పరిధి హనుమాన్ నగర్‌లోని సర్వే నంబరు 690లోని విశాలమైన ఖాళీ స్థలంలో రూ.4 కోట్ల నిధులతో పూర్తి చేయాలని తీర్మానం చేసింది. 2019 ఫిబ్రవరి 1వ తేదీన ఎమ్మెల్యే చందర్, మేయర్ అనిల్‌కుమార్ భూమి పూజ చేశారు.
వారం రోజుల్లో పనులను చేపడుతామని చెప్పిన కాంట్రాక్టర్ సుధాకర్ రావు దురదృష్టవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో అర్ధంతరంగా నిలిచిపోయాయి. గోదావరి కళా సంఘాల సమాఖ్య ప్రతినిధులు ప్రజాప్రతినిధులు, అధికారులను కలిసి రీ టెండర్ కోసం ప్రయత్నాలు చేస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యే పలుమార్లు ఉన్నతాధికారులను కలిసి రీ టెండర్‌కు అనుమతి ఇవ్వాలని విన్నవించారు.
ఈ నేపథ్యంలో గురువారం కరీంనగర్ ఇన్చార్జి సూపరింటెండెంట్ ఇంజినీర్ సత్యనారాయణను గోదావరి కళా సంఘాల సమాఖ్య అధ్యక్షుడు కనకం రమణయ్య కలిసి వినతి పత్రం అందజేశారు. ఇందుకు స్పందించిన ఎస్ఈ మాట్లాడారు. కళాభవన్‌కు రీ టెం డర్ నిర్వహణకు అనుమతి జారీ అయిందని, సోమవారం టెండర్ ప్రక్రియను కూడా పూర్తి చేసేందుకు అన్ని చర్యలు చేపట్టామని తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం కళాకారుల సంక్షేమానికి కట్టుబడి ఉంది. రాష్ట్ర ఉద్యమంలో ఈ ప్రాంత కళాకారుల పాత్ర వెలకట్టలేనిది. ఇక్కడ కళాభవన్ నిర్మించాలని మొదటి నుంచి నేనూ ప్రయత్నం చేస్తున్నా. అధునాతన హంగులతో హైదరాబాద్ తరహాలో కళాభవన్ నిర్మాణం తలపెట్టినం. త్వరలోనే పనులు మొదలయ్యేలా చర్యలు తీసుకుంటా.
-కోరుకంటి చందర్, ఎమ్మెల్యే
కళాభవన్ కోసం నిరీక్షిస్తున్నాం. ఎమ్మెల్యే చందర్ హయాంలో కళాభవన్ కల నెరవేరినా అనుకోకుండా ఆగిపోయింది. కళాభవన్ రీ టెండర్‌కు అనుమతులు జారీ చేయడంలో కృషి చేసిన ఎమ్మెల్యే చందర్, మేయర్ అనిల్‌కుమార్, ఆర్అండ్బీ ఎస్ఈ సత్యనారాయణకు కళాకారుల తరఫున కృతజ్ఞతలు.
-కనకం రమణయ్య, కళా సంఘాల అధ్యక్షుడు