కలెక్టరేట్, మే 23: జనహిత కార్యక్రమంలో ప్రజలు అందించిన ఫిర్యాదులపై అధికారులు సత్వరమే పరిష్కార మార్గాలు చూపాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. జనహిత కార్యక్రమంలో భాగంగా సమీకృత కలెక్టరేట్లో సోమవారం ప్రజల నుంచి కలెక్టర్ అర్జీలు స్వీకరించి, మాట్లాడారు. జనహితలో వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులు క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలన్నారు. పెండింగ్ అర్జీలపై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు.
భూ సమస్యలపై ఎక్కువగా అర్జీలు వస్తున్నాయని, రెవెన్యూ అధికారులు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ధరణికి వచ్చే దరఖాస్తుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టిసారించాలన్నారు. అర్జీలపై విచారణ జరిపి తీసుకున్న చర్యల నివేదికను 15 రోజుల్లోగా పిటిషనర్‌కు తెలియజేసి, జనహిత పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని ఆదేశించారు. జనహితకు 29 అర్జీలు వచ్చినట్లు తెలిపారు. ఇక్కడ అదనపు కలెక్టర్లు బీ సత్యప్రసాద్, ఎన్ ఖీమ్యానాయక్, ఆర్డీవో టీ శ్రీనివాసరావు, ఏవో బీ గంగయ్య, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
సిరిసిల్ల టౌన్, మే 23: బస్తీ దవాఖాన నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు. స్థానిక 23వ వార్డు లో బస్తీ దవాఖాన నిర్మాణ పనులను మున్సిపల్ కమిషనర్ వెల్దండి సమ్మయ్యతో కలిసి సోమవారం ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, మున్సిపల్ పరిధిలోని రాజీవ్‌నగర్‌లో 13లక్షలతో దవాఖా న నిర్మాణ పనులు జరుగుతున్నాయని తెలిపారు.
పట్టణ ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని ఉచితంగా అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం మున్సిపల్ పరిధిలో బస్తీ దవాఖానను నిర్మిస్తున్నదని చెప్పారు. కాంపౌండ్ వాల్, సెప్టిక్ ట్యాంకు, మరుగుదొడ్లపై స్లాబ్, రెయిలింగ్ పనులను త్వరగా పూర్తి చేసి జూన్ 2వ తేదీలోగా అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. ఇక్కడ మున్సిపల్ ఏఈఈ వరుణ్ ఉన్నారు.