కరీంనగర్, జనవరి 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉన్న కరీంనగర్ డెయిరీపై ఆరోపణలు వద్దని, నిజానిజాలు తెలుసుకొని మాట్లాడాలని కరీంనగర్ డెయిరీ చైర్మన్ రాజేశ్వర్‌రావు సూచించారు. లక్షల మంది రైతు కుటుంబాలకు చెందిన సంస్థ అన్న విషయం మరిచి కొంత మంది తమ స్వార్థం కోసం లేనిపోని అపోహలు సృష్టించేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తమ డెయిరీ నుంచి వచ్చే పాలు, ఇతర ప్రొడక్టుల విషయంలో ఎక్కడా రాజీపడే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. తప్పుడు ఆరోపణలను వినియోగదారులు పరిగణలోకి తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ నెల 12 డెయిరీలో రైతు కుటుంబాలకు ముగ్గుల పోటీలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఈ మేరకు కరీంనగర్ డెయిరీలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరీంనగర్ డెయిరీ క్వాలిటీలో రాజీ పడకుండా వినియోగదారుల మన్నలు పొందుతూ నేడు రాష్ట్రంలోనే ఆగ్రగామిగా నిలుస్తున్నదని చెప్పా రు. కానీ, కొంత మంది పని గట్టుకొని మూడు నెలలుగా విష ప్రచారం చేస్తున్నారని ఆగ్రహించారు. డెయిరీ పరంగా ఏ తప్పు జరిగినా ఫిర్యాదు చేసేందుకు ప్రభుత్వ విభాగాలున్నాయని, ఇటీవల కొంత మంది డెయిరీపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (పీసీబీ)కు ఫిర్యాదు చేశారని, అటువంటి వాటిని డెయిరీ పరంగా స్వాగతిస్తున్నామన్నారు. ఆ మేరకు సంబంధిత అధికారులు వచ్చి పరిశీలించి ఇచ్చిన సూచనలు అమలు చేశామని చెప్పారు.
కానీ, కొంతమంది మాత్రం డెయిరీ పాలలో కెమికల్ కలుపుతున్నారని, నీళ్లు మిక్స్ చేస్తున్నారని, వినియోగిస్తున్న నీటితో చుట్టుపక్కల ప్రాంతాల్లో టీడీఎస్ పెరుగుతున్నదని, డెయిరీ నుంచి విష పదార్థాలు విడుదలవుతున్నాయని, తద్వారా చుట్టుపక్కల కాలనీల్లో చర్మవ్యాధులు వస్తున్నాయని, పిల్లలు వికలాంగులుగా పుడుతారని, అబార్షన్లు అవుతాయంటూ నోటికి వచ్చినట్టు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. వీటిని డెయిరీ పరంగా పూర్తిగా ఖండిస్తున్నామని ప్రకటించారు. కొంతమంది ప్రైవేట్ డెయిరీలతో కలిసి ఈ దుష్పప్రచారానికి ఒడిగడుతున్నట్టు పాలకవర్గం భావిస్తున్నదన్నారు. డెయిరీ చుట్టుపక్క ప్రాంతాలకు ఎటువంటి హాని లేకుండా అనేక రకాల చర్యలు తీసుకుంటున్నామని, పాలలోనీళ్లు గానీ, కెమికల్స్గానీ ఏమాత్రం కలుపడం లేదని, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అనుమతులతో శాస్త్రీయంగా పర్యావరణానికి ఎటువంటి హాని లేకుండా పాలు, పాల పదార్థాలు ప్రాసెస్ చేస్తున్నామని స్పష్టం చేశారు.
బాయిల్ చిమ్నీ కూడా పీసీబీ సూచన మేరకు నడిపిస్తున్నామని, పాలు, ఇతర పదార్థాల తయారీ ప్రాసెస్ కోసం వినియోగించే నీటిని ఎంప్లుయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ (ఈటీపీ) ద్వారా శుద్ధి చేస్తూ తిరిగి డెయిరీ అవసరాలకు వినియోగిస్తున్నామని వివరించారు. డెయిరీ సిటీ సెంటర్లో ఉండడంతో చర్మరోగాలు వస్తున్నాయంటూ ఆరోపణలు చేస్తున్నారన్నారు. హైదరాబాద్‌లోని లాలాగూడ నడిబొడ్డున విజయ డెయిరీ ఉందని, అలాగే ఢిల్లీ, బెంగళూర్ నడిబొడ్డున డెయిరీలున్నాయని, అక్కడ లేని సమస్యలు ఇక్కడెలా ఉత్పన్నమవుతాయని, ప్రజలు ఒక్కసారి గమనించాలని విజ్ఞప్తి చేశారు. 1971లో ప్రారంభమైన డెయిరీ 1998 నాటికి నష్టాల బాట పట్టిందని, ఆ స్థితి నుంచి ఈరోజు రాష్ట్రంలో నంబర్‌వన్ స్థానానికి తెచ్చామని చెప్పారు.
దీని వెనక పార్టీలకతీతంగా ప్రజాప్రతినిధుల సహకారంతోపాటు అధికారులు, పాలకవర్గసభ్యులు, పాడి రైతులు, వినియోగదారులు, డెయిరీ సిబ్బంది సహకారం సంపూర్ణంగా ఉందన్నారు. ఆ ఫలితంగానే ఒకనాడు 12వేల లీటర్ల పాల సేకరణ జరిగిన డెయిరీలో ప్రస్తుతం 1.80 లక్షల లీటర్ల పాల సేకరణ జరుగుతున్నదని వివరించారు. అందులో విక్రయాలు, ప్రొడక్ట్‌ల ఉత్పతికి 1.50 లక్షల లీటర్ల పాల వినియోగిస్తున్నామని, ఇవిపోను దాదాపు 30వేల లీటర్లను మనం పౌడర్ తయారు చేయడానికి చిత్తూరుకు పంపుతున్నామన్నారు. నిజానికి గతంలో వివిధ దేవాలయాలకు పాలు, నెయ్యి మన డెయిరీ నుంచి పంపేవారని, ప్రభుత్వం జీవో ఇవ్వడం వల్ల ప్రస్తుతం దేవాలయాలకు విజయ డెయిరీ పాలు వెళ్తున్నాయన్నారు. తిరిగి పునరుద్ధరించాలని కోరుతూ ప్రభుత్వానికి, సంబంధిత మంత్రికి, అధికారులకు విజ్ఞప్తి చేశామన్నారు. సమావేశంలో డైరెక్టర్లు నారాయణరెడ్డి, ప్రభాకర్‌రావు, ఎండీ శంకర్‌రెడ్డి, డెయిరీ సిబ్బంది పాల్గొన్నారు.
కరీంనగర్ డెయిరీ లక్షల మంది రైతు కుటుంబాలకు సంబంధించిన సంస్థ. వినియోగదారుల నమ్మకాన్ని పెంచుతూ ఇప్పుడు రాష్ట్రంలోనే నంబర్‌వన్ స్థానంలో నిలబెట్టాం. నిరాధారమైన ఆరోపణలు డెయిరీ సేల్స్‌పై ప్రభావం చూపుతాయి. ఆ ప్రభావం పాడి రైతులపైనా పడుతుంది. అటువంటి డెయిరీపై బేస్‌లెస్ ఆరోపణలు చేయద్దు. డెయిరీ అభివృద్ధికి సహకరించాలి.
– రాజేశ్వర్‌రావు