రాంనగర్, జనవరి 25 : పోలీస్స్టేషన్లకు చెంది న వివిధ రకాల పని విభాగాల్లో ఆరు నెలలుగా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో కొనసాగుతున్న కరీంనగర్ కమిషనరేట్, తాజాగా 13వ విభాగంలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ విషయాన్ని వీసీలో డీజీపీ అంజన్‌కుమార్ వెల్లడించి, అభినందించారు. డీజీపీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం బుధవారం రాష్ట్రంలోని వివిధ విభాగాలకు చెందిన ఉన్నతాధికారులు, కమిషనర్లు, జిల్లాలకు చెందిన ఎస్పీలు, వివిధ విభాగాలకు చెందిన అధికారులతో వీసీ నిర్వహించిన ఆయన, కరీంనగర్ కమిషనరేట్ ఈ నెలలో 13 విభాగాల్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలించిందని చెప్పారు. కమిషనరేట్‌లోని పోలీసుల పనితీరును రాష్ట్రంలోని వివిధ జిల్లాల పోలీసులు ఆదర్శంగా తీసుకొని పనిచేయాలని సూచించారు. రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలవడంపై సీపీ సత్యనారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన పోలీసు అధికారులను అభినందించారు. అధికారులు ఇదే స్ఫూర్తితో ముందుకు సాగుతూ మరిన్ని ఫలితాలు తేవాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఏసీపీలు తుల శ్రీనివాసరావు, కరుణాకర్‌రావు, విజయ్‌కుమార్, వెంకటరెడ్డి, సత్యనారాయణ, కాశయ్య, శ్రీనివాస్, ప్రతాప్, ఎస్బీఐ వెంకటేశ్వర్లు, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.