‘ఇప్పటికి సగం తెలంగాణలో నా పర్యటన పూర్తయింది. ఎక్కడికెళ్లినా అద్భుత స్పందన కనిపిస్తున్నది. ఎవరు ఏమన్నా.. ఎంత మొత్తుకున్నా.. కచ్చితంగా బీఆర్ఎస్ గవర్నమెంటే వస్తది. అందులో మనకు ఏ డౌట్ అవసరం లేదు. మనం ప్రజలతో ఉన్నం.. ప్రజలు మనతో ఉన్నరు. 30 తారీఖున వాస్తవమేంటో చూపెడుతరు’ అని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. శుక్రవారం కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై, తన ప్రసంగంతో ప్రజలను చైతన్యం చేశారు.
బీఆర్ఎస్ గెలుపు పక్కా అని స్పష్టం చేసిన అధినేత, యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు జరిగిన నష్టాన్ని ప్రజలకు వివరిస్తూనే బీజేపీని తూర్పారబట్టారు. ఉమ్మడి జిల్లాకు ఒక్క మెడికల్ కళాశాల, నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా వేయవద్దని పిలుపునిచ్చారు. పదేళ్లలో చేసిన అభివృద్ధి కండ్ల ముందున్నదని, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించుకుంటే మరింత అభివృద్ధి జరుగుతుందని చెప్పారు. ఎన్నికల వేళ ఆగమైతే కష్టాలు కొనితెచ్చుకున్నట్టే అవుతుందని, ఆలోచించి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
– కరీంనగర్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
ఎస్సారార్ కళాశాల మైదానానికి ఒక ప్రత్యేకత ఉన్నది. తెలంగాణ ఉద్యమ చరిత్రలో 2001లో నిర్వహించిన మొట్ట మొదటి సింహగర్జన బహిరంగ సభ ఇదే వేదికగా జరిగింది. ఆరోజు లక్షలాది జనం తరలివచ్చిన్రు. ఆ సమావేశం తెలంగాణ ఉద్యమ చరిత్రలోనే ఒక అపూర్వమైన ఘట్టం. అలాగే, అనేక మంచి కార్యక్రమాలు దళితబంధు, రైతుబంధు, రైతుబీమా కరీంనగర్ వేదికగానే మనం ప్రకటించుకున్నం. తెలంగాణ ఉద్యమానికి, తెలంగాణ ప్రజలకు వ్యక్తిగతంగా ఉద్యమ నాయకుడినైన నాకు అనేక విజయాలు అందించిన ఈ కరీంనగర్ మట్టికి నేను శిరస్సు వంచి నమస్కరిస్తున్న. కరీంనగర్లో నిరంతరం అందుబాటులో ఉంటూ పట్టుబట్టి అభివృద్ధి పనులు చేస్తున్న గంగుల కమలాకర్‌ను భారీ మెజార్టీతో గెలిపించండి. మంచి మెజార్టీ ఇచ్చి ఆశీర్వదిస్తే కమలాకర్ మళ్లీ పెద్ద పొజిషన్లో ఉంటడు. అందుకే అన్నీ ఆలోచించండి. అభివృద్ధిని చూసి బీఆర్ఎస్కు ఓటు వేయండి. ఒక్క మెడికల్ కళాశాల, నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా మనం వేయద్దు.
– కరీంనగర్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
చొప్పదండి నియోజకవర్గంలో మహిమాన్వితమైన కొండగట్టు అంజన్న క్షేత్రం ఉన్నది. నేను ఈ మధ్యనే వచ్చి దర్శించుకున్న. రూ.వెయ్యి కోట్లు ఖర్చయినా ఈ క్షేత్రాన్ని బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం. ఆ బాధ్యత నేనే తీసుకుంట. నియోజకవర్గంలో చెరువులను బాగు చేసుకున్నం. చెక్‌డ్యామ్‌లు కట్టుకున్నం. వరద కాలువకు తూములు పెట్టుకొని వేలాది చెరువులను నింపుకున్నం. ఇప్పుడు లక్షా 25వేల ఎకరాలకు సాగు నీరు అందుతున్నది. ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ విజ్ఞప్తి మేరకు చొప్పదండి నియోజకవర్గ కేంద్రానికి 100 పడకల దవాఖాన మంజూరు చేసినం. అధికారంలోకి రాగానే గోపాల్రావుపేట, గర్శకుర్తి ప్రాంతాలను మండలాలుగా ప్రకటిస్తం. ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం పుట్టి, ఎదిగిన బీఆర్ఎస్కు మద్దతు ఇవ్వండి. బీఆర్ఎస్ అభ్యర్థి సుంకె రవిశంకర్‌ను గెలిపించండి.
– చొప్పదండి ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర్
పాడి కౌశిక్‌రెడ్డి నా కొడుకులాంటోడు.. ఈటల రాజేందర్ పార్టీలోకి రాకముందే వీళ్ల నాన్న పాడి సాయినాథ్‌రెడ్డి బీఆర్ఎస్ జెండా మోసిండు.. హుజూరాబాద్‌లో కౌశిక్‌రెడ్డిని గెలిపించండి.. మీకు అండగా ఉంటా.. అన్నీ చేసిన నన్ను కాదని.. ఇంకెవన్నో ఎత్తుకుంటే మంచిదా? ఒకసారి ఆలోచించండి.. మంచి ఏదో.. చెడు ఏదో ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏ పార్టీకి ఓటు వెయ్యాలో, ఏ పార్టీ ప్రజలకు మేలు చేసిందో గ్రామాల్లో చర్చ పెట్టాలి. ఇక్కడి నుంచి గెలిచిన ఈటల రాజేందర్ ఏమీ చేయలేదు. పాలిచ్చే బర్రెను అమ్ముకుని, ఎగిరి తన్నే దున్నపోతును కొనుక్కున్నట్లు గతంలో నన్ను బాధపెట్టారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి రావద్దు. యువకుడు, సమర్థుడైన కౌశిక్‌రెడ్డిని గెలిపించండి.
– హుజూరాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్
కరీంనగర్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఈ ఎన్నికల్లో కచ్చితంగా మనమే గెలుస్తామని, రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఇప్పటికే సగం తెలంగాణలో తన పర్యటన పూర్తయిందని, ఎక్కడికి వెళ్లినా అద్భుతమైన స్పందన ఉన్నదని హర్షం వ్యక్తం చేశారు. కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలకు ఆయన హాజరై, దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్, బీజేపీ తీరును ఎండగట్టడంతోపాటు గడిచిన తొమ్మిదిన్నరేండ్లలో జరిగిన అభివృద్ధిని వివరించారు. అసెంబ్లీ ఎన్నికల వేళ ప్రజలను చైతన్యం చేశారు. ఎన్నికలంటే ఆషామాషీ కాదని, ప్రజలు ఆలోచించి ఓటు వేయాలని సూచించారు.
స్వరాష్ట్రంలో పేదల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చామని, పింఛన్లు పెంచామని, కంటి వెలుగు, కేసీఆర్ కిట్లు, అమ్మఒడి, కల్యాణలక్ష్మి అమలు చేస్తున్నామని చెప్పారు. రైతుల బాధలు దూరం చేసేందుకు 24 గంటల కరెంట్, సాగునీరు, రైతుబంధు ఇస్తున్నామని, దురదృష్టవశాత్తూ రైతులెవరైనా చనిపోతే బీమా అందిస్తున్నామని గుర్తు చేశారు. ఇంకా ఎన్నో సదుపాయాలు కల్పించుకున్నామని, అందరి మొఖాల్లో వెలుగులు కనిపిస్తున్నాయన్నారు. ఈ రాష్ర్టాన్ని ప్రగతిశీల, క్రియాశీల పద్ధతిలో రాష్ర్టాన్ని ప్రగతి పథంలో తీసుకపోతున్నదెవరు? అలాగే రాష్ట్ర విచ్ఛిన్నతికి ప్రజానీకాన్ని డివైడ్ చేసి స్వార్థ రాజకీయాల కోసం పాకులాడుతున్నదెవరో గమనించాలని, వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని చైతన్యవంతమైన కరీంనగర్ బిడ్డలు ఇతర పార్టీలకు కర్రు కాచి వాత పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
అభివృద్ధి నిరంతరం కొనసాగాలన్నా.. దేశంలో తెలంగాణ అన్నిరంగాల్లో నంబర్ వన్స్థానంలో ఉండాలన్నా.. బీఆర్ఎస్ అభ్యర్థులను మంచి మెజార్టీతో గెలిపించండి. తలసరి ఆదాయంతోపాటు విద్యుత్ వినియోగంలో దేశంలోనే నంబర్ వన్స్థానంలో తెలంగాణ ఉన్నది. తాజాగా, వరిధాన్యం ఉత్పత్తిలో పంజాబ్‌ను దాటి వేసింది. ఈ విషయాన్ని కేంద్ర గణాంకాలే చెబుతున్నయి. అంటే నాడు తెలంగాణ ఎట్లుండె? నేడు ఎట్లయిందో..? ప్రజలు గ్రామాల్లో చర్చపెట్టాలి. ప్రజల చేతుల్లో ఉండే ఒకే ఒక ఆయుధం ఓటు. ఎన్నికలు రాగానే అన్ని పార్టీలు తమ అభ్యర్థులను బరిలో నిలుపుతయి. అయితే, అభ్యర్థితోపాటు ఆ పార్టీ చరిత్ర చూడాలి.
సదరు పార్టీ ప్రజల కోసం ఏమైనా చేసిందా..? చేస్తుందా..? వారి మ్యానిఫెస్టో ఏమిటి? అధికారంలో ఉన్న ఇతర రాష్ర్టాల్లో ఏమైనా ప్రజలకు ఉపయోగపడే పనులు చేసిందా..? అనేటువంటి అంశాలను బేరీజు వేసుకోవాలి. రా యి ఏదో.. రత్నం ఏదో మనం గుర్తించాలి. ఆలోచించి అక్కరకు వచ్చే పార్టీలకు ఓటు వేయాలి. ఆవేశంలోనో.. ఆలోచన చేయకుండానో ఓటు వేస్తే మళ్లీ గోస పడుతం. బీఆర్ఎస్ సంక్షేమం, అభివృద్ధి లక్ష్యంగా ఏర్పడింది. ఇప్పటిదాకా చేసిన అభివృద్ధి కండ్ల ముందున్నది. బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి. ఉద్యమ సమయంలో జరిగిన సింహగర్జన, ఆమరణ నిరాహార దీక్ష, సకలజనుల సమ్మె వంటి అనేక చారిత్రక ఘట్టాలకు వేదికైన కరీంనగర్ బిడ్డలు, ఈనెల 30న జరిగే ఎన్నికల్లో ఆలోచించి నిర్ణయం తీసుకొని ఓటువేయాలి.
– ముఖ్యమంత్రి కేసీఆర్
భారతీయ జనతా పార్టీకి ఒక్క మతపిచ్చి తప్ప ఏమీ రాదు. నేను చెప్పేది ప్రజలంతా శ్రద్ధగా వినాలి. ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో 157 మెడికల్ కాలేజీలు పెట్టిండు. ఒక్క కాలేజీ కూడా తెలంగాణకు ఇవ్వలేదు. ఇక్కడి వాళ్లం ప్రజలం కాదా..? మేం స్వయంగా వంద ఉత్తరాలు రాసినం. ఈ దేశాన్ని సాదే రాష్ర్టాల్లో తెలంగాణ ఒక్కటని చెప్పినం. మాకెందుకు మెడికల్ కాలేజీ ఇవ్వలేదని అడిగినా ఇవ్వలేదు. అయినా మనం నారాజు కాలేదు. ప్రధాని మొఖం మీద కొట్టినట్టుగా ఈరోజు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో నాలుగు మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకున్నం.
ఇదంతా మీ కళ్ల ముందు జరుగుతున్న కథ. యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ఒక్క కళాశాల రాలే. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నాలుగు వచ్చినయ్. అంతే కాదు, జిల్లాకు ఒకటి చొప్పున 33 మెడికల్ కళాశాలలు పెడుతున్నం. ఇప్పుడు తెలంగాణ ప్రతి సంవత్సరం పదివేల మంది డాక్టర్లను ఉత్పత్తి చేసే సామర్థ్యాన్ని సంపాదించుకుంది. జిల్లాకో నవోదయ విద్యాలయం ఇవ్వాలని పార్లమెంట్లో పాసైన చట్టం ఉన్నా కేంద్రం ఒక్కటీ ఇవ్వలేదు. చట్టం ప్రకారం అడిగినా.. ఉత్తరాలు రాసినా.. మన ఎంపీలు పార్లమెంట్లో ప్రశ్నించినా మనకు ఇవ్వలేదు. ఒక్క మెడికల్ కళాశాల, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఒక్క ఓటు కూడా మనమెందుకు వేయాలి? అనే విషయంపై ప్రజలు ఆలోచించాలి.
– ముఖ్యమంత్రి కేసీఆర్
నా ఊపిరి ఉన్నంత వరకు నియోజకవర్గ ప్రజల కోసమే బతుకుతా. వారి వెంటే ఉంటా. ఆపదొస్తే ఆదుకుంటా. దేశాన్ని, రాష్ర్టాన్ని ఏండ్లకొద్ది పాలించిన కాంగ్రెస్ ప్రజలకు చేసిందేమీలేదు. అవినీతి తప్ప వారికి తెలిసిందేమీ లేదు. వారిని నమ్మితే మోసపోతం. చొప్పదండి నియోజకవర్గం ఒకప్పుడు ఎట్ల ఉండె..? ఇప్పుడెట్ల అభివృద్ధి చెందిందో చూడాలి. కాంగ్రెస్‌కు ఓటేస్తే రైతుబంధు, కరెంటు రెండూ బందవుతాయి. రాబోయే ఎన్నికల్లో మళ్లీ కారు గుర్తుకు ఓటేసి భారీ మెజార్టీతో గెలిపించాలని నా విజ్ఞప్తి. రెండోసారి బీఆర్ఎస్ టికెట్ ఇచ్చి, ఈ రోజు ఆశీర్వాదసభకు వచ్చిన సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు.
సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తుంటే, విపక్షాలు మాత్రం విధ్వంసం కోరుకుంటున్నయి. నగరానికి ముఖ్యమంత్రి కేబుల్ బ్రిడ్జి ఇస్తే ప్రతిపక్షాలు కూలగొడుతామంటున్నయి. రాష్ట్రం రాక ముందు నగరం ఎలా ఉండేదో.. ఇప్పుడు ఎలా ఉన్నదో.. చూడాలి. సీఎం కేసీఆర్ ఇచ్చిన నిధులతో ఎంతో అద్భుతంగా చేసినం. బొందల గడ్డగా ఉన్న కరీంనగర్‌ను గొప్ప నగరంగా తీర్చిదిద్దినం. ప్రతిపక్ష నాయకులు కుట్రదారులు. విధ్వంస శక్తులన్నీ ఏకమైనయి. ఒక తప్పు చేస్తే తెలంగాణ మళ్లీ యాభై ఏండ్లు వెనక్కి పోతది. తెలంగాణలో కేసీఆర్ పదేండ్ల పాలనలో సాగుతున్న అభివృద్ధి కావాలా.. ? యాభై ఏండ్ల కాంగ్రెస్ పాలనలోని విధ్వంసం కావాలా..? ప్రజలు ఆలోచించాలి.
– కరీంనగర్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అభ్యర్థి మంత్రి గంగుల కమలాకర్
కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల ప్రజా ఆశీర్వాద సభలు శుక్రవారం గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. కరీంనగర్‌లోని ఎస్సారార్ కాలేజీ గ్రౌండ్, గంగాధర మండలం మధురానగర్ శివారులోని పత్తికుంటపల్లి, జమ్మికుంట పట్టణంలోని డిగ్రీ కళాశాల మైదానంలో సభలు నిర్వహించగా, ఆయా చోట్ల జనం పోటెత్తారు. ఒకే రోజు మూడు చోట్ల సభలు జరిగినా.. అన్ని చోట్లా తండోపతండాలుగా.. వేలాదిగా తరలివచ్చారు. మైదానాలు సరిపోక బయట రోడ్లపైనే నిల్చున్నారు. అధినేత కేసీఆర్ ఆయాచోట్ల వేదికలపైకి చేరుకోగానే ప్రజలంతా ఈలలు, చప్పట్లతో స్వాగతించారు. సీఎం ప్రసంగం సాగినంత సేపు… ‘జై కేసీఆర్’ ‘జైజై కేసీఆర్ నినాదాలతో హోరెత్తించారు.
ఈ ఎన్నికల్లో నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ కాళ్లు పట్టుకొనైనా రూ.వెయ్యి కోట్ల నిధులు తెస్త. కమలాపూర్ మండలంలోని శనిగరం, ఉప్పల్, జమ్మికుంట మండలంలోని వావిలాల, వీణవంక మండలంలోని చల్లూరును మండలాలుగా ప్రకటించాలని ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లిన. ఆయన కూడా సానుకూలంగా ఉన్నరు. ఈటల రాజేందర్‌ను పెద్ద నాయకుడిని చేస్తే.. ఆయన కేసీఆర్‌కు వెన్నుపోటు పొడిచిండు. హుజూరాబాద్‌లో 2004 నుంచి గెలిపిస్తున్న ఈటలను ఇక్కడి ప్రజలకు కూడా ధోకా ఇచ్చే విధంగా గజ్వేల్ ఆయన సొంతూరని చెబుతున్నడు. అక్కడ.. ఇక్కడి ప్రజలను మోసం చేస్తున్న ఆయనకు తగన బుద్ధి చెప్పాలె. సీఎం కేసీఆర్ ఆశీస్సులతో ఈ ఎన్నికల్లో నిలబడిన. ఇగ మీదే బాధ్యత. మూడోసారి ముఖ్యమంత్రి కేసీఆర్ అవడం ఖాయం. మరి ఇక్కడ ఎవరినో గెలిపిస్తే అభివృద్ధి ఎలా సాధ్యం. పదిహేను సంవత్సరాలుగా ప్రజలకు సేవ చేస్తూనే ఉన్న. ఒకే ఒక్క అవకాశం నాకిస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపెడుత. గత నాయకుడి లెక్క.. రంగులు మార్చెటోన్ని కాదు.
– హుజూరాబాద్ ప్రజా ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పాడి కౌశిక్‌రెడ్డి