jagityal | పెగడపల్లి: పెగడపల్లి మండల కేంద్రంలోని స్థానిక ప్రభుత్వ ఆదర్శ పాఠశాలలో కార్గిల్ విజయ్ దివాస్ కార్యక్రమాన్ని నెహ్రూ యువ కేంద్రం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా చైల్డ్ మ్యారేజ్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ భూమేష్ మాట్లాడుతూ దేశ భద్రతలో మన భారత సైనికుల పోరాటం ఎంతో గొప్పదని, 1999 మే 3 న కార్గిల్ జిల్లాలో నియంత్రిణ రేఖ వెంబడి భారత, పాకిస్తాన్ మధ్య కార్గిల్ యుద్ధం ప్రారంభమైందన్నారు.
దీనిని భారత సైన్యం ఆపరేషన్ విజయ్ అనే కోడ్ నేమ్ పెట్టి చలి, మంచు, పర్వతాలలో దాదాపు 60 రోజుల పాటు జరిగిన యుద్ధంలో ఇరు దేశాల సైనికులు చాలా మంది చనిపోయారని గుర్తు చేశారు. 527 మంది భారత సైనికులు అమరులయ్యారని చివరికి జులై 26 అరుణ భారత్ భూ భాగంలోకి ప్రవేశించిన పాకిస్తాన్ సైన్యాన్ని తిప్పి కొట్టి భారత దేశ భూ భాగాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవడం ద్వారా భారత్ విజయం సాధించిందన్నారు.
ఈ పోరాటంలో అనేకమంది సైనికులు అమరులయ్యారని వారిని స్మరించుకుంటూ కార్గిల్ విజయోత్సవ దివాస్ ని జరుపుకుంటున్నామని అన్నారు. ఇందులో భాగంగా విద్యార్థిని విద్యార్థులకు కార్గిల్ యుద్ధంపై ఉపన్యాస, వ్యాసరచన పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ ప్రభాకర్ రెడ్డి నెహ్రూ యువ కేంద్రం, మై భారత్ వాలంటరీ మారం గణేష్, శెట్టి మధు, పొన్నవేని అభిషేక్ తదితరులు పాల్గొన్నారు.