ఆడపిల్లలున్న నిరుపేద తండ్రికి రాష్ట్ర సర్కారు కొండంత అండనిస్తున్నది. కల్యాణ లక్ష్మి పేదింట వెలుగులు నింపుతున్నది. అప్పుల పాలై ఆగమైపోతున్న కుటుంబాలకు గుండె నిండా ధైర్యాన్నిస్తున్నది. మేనమామ లాగా సీఎం కేసీఆర్ అందజేస్తున్న లక్షా నూట పదహార్ల చెక్కు ఆ కుటుంబాల్లో కల్యాణ కాంతులు విరజిమ్ముతున్నది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ రూపంలో కట్నం పెడుతూ సాయం చేస్తున్నది. ఇప్పటి వరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 1,12,386 మందికి రూ.1003.27 కోట్ల లబ్ధి చేకూరగా, ఆడబిడ్డల తల్లిదండ్రులకు భరోసా దొరికింది. ఆయా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి చెక్కులు అందజేస్తుండగా, వారి కుటుంబాల్లో ఆనందం వెల్లివిరుస్తున్నది.
కరీంనగర్, డిసెంబర్ 18(నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తన పాలనలో మానవీయతను చాటుకుంటోంది. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ వంటి పలు పథకాల ద్వారా నిరుపేద కుటుంబాలకు అండగా నిలుస్తోంది. పేదరికంలో మగ్గుతున్న అనేక కుటుంబాలు ఆడపిల్లల పెండ్లిళ్లు చేసేందుకు ఆస్తులు అమ్ముకునే పరిస్థితి ఎక్కువగా కనిపిస్తున్నది. కట్నాలు, కానుకలు ఇచ్చే విషయంలో అప్పులు చేయక తప్పని పరిస్థితి నెలకొన్నది. ఇలాంటి దుస్థితిలో మగ్గుతున్న అనేక కుటుంబాల యధార్థగాథలను ఉద్యమ నాయకుడిగా అతి దగ్గరగా చూసిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు 2014 అక్టోబర్ 2న రూ. 51 వేలతో ఎస్సీ, ఎస్టీలకు కల్యాణలక్ష్మి, మైనార్టీలకు షాదీముబారక్ పథకాలను ప్రారంభించారు. 2016 నుంచి బీసీలకు కూడా కల్యాణలక్ష్మి పథకం వర్తింపజేస్తున్నారు. ఆ తర్వాత 2017 ఏప్రిల్ నుంచి రూ.75,116 అందించారు. 2018 మార్చి నుంచి 1,00,116 పెంచి అమలు చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 1,12,386 మందికి రూ. 1003.27కోట్ల సాయం అందింది.
మెట్‌పల్లికి చెందిన ఈమె పేరు మ్యాడారం కమల. భర్త మూడేండ్ల కిందటే మరణించాడు. ఈమెకు నలుగురు కూతుళ్లు.. 30 ఏండ్ల కిత్రం ఈమె కుటుంబం ఆర్థికంగా కొంత బాగున్న కుటుంబమే.. ఉన్నంతలో భర్త ఉన్నప్పుడు నలుగురు కూతళ్లను చదివించారు. ఇద్దరు కూతుళ్లకు వివాహం చేశారు. ఇద్దరు కూతుళ్లు సైతం పెండ్లికి ఎదిగారు. ఇంతలోనే కుటుంబం ఆర్థికంగా దెబ్బతిన్నది. వీరబ్రహ్మం అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో ఉన్న ఆర్థిక వనరులన్నీ కరిగిపోయాయి. కనీసం సొంత ఇల్లు లేని పరిస్థితి.. దీంతో ఆ దంపతులు మరింత కుంగదీశాయి. ఈ పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. కేసీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకానికి అంకురార్పణ చేశారు. మొదట్లో లబ్ధిదారులకు రూ.50 వేలు అందజేసిన ప్రభుత్వం తర్వాత రూ.75 వేలకు పెంచింది. ఇదే సమయంలో వీరబ్రహ్మం, కమల దంపతులు మూడో కూతురు వివాహం చేశారు. ఆమెకు కల్యాణలక్ష్మి కింద రూ.75 వేలు మంజూరయ్యాయి. చేతిలో చిల్లిగవ్వ లేని సమయంలో ఈ సహాయం ఆ కుటుంబానికి ఒక మార్గం చూపింది. మూడేండ్ల క్రితం వీరబ్రహ్మం అనారోగ్యంతో మృతిచెందాడు. దీంతో కుటుంబ భారం మొత్తం కమలపైనే పడింది. రెండేండ్ల క్రితం కమల చిన్నకూతురికి వివాహం జరిపించగా, ప్రభుత్వం కల్యాణలక్ష్మి ద్వారా రూ.లక్ష సాయం అందజేసింది. ఇలా వీరబ్రహ్మం కుటుంబానికి కల్యాణలక్ష్మి ఒక దారి చూపింది. ఈ విషయమై కమల మాట్లాడుతూ, సీఎం కేసీఆర్ తెచ్చిన కల్యాణలక్ష్మి తమలాంటి వాళ్లకు అమృతకలశం వంటిదన్నారు. బంధువులు, రక్తసంబంధీకులు, ఐనవాళ్లు సైతం ఆపదలో ఆదుకోలేదని, గుండెలపై కుంపటిలా మారిన కూతుళ్ల వివాహం ఎలా చేయాలన్న బాధ, ఆర్థిక సమస్యలు తీవ్రంగా కలిచివేశాయని, అలాంటి సమయంలో ఈ పథకం తమను ఆదుకుందని చెప్పుకొచ్చింది. ముఖ్యమంత్రికి జీవితాంతం రుణపడి ఉంటామని తెలిపింది.
కల్యాణలక్ష్మి పథకం తన ఇంట్లో వెలుగులు నింపిందంటూ ఆనందం వ్యక్తం చేస్తోంది జగిత్యాల పట్టణంలోని విజయపురి ప్రాంతానికి చెందిన వడ్కాపురం భూలక్ష్మి జగన్‌చారి దంపతులు.. జగన్‌చారి వడ్రంగి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించాడు. వీరికి ఒక కొడుకు, కూతురు ఉన్నారు. ఇద్దరినీ ప్రభుత్వ పాఠశాలల్లో చదివించారు. దాదాపు మూడేండ్ల క్రితం జగన్‌చారి పక్షవాతం బారిన పడ్డాడు. దీంతో ఆ కుటుంబం పూర్తిగా కష్టాల్లో మునిగిపోయింది. కూతురు పద్మకు పెండ్లీడు రావడం.. చేతిలో చిల్లిగవ్వ లేకపోవడంతో దంపతులిద్దరూ వేదన చెందారు. కొడుకు వడ్రంగి పనిచేస్తూ కుటుంబాన్ని పోషించడం ప్రారంభించారు. 8 నెలల కింద పద్మకు పెండ్లి సంబంధం రావడంతో అప్పుచేసి వివాహం జరిపించారు. నిరుపేద కుటుంబానికి చెందిన భూలక్ష్మి కుటుంబానికి కల్యాణలక్ష్మి పథకం మంజూరైంది. ఈ నెల 16న జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ రూ.లక్షా 116ల చెక్కును భూలక్ష్మికి అందజేశాడు. ఈ సందర్భంగా భూలక్ష్మి మాట్లాడుతూ, బిడ్డ పెండ్లి ఎలా చేస్తామో అన్న భయం ఉండేదని, సంబంధం వచ్చినంక కల్యాణలక్ష్మి వస్తదన్న భరోసాతో అప్పు తెచ్చి పెండ్లి చేశామని చెప్పింది. ఆ నమ్మకంతోనే అప్పు ఇచ్చారని, అది నేటితో తీరిపోయిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ నిజంగా దేవుడని కొనియాడుతున్నది.
పెండ్లికి చేసిన అప్పుల గోస కల్యాణలక్ష్మి పథకంతోటి లేకుండా పోయిందని సంతోషం వ్యక్తం చేస్తున్నారు జగిత్యాల పట్టణంలోని మంచినీళ్ల బావి ప్రాంతానికి చెందిన జైనపురం రాజవ్వ. పేద కుటుంబానికి చెందిన రాజన్న, రాజవ్వ దంపతులకు ఐదుగురు కూతుళ్లు, ఒక కొడుకు. రాజన్న లారీ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తూ వచ్చాడు. అయితే, కొన్ని ఇబ్బందుల మూలంగా రాజన్న పనిచేయకపోవడంతో కుటుంబం ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. నలుగురు కూతుళ్లకు అష్టకష్టాలు పడి పెండ్లి చేసిన ఆ దంపతులకు ఐదో కూతురు వివాహం సమస్యగా మారింది. కొడుకును దుబాయి పంపిస్తే నాలుగురాళ్లు సంపాదించవచ్చు అనుకొని అప్పు చేసి, అక్కడికి పంపించినా ఆ కుటుంబానికి వేదనే మిగిలింది. సరైన వీసా లేక కొన్ని నెలల వ్యవధిలోనే తిరిగివచ్చాడు. దీంతో కుటుంబం మరింత చిక్కుళ్లో పడిపోయింది. ఐదు నెలల కిందట కూతురుకు పెండ్లి సంబంధం రావడంతో ధైర్యం చేసి కొంత అప్పు చేసి వివాహం చేశారు. కాగా, శుక్రవారం రాజవ్వకు కల్యాణలక్ష్మి కింద చెక్కు వచ్చింది. ఈ సందర్భంగా రాజవ్వ మాట్లాడుతూ, అష్టకష్టాలు పడుతూ, కూతుళ్ల పెండ్లిళ్ల కోసం తపిస్తున్న తల్లిదండ్రులకు సీఎం కేసీఆర్ పెద్ద మేలు చేశాడని కొనియాడింది. ఆయన, చేసిన మంచిపనితో రాష్ట్రంలోని ఆడబిడ్డల తల్లిదండ్రులు సంతోషంగా ఉన్నారని చెప్పింది.
కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల ద్వారా సమాజానికి పలు సామాజిక ప్రయోజనాలు కూడా కలుగుతున్నాయి. ముఖ్యంగా బాల్య వివాహాలను అరికట్టేందుకు ఈ పథకం ఎంతగానో తోడ్పడుతోంది. ఇంటిలో ఆడపిల్ల ఉన్నదంటే గుండెల మీద కుంపటిగా భావించే తల్లిదండ్రులు ఎందరో చిన్న తనంలోనే పెండ్లిళ్లు చేసి సాగనంపేవారు. బాల్యంలోనే సంసార కూపంలో ఆడ పిల్లలను బందీలను చేసేవారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద లబ్ధి పొందాలంటే ఆడపిల్లలకు కనీసం 18 ఏండ్లు నిండి ఉండాలి. ఈ పథకం కింద చేకూరే లబ్ధి కోసం తల్లి దండ్రులు ఆడ పిల్లలకు 18 ఏండ్లు వచ్చే వరకు పెండ్లి చేసేందుకు వేచి ఉంటున్నారు. కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల కింద సహాయాన్ని అందుకున్న పెండ్లిళ్లకు చట్ట బద్దత లభిస్తోంది. ప్రభుత్వం నుంచి గుర్తింపు వస్తోంది. ఆడ పిల్లల కన్నీళ్లు తుడిచి వారి నెత్తిన అక్షింతలు వేస్తున్న ఈ పథకాలు పేదలకు ఎంతో చేరువయ్యాయి. ఈ పథకాల కింద చెక్కులు అందుకుంటున్న తల్లిదండ్రులు కష్టాలు మర్చిపోయి ఆనందభాష్పాలు రాల్చుతున్నారు.
మా ఆయన ఆరోగ్యం బాగా లేక ఇంటి వద్దే ఉంటున్నడు. కుటుంబ పోషణ చానా కష్టమైన పరిస్థితుల్లో నేను కూలీ పనిచేసుకొని పిల్లలను పోషించుకుంటున్న. ఇట్లాంటి సమయంలో మా బిడ్డ పెళ్లికి కల్యాణలక్ష్మి ద్వారా రూ.లక్షా 116 రావడంతో చాలా ధైర్యం వచ్చింది. ఏ ఆధారం లేని చాలా మంది కుటుంబాలకు ఈ పథకం కొండంత అండగా ఉంటున్నది.
– పసిడ్ల లక్ష్మి, నర్సయ్యపల్లి, సుల్తానాబాద్ మండలం