కరీంనగర్ విద్యానగర్, జూలై 18 : కరీంనగర్ పోలీస్ శిక్షణ కేంద్రం డీఎస్పీగా పనిచేస్తున్న జీదుల మహేశ్ (56) శుక్రవారం గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. ఆయన భార్య మాధవి హుజూరాబాద్ ఏసీపీగా విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే, శుక్రవారం హుజూరాబాద్‌లోని పోలీస్ క్వార్టర్స్‌లో ఉండగానే మహేశ్ గుండెపోటుకు గురయ్యారు. వెంటనే స్థానిక ప్రభుత్వ దవాఖానకు తరలించి చికిత్స చేయించేందుకు ప్రయత్నించగా, అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
మహేశ్ మృతదేహాన్ని హుజూరాబాద్ నుంచి కరీంనగర్‌లోని వారి స్వగృహానికి తరలించారు. 1995లో ఎస్ఐగా ఉద్యోగంలో చేరి పదోన్నతులు పొందుతూ డీఎస్పీగా స్థాయికి చేరుకున్న మహేశ్ ఆకస్మిక మృతితో పోలీస్ శాఖలో విషాదం అలుముకున్నది. తన భార్య మాధవితో కలిసి ఒకేసారి ఎస్ఐగా ఉద్యోగంలో చేరిన వీరు సీఐగా ఒకేసారి పదోన్నతి పొందారు. ఆ తర్వాత డీఎస్పీగా కూడా ఇద్దరికి ఒకేసారి పదోన్నతి వ చ్చింది. మహేశ్ కరీంనగర్‌లోని పీటీసీలో డీఎస్పీగా, మాధవి హుజూరాబాద్ ఏసీపీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
మహేశ్‌కు ఇద్దరు కొడుకులు రుషి ఫణీంద్ర, నీరజ్ చంద్ర ఉన్నారు. మహేశ్ మరణ వార్త తెలిసిన పోలీస్ అధికారులు పెద్ద సంఖ్యలో కరీంనగర్ తిర్మల్నగర్లోని ఆయన స్వగృహానికి చేరుకుని నివాళులర్పించారు. సీపీ గౌష్ ఆలం శుక్రవారం సాయంత్రం మహేశ్ ఇంటికి వెళ్లికి నివాళులర్పించారు. ఏసీపీ మాధవిని ఓదార్చారు. శనివారం ఆయన అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మహేశ్ మృతిపై హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు.