PEDDAPALLY | పెద్దపల్లి, మార్చ్ 31(నమస్తే తెలంగాణ): పెద్దపల్లి జిల్లా మంథని మండలం కాన్సాయిపేట గ్రామానికి చెందిన జక్కుల అరుణ్ కుమార్ ర్యాంకుల పరంపర కొనసాగిస్తున్నాడు. తాజాగా గ్రూప్-1లో అరుణ్ కుమార్ రాష్ట్రస్థాయిలో 114వ, మల్టీ జోన్-1 స్థాయిలో 64వ ర్యాంక్ ను సాధించాడు.
2018లో ట్రిపుల్ ఐటీ జబర్ పూర్ లో బీ టెక్(సీఈసీ) పూర్తి చేశాడు. అప్పటినుంచి హైదరాబాద్, ఢిల్లీ లో ఉంటూ సివిల్స్ కు ప్రిపేరై మూడుసార్లు సివిల్స్ కు అటెంప్ట్ చేశాడు. 2022లో గ్రూప్-1 నోటిఫికేషన్ రావడంతో అప్పటినుంచి సాధన మొదలు పెట్టాడు. గ్రూప్-2లో రాష్ట్రస్థాయిలో 35వ ర్యాంక్, గ్రూప్-3 లో రాష్ట్రస్థాయిలో 81వ ర్యాంక్ సాధించాడు.
అరుణ్ కుమార్ తండ్రి లక్ష్మీనారాయణ కమాన్పూర్ మండల కేంద్రంలోని ఎంపీపీఎస్ లో ప్రధానోపాధ్యాయుడిగా పని చేస్తుండగా, తల్లి మల్లేశ్వరి మంథని మండలం వట్టపల్లిలో అంగన్ వాడీ టీచర్ గా పని చేస్తున్నారు. అరుణ్ కుమార్ గ్రూప్స్ లో సత్తా చాటడం పట్ల తల్లిదండ్రులు బంధువులు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.