జగిత్యాల నడిబొడ్డున వివాదస్పదమైన పెట్రోల్ బంక్ భూమి, దాని కొనుగోలుకు సంబంధించిన కిబాల పత్రం మిస్టరీగా మారింది. గత 20 ఏళ్లుగా సద్దుమణిగిన సమస్య మళ్లీ రాజుకున్నది. సర్వే నంబర్ 138లోని 20 గుంటల భూమి 100 కోట్లకు పైగా విలువ చేస్తుందని, యాజమాన్య హక్కులు లేకుండా పెట్రోల్ బంక్ వ్యాపారి వారసులు అనుభవిస్తున్నారని, హైకోర్టు సింగిల్ డివిజన్ బెంచ్‌లు ఇచ్చిన తీర్పుల్లో సైతం వారికి భూమిపై టైటిల్ ఇవ్వలేదని, కేవలం పొజిషన్ మాత్రమే ఇచ్చారని, విలువైన భూమిని మున్సిపల్ స్వాధీనం చేసుకోవాలని పట్టణప్రజానీకం కొన్నాళ్లుగా డిమాండ్ చేస్తూ వస్తున్నది. అయితే ఈ వ్యవహారంలో వ్యాపారి వారసులు మాత్రం తమ పూర్వీకుడైన దారం వీరమల్లయ్య 1952లో మున్సిపాలిటీ ద్వారా కిబాల (ఉర్ద్దూలో ఉన్న నాన్ జ్యుడీషియల్ స్టాంప్ పత్రం) అనే పత్రం ద్వారా 2వేలకు 20 గుంటలు కొనుగోలు చేశాడని వాదిస్తూ వస్తున్నారు. ఇదే విషయాన్ని జగిత్యాల కోర్టు నుంచి మొదలు కొని హైకోర్టు వరకు నివేదించారు. అయితే కిబాల కొనుగోలు పత్రమే అతి పెద్ద సమస్యగా మారిపోయింది. ప్రజల్లో అనేక అనుమానాలను రేకెత్తిస్తున్నది.
జగిత్యాల, నవంబర్ 5 (నమస్తే తెలంగాణ): జగిత్యాల కొత్త బస్టాండ్ సమీపంలో మున్సిపల్ స్థలం దాదాపు 70 ఏళ్లుగా వివాదాస్పదమైన విషయం తెలిసిందే. అయితే 1952లో మున్సిపాలిటీ వద్ద సర్వే నంబర్ 138లో 20 గుంటల భూమిని 2వేలకు కిబాల పత్రం ద్వారా కొనుగోలు చేశామని వ్యాపారి వారసులు ఇప్పటికే పలుసార్లు ప్రకటించారు. తాజాగా ఇటీవల సైతం ప్రెస్‌మీట్ నిర్వహించి అదే విషయాన్ని చెప్పారు. జగిత్యాల కోర్టుతోపాటు హైకోర్టులోనూ ఇదే విషయాన్ని నివేదించారు. అయితే ఒరిజినల్ కిబాల పత్రాన్ని మాత్రం వ్యాపారి వారసులు ఎప్పుడూ ఏ కార్యాలయంలోనూ దాఖలు చేయలేదు. న్యాయస్థానాల్లో మాత్రం కిబాల పత్రం జిరాక్స్ ప్రతిని అందజేశారు. దీని ఆధారంగానే వారు రెవెన్యూ, మున్సిపల్ రికార్డుల్లో తమ పేరుపైకి భూమిని మార్చుకున్నారు.
ఆ స్థలంలో నిర్మించిన భవనాలకు ఇంటి నంబర్లను తీసుకున్నారు. అయితే కిబాల అనే కొనుగోలు పత్రం విషయంలోనే పెద్ద తకరారు వచ్చిందని, అసలు సమర్పించిన ప్రతిలో కిబాల భూమి కొనుగోలు పదమే లేదన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రెవెన్యూ, మున్సిపల్ కార్యాలయాల్లో ఇంత వరకు కిబాల పత్రం జిరాక్స్ ప్రతులు అందుబాటులో లేకపోవడం గమనార్హం. కొద్ది రోజులుగా 20 గుంటల స్థల వివాదం తెరపైకి వచ్చిన నేపథ్యంలో అధికారులు, ప్రజాప్రతినిధులు ఈ వ్యవహారంపై దృష్టి సారించారు. వీరమల్లయ్య కొనుగోలు చేశాడా లేదా..? కిబాల పత్రం అంటే కొనుగోలు పత్రమేనా..? అందులో పేర్కొన్నారా..? అన్న విషయాలు తెలిస్తేనే సమస్య పరిష్కారమవుతుందని గుర్తించిన అధికారులు, న్యాయస్థానాల్లో వ్యాపారి వారసులు సమర్పించిన కిబాల పత్రం జిరాక్స్ నకళ్లను సేకరించి దాన్ని తర్జుమా చేయించినట్టు తెలుస్తున్నది. అయితే కిబాల ప్రతిగా సమర్పించిన ఉర్దూ పత్రంలో ఎక్కడా కిబాల అనే పదమే లేదని తెలుస్తున్నది.
అలాగే భూ విక్రయ ఒప్పందం అనే పదం సైతం లేదని గుర్తించినట్టు తెలిసింది. ఐదు కండీషన్లతో పెట్రోల్, కిరోసిన్ బంక్ ఏర్పాటుకు, షెడ్డు నిర్మాణానికి మున్సిపల్ కమిటీ తీర్మానం ఆమోదించినట్టు, దీనికి గాను రూ.రెండు వేల శిస్తును చెల్లించాలని ఉన్నదంటున్నారు. ఐదు కండీషన్లతో ఉన్న పత్రంలో ఎక్కడా కొనుగోలు, అమ్మకం అనే పదాలు లేవని, అలాగే పొజీషన్, ఆక్యుపేషన్ అనే పదాలను మాత్రమే వాడారని, అది కూడా మున్సిపాలిటీ నిర్దేశించిన టర్మ్స్ అండ్ కండీషన్లు వర్తిస్తాయని పేర్కొనట్టు చెబుతున్నారు. పెట్రోల్, కిరోసిన్ షెడ్డు కోసం రూ.రెండు వేల రెమ్యునరేషన్ (శిస్తు) ఇవ్వాలని రాసి ఉన్నట్టు చెబుతున్నారు. రెమ్యునరేషన్, శిస్తు అనే పదాలు స్థల విక్రయానికి సంబంధించినవి కావని, అవి కేవలం లీజు, లేదా రెంట్ పర్పస్‌లో ఇచ్చే అంశాలేనని రిజిస్ట్రేషన్ రంగంలో అనుభవం ఉన్న నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
వ్యాపారి వారసులు ఇన్నాళ్లూ కిబాల పత్రం కొనుగోలు పత్రం అని చెబుతూ వచ్చారని, అయితే అవి ఎక్కడ కిబాల జిరాక్స్ నకలు పత్రంలో పేర్కొనలేదంటున్నారు. దాదాపు 70 ఏళ్లుగా మున్సిపల్, రెవెన్యూ అధికారులు, కిబాల పత్రం జిరాక్స్‌లను కనీసం చదవకుండానే, ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. న్యాయస్థానాల్లో కేసులు నడిచిన సమయంలోనే కిబాల పత్రం ప్రతిని తీసుకొని అఫీషియల్‌గా తర్జుమా చేయించి ఉంటే అన్ని విషయాలు తేలిపోయి ఉండేవని, ఇన్నాళ్లూ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పత్రంలో పేర్కొన్న అంశాలు కాకుండా, పత్రం కాలం, దాని వ్యాలిడిటీ, పత్రంపై అప్పటి మున్సిపల్ రౌండ్ సీల్ లేకపోవడం.. ఇలా అనేక అనుమానాలు ఉన్నట్టుగా తెలుస్తున్నది.
కిబాల పత్రం ద్వారా కొనుగోలు చేశామన్న వ్యాపారి దారం వీరమల్లయ్య, ఆయన వారసులు, కిబాల పత్రం ఎక్కడ సమర్పించకుండానే మున్సిపల్, రెవెన్యూ రికార్డుల్లోకి ఎక్కారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కిబాల పత్రం ద్వారా రూ.2వేలు ఉస్మానియా కరెన్సీతో కొనుగోలు చేశామంటూ వీరమల్లయ్య 1954-55 కాస్రా పహానిలోకి పట్టాదారుడిగా వచ్చినట్టు రికార్డులు నమోదు చేశారు. కాస్రా పహానిలో 138 సర్వేనంబర్‌లో 13.19 ఎకరాలు మున్సిపల్ లోకల్ ఫండ్‌ను, 25 గుంటలకు దారం వీరమల్లయ్యను పట్టాదారులుగా చూపెడుతూ, రెవెన్యూ అధికారులు ఒక రికార్డును గతంలో జారీ చేశారు. అందులో మున్సిపల్ లోకల్ ఫండ్ ద్వారా పట్టాదారుడైన ఇనుములపల్లి నర్సింగరావు వద్ద కొనుగోలు చేసినట్టు అందులో పేర్కొన్నారు.
ఇక దారం వీరమల్లయ్య 1953-54 ఫైసల్ పట్టి రికార్డు ద్వారా 25 గుంటల భూమిని కొనుగోలు చేశారని పేర్కొన్నారు. 1975 వరకు పహానిల్లో ఇలాగే నమోదై ఉంది. ఇరవై ఏండ్లకు పైగా 25 గుంటల భూమికి పట్టాదారుడిగా పేర్కొనబడిన దారం వీరమల్లయ్య, 1976-77 పహానీలో 20 గుంటలుగా రికార్డు చేయబడ్డాడు. అప్పటి వరకు 13.19 ఎకరాలకు పట్ట్టాదారుగా ఉన్న మున్సిపల్ లోకల్ ఫండ్, ఆ ఏడాది నుంచి 13.24 ఎకరాలకు పట్టాదారుగా మారిపోయింది. ఈ రికార్డులను పరిశీలిస్తున్న అధికారులు ఇలా ఎలా..? రికార్డులు మార్చివేశారో అర్థం కావడం లేదని వ్యాఖ్యానిస్తున్నారు. వ్యాపారి వారసులు 1952లోనే మున్సిపాలిటీ వద్ద 20 గుంటల భూమిని కిబాల పత్రం ద్వారా కొనుగోలు చేశామని పేర్కొంటూ వస్తున్నారు.
మరి 25 గుంటల భూమి ఫైసల్ పట్టిద్వారా, కొనుగోలు ద్వారా వచ్చిందని ఎలా రికార్డుల్లోకి చేరిందన్నది? అర్థం కావడం లేదని అధికారులు అంటున్నారు. 25 గుంటల భూ యజమానిగా ఇరవై ఒక్క ఏండ్లు చెలామణి అయిన వ్యాపారి ఆయన వారసులు, హఠాత్తుగా 1976-77లో ఎందుకు 20 గుంటలకు కుచించుకుపోవాల్సి వచ్చిందో ఎవరికీ అంతు చిక్కడం లేదు. అంటే రెవెన్యూ రికార్డుల్లో ఇష్టారాజ్యమైన మ్యానుప్లేషన్ జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇక మున్సిపల్ రికార్డుల్లో అయితే లెక్కలేని దుస్థితి నెలకొంది. పెట్రోల్ బంక్‌కు సంబంధించిన 20 గుంటల స్థలంలో 60 ఏండ్ల వ్యవధిలో అనేక భవనాల నిర్మాణాలు జరిగాయి.
సాధారణంగా ఇంటి నిర్మాణం జరిగే క్రమంలో వాటికి మున్సిపల్ పర్మిషన్ తప్పనిసరి. పర్మిషన్ తీసుకుంటేనే ఇంటి నంబర్ కేటాయించబడుతుంది. అలాగే ఘర్పట్టీ నిర్ణయించబడుతుంది. భవన యజమానులు తమ రిజిస్ట్రేషన్ డ్యాకుమెంట్లను మున్సిపల్ కార్యాలయంలో దాఖలు చేసి, నిర్దేశిత రుసుం చెల్లించాల్సి ఉంటుం ది. అయితే ఈ 20 గుంటల స్థలం లో పలు నిర్మాణాలకు ఇంటి నంబర్లను కేటాయించిన మున్సిపాలిటీలో ఒక్కదానికి భూమి కొనుగోలు, రిజిస్ట్రేషన్ పత్రాన్ని దాఖలు చేయకపోవడం గమనార్హం. 70 ఏండ్ల వ్యవధిలో రికార్డుల ట్యాంపరింగ్ యథేచ్ఛగా జరిగిందని పట్టణవాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దాదాపు 70 ఏళ్లుగా మిస్టరీగా మారిన కిబాల కొనుగోలు పత్రం కథ ఇప్పటికైనా తేలుతుందా..? మళ్లీ ఇది కొద్దిరోజుల తదుపరి కోల్డ్ స్టోరేజ్‌లకు చేరుతుందా..? అన్న అనుమానాలను జగిత్యాల పట్టణవాసులు వ్యక్తం చేస్తున్నారు. కిబాల కొనుగోలు పత్రాన్ని చదవకుండానే అందులోని వివరాలు తెలుసుకోకుండా 70 ఏళ్లుగా ఎలా నెట్టుకువచ్చారో అర్థం కావడం లేదంటున్నారు. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, కలెక్టర్, ఉన్నతాధికారులు, మున్సిపల్ అధికారులు అందరూ ఈ విషయమై పూర్తి స్థాయి దర్యాప్తు జరిపి, కిబాల మిస్టరీని చేధించాలంటున్నారు. కిబాల పత్రాన్ని తర్జుమా చేయించి, దాని కాల పరిమితి, స్టాంప్‌పేపర్ వ్యాలిడిటీని పరిశీలించాలని, అలాగే అందులోని కండీషన్స్ అన్నింటినీ పరిశీలించి, నిజంగా వ్యాపారి కొనుగోలు చేస్తే వారికే ఇవ్వాలని, లేదంటే స్వాధీనం చేసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.