Korutla : కోరుట్లలోని గోత్రాల కాలనీలో విషాదం నెలకొంది. వాగులో చేపలు పట్టేందుకు వెళ్లిన పారిశుధ్య కార్మికుడు కరెంట్ షాక్తో మృతి చెందాడు. విద్యుత్ తీగ సాయంతో వాగులో చేపలు పట్టేందుకు వెళ్లిన వావిలాల నవీన్ (28) అనూహ్యంగా మృత్యువాతపడ్డాడు. నవీన్ మృతి గురించి మీడియాతో మాట్లాడిన ఎస్ఐ చిరంజీవి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.
ఎస్ఐ చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం.. గోత్రాల కాలనీకి చెందిన వావిలాల నవీన్ పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. అతడు శుక్రవారం శివారులోని ఎల్లమ్మ గుడి దగ్గరి వాగులో చేపలు పట్టేందుకు వెళ్లాడు. పొడవాటి కర్రకు విద్యుత్ తీగ అమర్చి.. కరెంట్ షాక్ ద్వారా చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు విద్యుద్ఘాతానికి గురై మృతి చెందాడు. మృతుడికి భార్య కృష్ణవేణి, కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. నవీన్ భార్య ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు.