Operation Sindhur | కోరుట్ల, మే 8: కాశ్మీర్‌లోని పహాల్గాంలో ఉగ్రవాదుల దాడికి ప్రతీకారంగా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌తో పాటు పాక్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత్ సైనికులు చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్ పై కోరుట్లలో బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గురువారం న్యాయవాదులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక కోర్టు నుంచి ఐబీ రోడ్డు, గోదాం రోడ్డు, నంది చౌక్ జాతీయ రహదారి మీదుగా కోరుట్ల కొత్త బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు ర్యాలీ తీసిన న్యాయవాదులు జాతీయ పతాకాన్ని చేత బూని భారత్ మాతాకీ జై నినాదాలతో హోరెత్తించారు.
కొత్త బస్టాండ్ వద్ద మానవహారంగా నిలిచి టపాకులు పేల్చి, స్వీట్లు పంచి సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బైరి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఆపరేషన్ సిందూర్ లో భారత సైన్యం చూపిస్తున్న శౌర్యానికి సంఘీభావం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. పాకిస్థాన్ లోని తొమ్మిది ఉగ్రవాద శిబిరాలను భారత సైన్యం ధ్వంసం చేసిందని తీవ్రవాదాన్ని పూర్తిగా నిర్మూలించే క్రమంలో దేశ రక్షణకు ఇది కీలకమైన అడుగని పేర్కొన్నారు. సైనిక వీరుల అసమాన ధైర్య సాహసాలకు ఆపరేషన్ సింధూర్ నిలుస్తుందని, మున్ముందు భారత సైన్యం తీసుకునే చర్యలు ఉగ్రవాదులకు గట్టి హెచ్చరికగా నిలుస్తాయని పేర్కొన్నారు.
భారత్ పై కన్నెత్తి చూడాలంటేనే భయపడే రీతిలో పాకిస్తాన్ పెంచి పోషిస్తున్న ముష్కరులకు భారత సైన్యం తగిన బుద్ధి చెప్పిందని అన్నారు. భారతీయ సైనికులకు దేశ పౌరులు నిత్యం వెన్నంటి ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ కస్తూరి రమేష్, జనరల్ సెక్రటరీ కొంపల్లి సురేష్, స్పోర్ట్స్, కల్చరల్ సెక్రెటరీ సుతారి నవీన్ కుమార్, ఫసియోద్దీన్, లైబ్రరీ సెక్రెటరీ మర్రిపల్లి గంగాధర్, జూనియర్ ఎగ్జిక్యూటివ్ రాసభక్తుల రాజశేఖర్, సీనియర్ న్యాయవాదులు గండ్ర ప్రవీణ్ కుమార్, తోకల రమేష్, ఆడెపు వినోద్, గాంధారి శ్రీనివాస్, గోసికొండ సురేష్ , జూనియర్ నాయవాదులు అల్లె రాము, బద్రి సృజన్, లావుడ్యా రాకేష్, గణేష్, వివేక్, శ్రీనివాస్, అనిల్, రాజు, రాజేందర్, రమేష్, శివకుమార్ పాల్గొన్నారు.