వీణవంక : రెక్కడితేకాని డొక్కాడని పరిస్థితిలో ఆయా జాతరలు తిరుగుతూ తినుబండారాలు అమ్ముకొనే వారి కుటుంబం షాట్ సర్క్యూట్ అయి ఆస్తి నష్టం జరిగినా సంఘటన మామిడాలపల్లిలో జరిగింది. బాధితుడు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని మామిడాలపల్లి గ్రామానికి చెందిన నిదానం మహేందర్ నల్లగొండ జాతర ముగించుకొని శనివారం సాయంత్రం ఇంటికి చేరుకున్నాడు. అలసిపోయి అన్ని వస్తువులతో పాటు, సంపాదించిన రూ.2 లక్షలు డీసీఎం వ్యాన్లో ఉంచి రాత్రి ఇంటి ముందు పడుకున్నారు.
అర్ధరాత్రి ఒక్కసారిగా డీసీఎం వ్యాన్లో మంటలు చెలరేగడంతో మహేందర్ కుటుంబంతో పాటు చుట్టు పక్కల వారు లేచి మంటలు ఆర్పి వేసే సమయానికి సుమారు రూ.3 లక్షల వస్తువులతో పాటు నగదు రూ.2 లక్షలు కూడా కాళి బూడిదయ్యాయని బోరున విలపించాడు. పడుకునే ముందు రెండు గ్యాస్ సిలిండర్లు బయటకు తీసి ఉంచడంతో ప్రాణాపాయం తప్పిందని అన్నాడు. ప్రభుత్వం, దాతలు ఎవరయినా ఆదుకోవాలని బాధితులు వేడుకొన్నారు.