కమాన్‌చౌరస్తా, అక్టోబర్ 5: కరీంనగర్లో గొప్ప శ్రీకృష్ణుడి క్షేత్రాన్ని నిర్మించి ఆధ్యాత్మికతకు నిలయంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఇస్కాన్ ఆధ్వర్యంలో రూ. 20 కోట్లతో ఆలయాన్ని నిర్మిస్తున్నామని వెల్లడించారు. హరే రామ హరే కృష్ణ, ఇసాన్ ప్రతినిధులతో గురువారం మంత్రి గంగుల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కరీంనగరానికి ఓ వైపు టీటీడీ శ్రీవారి ఆలయం, మరో వైపు ఇసాన్ ఆలయంతో నగరం ఆధ్యాత్మిక కేంద్రం గా వెల్లివిరియనున్నాయన్నారు. ప్రజల్లో ఆధ్యాత్మికత, భక్తిభావం పెంపొందినప్పుడే… భయం పెరిగి.. క్రమశిక్షణ అలవడుతుందన్నా రు.
ఇందుకోసం ఏటా కరీంనగర్లో శ్రీవారి బ్రహ్మోత్సవాలు జరుపుకుంటున్నామని చెప్పా రు. నగరంలో టీటీడీ ఆధ్వర్యంలో గొప్ప క్షేత్రాన్ని నిర్మిస్తున్నామని, ఇప్పటికే సీఎం కేసీఆర్ 10 ఎకరాల స్థలాన్ని కేటాయించారని చెప్పారు. 15 రోజుల్లో నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. కరీంనగర్ అభివృద్ధే కాదు, నగరం ఆధ్యాత్మికతలో ముందుండాలని, ప్రజల్లో దైవభక్తిని పెంపొందించాలని, డ్యామ్ పరిసర ప్రాం తాల్లో ఇసాన్ ఆలయ నిర్మాణానికి పూనుకున్నామన్నారు. ఇందుకు సీఎం కేసీఆర్ మూడు ఎకరాల స్థలాన్ని కేటాయించారని వెల్లడించారు.
ఆలయ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు, శనివారం తెలంగాణ చౌక్ నుంచి ఆలయాన్ని నిర్మించే ప్రతిపాదిత స్థలం వరకు, హరే రామ హరే కృష్ణ అధ్వర్యంలో రాధ గోవిందుడి శోభాయాత్రను పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నామన్నా రు. ఇక్కడ విదేశీయులు, కృష్ణుడి భక్తులు పెద్ద ఎత్తున పాల్గొంటున్నారని పేర్కొన్నారు. నగర వాసులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, హరేరామ హరేకృష్ణ ప్రతినిధులు నరహరి స్వామి, బుర్ర మధుసూధన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, నరేశ్ రెడ్డి, రాజభాసర్ రెడ్డి, రమేశ్‌రెడ్డి పాల్గొన్నారు.