Peddapally | పెద్దపల్లి కమాన్, మే 28 : మానవ అక్రమ రవాణా నిర్ములన లో ప్రజలు అందరు భాగస్వామ్యం అయినప్పుడే దీనిని సమూలంగా నివారించవచ్చు అని డీ ఈ ఓ మాధవి అన్నారు. ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ, రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా మండలి సంస్థ ఆధ్వర్యంలో పెద్దపల్లి జడ్పీ బాలికల ఉన్నత పాఠశాల లో బుధవారం మానవ అక్రమ రవాణా గురించి ఉపాధ్యాయు లకు అవగాహన కల్పించారు.
ఈ సందర్బంగా డీ ఈ ఓ మాట్లాడుతూ మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచం వ్యాప్తంగా అత్యంత వేగంగా విస్తరిస్తూ ఎంతో మంది అమ్మాయిల జీవితాలను నాశనం చేస్తున్న నేరపూరితమైన చర్య అని, దీనికి పేద మధ్య తరగతి అమ్మాయిలు, మహిళలు ఎక్కువ గా గురవుతున్నారన్నారు. సైబర్ ట్రాఫికింగ్ అనేది చాలా వేగంగా విస్తరిస్తున్న జఠిలమైన సమస్య కావున పిల్లలకు ఫోన్ ఉపయోగించడం ద్వారా వచ్చే నష్టాలను తెలియజేయాలన్నారు.
మాయమాటలు, ఉద్యోగ, సినిమా అవకాశం అంటూ పట్టణాలకు తీసుకెళ్లి వ్యభిచార గృహలలో అమ్ముతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అపరిచితుల పట్ల విద్యార్థిని లు అప్రమత్తంగా ఉండేలా టీచర్స్ అవగాహన కల్పించాలని, అక్రమ రవాణాను ఆదిలోనే అడ్డుకుంటే ఆడపిల్లలను రక్షించుకోవచ్చని చెప్పారు. వేధింపులకు గురైన మహిళలు టోల్ ప్రీ నంబర్లు 1098, 100, 1930, 181 లో సంప్రదించాలని సూచించారు. ఈ శిక్షణలో జిసిడిఒ కవిత, ప్రధానోపాధ్యాయురాలు అరుణ, ప్రజ్వల సిబ్బంది అంబర్ సింగ్, టీచర్స్ పాల్గొన్నారు.