‘తన సొంత నియోజకవర్గం కరీంనగర్లో ఏపనీ చేయలేదన్న కారణంతో తిరస్కరించబడి చెల్లని రూపాయిగా మారిన పొన్నం ప్రభాకర్ ఇప్పుడు హుస్నాబాద్‌లో చెల్లుతడా?’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ చౌరస్తాలో హుస్నాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్‌కుమార్‌తో కలిసి బుధవారం సాయంత్రం నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. సౌమ్యుడు, మంచి వ్యక్తి అయిన సతీశ్‌కుమార్, హుస్నాబాద్ నియోజకవర్గానికి ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు.
రూ.9వేలకోట్లకు పైగా నిధులతో నియోజకవర్గాన్ని బాగు చేసిన సతీశ్‌ను మళ్లీ గెలిపిస్తే నియోజకవర్గంలో అభివృద్ధి జాతరేనని స్పష్టం చేశారు. భీమదేవరపల్లి, నవంబరు 22: పొన్నం ప్రభాకర్ సొంత నియోజకవర్గం కరీంనగర్ అని, అక్కడ చెల్లని రూపాయిలా మారిన ఆయన, హుస్నాబాద్ నియోజకవర్గంలో ఎలా చెలుతాడు? అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ చౌరస్తాలో హుస్నాబాద్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వొడితెల సతీశ్‌కుమార్‌తో కలిసి బుధవారం సాయంత్రం నిర్వహించిన రోడ్‌షోలో మంత్రి కేటీఆర్ ప్రసంగించారు.
సౌమ్యుడు, మంచి వ్యక్తి అయిన సతీశ్‌కుమార్, హుస్నాబాద్ నియోజకవర్గానికి ఎన్నో సేవలు అందించారని గుర్తు చేశారు. నియోజకవర్గంలో రూ.9వేల కోట్లకు పైగా నిధులతో అభివృద్ధి, సంక్షేమ పథకాలను పరుగులు పెట్టించాడని చెప్పారు. ఇందులో రూ.5,640 కోట్లు అభివృద్ధి పనుల కోసం, రూ.3,427కోట్లు సంక్షేమ కార్యక్రమాలకు వినియోగించారని తెలిపారు. స్కూల్‌కు వెళ్లిన విద్యార్థి ప్రోగ్రెస్ కార్డు మాదిరిగానే అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు కార్డును మీ ముందు ప్రదర్శిస్తున్నానని చెప్పారు. వీటిలో ఏవైనా అమలుకానివి ఉన్నాయా చూసుకోవాలని సూచించారు. రూ.2700 కోట్లతో నిర్మించిన గౌరవెల్లి ప్రాజెక్టు మరికొద్ది రోజుల్లో వినియోగంలోకి వస్తుందన్నారు. ఇప్పటికే రెండుసార్లు ట్రయల్ రన్ పూర్తయిందన్నారు. ఒకప్పుడు కరువు కాటకాలతో అల్లాడిన హుస్నాబాద్ ప్రాంతం రానున్న రోజుల్లో పచ్చలహారంగా మారుతుందన్నారు.
కాంగ్రెస్ పార్టీ నాయకుడు రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో 95శాతం బీద రైతులే ఉన్నారని, వారికి 24గంటల కరెంటు వృథా అని రైతులను అవమానకరంగా మాట్లాడుతున్నారని, రాష్ట్రంలో ఎక్కడైనా వ్యవసాయానికి 10హెచ్‌పీ మోటార్ వినియోగించే రైతు ఉన్నాడా అని మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. ‘మూడు గంటల కరెంటుతో మూడెకరాలు పండించే రైతులు మీ వద్ద ఉన్నారా’ అని రైతులను అడిగి సమాధానం రాబట్టారు. ‘మీకు వ్యవసాయానికి 24గంటల విద్యుత్ కావాల్నా, కాంగ్రెస్ అంటున్నట్లు 3గంటలా ఆలోచించుకోవాలి’ అని సూచించారు.
‘ఇక కాంగ్రెస్ మరో నాయకుడు భట్టి విక్రమార్క మాట్లాడుతూ మేము అధికారంలోకి వస్తే ధరణిని రద్దు చేస్తామంటున్నడు. కేసీఆర్ ప్రభుత్వం రైతుల భూములకు రక్షణగా ధరణిని తీసుకొచ్చి పకడ్బందీగా రెవెన్యూ చట్టాలను అమలు చేస్తుంటే ఇప్పుడు కాంగ్రెస్ వాళ్లు ధరణిని తొలగించి మళ్లీ పటేల్, పట్వారీ, దళారీ వ్యవస్థలను ముందుకు తీసుకొస్తామని బాహాటంగా ప్రకటించండి విడ్డూరంగా ఉంది.. ఈ వ్యవస్థను మీరు అంగీకరిస్తారా?’ అని జనాలను అడిగారు. ‘రైతుబంధు పేరిట డబ్బును వృథా చేస్తున్నారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అంటున్నారు, ఇప్పుడు ప్రభుత్వం ఇస్తున్న రైతుబంధు డబ్బును మీరు వ్యవసాయ పెట్టుబడి కోసం వినియోగించుకోవడం లేదా?’ అని రైతులను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులంతా కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ముక్తకంఠంతో నినదించారు.
సమీపంలో ఉన్న దుకాణదారులను ఉద్దేశించి కేటీఆర్ మాట్లాడుతూ ‘2014 కంటే ముందు జనరేటరో, ఇన్వర్టరో లేకుండా మీరు వ్యాపారం చేయగలిగిన్రా? అని అడిగారు. ప్రతి ఒక్కరి బ్యాంకు ఖాతాలో రూ. 15లక్షలు వేస్తానన్న ప్రధానమంత్రి ఎక్కడికి పోయారని విమర్శించారు. బండి పోతే బండి, గుండు పోతే గుండు హామీలు గుప్పించిన బండి సంజయ్ ఇప్పుడు ఏ మూలలో ఉన్నాడని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గ్యాస్ సిలిండర్‌ను కేవలం రూ.400కే ఇస్తుందని హామీ ఇచ్చారు. వృద్ధులకు పింఛన్‌ను రూ.5వేలకు చేర్చుతామని వివరించారు. దివ్యాంగులకు సైతం రూ.6వేలు ఇస్తామన్నారు. 18ఏండ్లు నిండిన మహిళలకు సౌభాగ్యలక్ష్మీ పేరిట ప్రతి నెలా రూ.3వేలు ఇస్తామన్నారు. జనవరి, ఫిబ్రవరిలోనే కొత్త రేషన్‌కార్డులు అందించి ప్రతి తెల్లరేషన్ కార్డుపై ఉచితంగా సన్నబియ్యం అందిస్తామని తెలిపారు. తెల్లకార్డు ఉన్న వాల్లందరికీ రైతుబీమా తరహా కేసీఆర్ బీమా అమలు చేస్తామన్నారు.
అధికారంలోకి వస్తామని కాంగ్రెసోళ్లు పగటికలలు కంటున్నారని, వారి ఆశలన్ని కలలుగానే మిగిలిపోతాయని మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ సారథ్యంలో తెలంగాణ ప్రగతిపథంలో పయనించడం నిజం కాదా అని మీరే జవాబు చెప్పాలని ప్రజలను అడిగారు. బంగారు తెలంగాణను ఢిల్లీ నాయకుల చేతుల్లో పెట్టి బలవుదామా? అని ప్రశ్నించారు. ప్రతిపక్షాల మాయమాటలను నమ్మవద్దని సూచించారు. కేసీఆర్‌ను మూడో సారి సీఎం చేయాలని, సౌమ్యుడు సతీశ్‌కుమార్‌ను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.