కరీంనగర్, ఆగస్టు 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : వినూత్న ఆలోచనలు.. విప్లవాత్మక నిర్ణయాలు.. సరికొత్త ప్రయోగాలకు రాజన్న సిరిసిల్ల జిల్లాను కేరాఫ్‌గా మారుస్తున్నారు కలెక్టర్ అనురాగ్ జయంతి. ఆయన బాధ్యతలు చేపట్టి నేటికి రెండేళ్లవుతుండగా, మంత్రి కేటీఆర్ మార్గదర్శనంతో ఎన్నో సరికొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్యను పెంచే లక్ష్యంతో ‘మిషన్ 80’ చేపట్టి, పేదలకు ఆర్థికభారం తప్పించారు. గర్భిణులకు భరోసానిచ్చేందుకు ‘మాతృసేవా’ను అందుబాటులోకి తెచ్చారు. జిల్లాను పోషకాహార లోప రహితంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ‘మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్’ను అమలు చేస్తున్నారు. ఎల్లారెడ్డిపేటలో రాష్ట్రంలోనే తొలి డే కేర్ సెంటర్ ఏర్పాటు చేసి వృద్ధులకు అండగా నిలుస్తున్నారు. విద్యార్థుల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని పెంపొందించే లక్ష్యంతో ప్రభుత్వ పాఠశాలల్లో ’కంప్యూటర్ చాంప్స్’ తెచ్చారు. ఇలా విభిన్నమైన కార్యక్రమాలతో కలెక్టర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఆయన బాధ్యతలు చేపట్టి నేటికి రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో ఈ గడ్డవేదికగా అమలవుతున్న పథకాలపై ‘నమస్తే’ ప్రత్యేక కథనం..
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్‌గా అనురాగ్ జయంతి బాధ్యతలు చేపట్టి నేటికి రెండేళ్ల అవుతున్నది. మంత్రి కేటీఆర్ మార్గనిర్దేశనం ముందుకెళ్తున్న ఆయన, ఈ రెండేళ్లలో ఎన్నో వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రజల ఆశలు, ఆశయాలకు అనుగుణంగా పనిచేస్తూ.. శభాష్ అనిపించుకుంటున్నారు. ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకోవడమేకాకుండా.. వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేస్తూ.. తనదైన ముద్ర వేసుకుంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు మానవత్వపు సొబగులు అద్దుతూ ప్రజల మన్ననలు పొందుతున్నారు.
వినూత్న ఆలోచనలు
మాతృసేవా కార్యక్రమం
గర్భిణులకు అండగా ఉండేందుకు కలెక్టర్ అనురాగ్ జయంతి ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రోగులు వైద్యశాలకు వచ్చాక డాక్టర్‌ను కలిసేందుకు ఎవరిని సంప్రదించాలో, మందులు, పరీక్షలు, స్కానింగ్ కోసం ఎవరినీ సంప్రదించాలో తెలిపేందుకు జిల్లా దవాఖానతో పాటు వేములవాడ ఏరియా దవాఖానలో ప్రత్యేక పబ్లిక్ రిలేషన్ వ్యవస్థను ‘మాతృ సేవా కార్యక్రమం’ పేరిట ఏర్పాటు చేశారు. అలాగే పీహెచ్‌సీల్లో పనిచేస్తున్నహెల్త్ సూపర్వైజర్లకు పీఆర్వో బాధ్యతలు అప్పగించారు. వీరికి మెటర్నిటీ సర్వీస్ ఎగ్జిక్యూటీవ్‌గా నామకరణం చేశారు. సిరిసిల్ల దవాఖానలో 8 మంది, వేములవాడ ప్రాంతీయ వైద్యశాలలో ఐదుగురు హెల్త్ సూపర్వైజర్లను పీఆర్వోలుగా నియమించారు. మూడు షిఫ్ట్‌ల్లో 24 గంటలు అందుబాటులో ఉంటూ గర్భిణులకు సేవలందిస్తున్నారు. వీరిని సులభంగా గుర్తించేలా డ్రెస్‌కోడ్ ఏర్పాటు చేశారు. హెల్త్ ఎడ్యుకేటర్లకు బ్లెజ్ కోట్, సహాయకులుగా ఉండే నర్సింగ్ విద్యార్థులకు స్లీవ్ లెస్ బ్లేజ్‌ను డ్రెస్‌కోడ్‌ను అమలు చేస్తున్నారు. గర్భిణులు రాగానే స్నేహపూర్వకంగా రిసీవ్ చేసుకోవడం, వచ్చినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు వారి వెన్నంటే ఉంటూ వారికి కావాల్సిన సేవలకు సులభంగా, వేగంగా అందేలా చూస్తున్నారు.
ఫలితమిచ్చిన ‘మిషన్ 80’
విద్య, వైద్య రంగాలు బలోపేతమైతేనే పేదల బతుకులు బాగుపడతాయన్న మంత్రి కేటీఆర్ విశ్వాసం మేరకు ఈ రంగాలపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రభుత్వ విద్య, వైద్యంపై ప్రజల్లో ఉన్న అపోహను పోగొట్టి ప్రజలకు విశ్వాసం కలిపించారు. ఫలితంగా పేదలకు ఆర్థికభారం తగ్గేలా చేశారు. జిల్లా, ఏరియా దవాఖానలకు వచ్చే రోగులకు అందుతున్న వైద్య సేవలను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రసవాల సంఖ్యను 80శాతానికి పైగా పెంచే లక్ష్యంతో ‘మిషన్ 80’ని చేపట్టారు. సాధారణ ప్రసవాలను ప్రోత్సహించి పేదలపై ఆర్థిక భారం తగ్గించడమే లక్ష్యంగా తెచ్చిన ఈ మిషన్ సత్ఫలితాలు ఇవ్వగా, పేదలతోపాటు ఆర్థికంగా ఉన్నవారు కూడా ప్రభుత్వ వైద్యశాలల్లోనే ప్రసవాలు చేయించుకుంటున్నారు. గతేడాది ప్రసవాలసగటు కేవలం 50 శాతంలోపే ఉండగా, ప్రస్తుత సంవత్సరం ఫిబ్రవరిలో 54 శాతం, జూన్‌లో 63 శాతానికి పెరిగాయి. జూలైలో ఇప్పటి వరకూ 71 శాతానికి చేరాయి.
పీహెచ్‌సీల్లో ఫిజీయోథెరపీ
రాష్ట్రంలోనే తొలిసారిగా రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తొమ్మిది ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఫిజీయోథెరపీ సేవలను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేక చొరవతో ఒక్కో పీహెచ్సీలో 90 వేలతో ట్రాన్స్క్యుటేనియస్ ఎలక్ట్రికల్ నర్వ్ స్టిమ్యులేషన్, అల్ట్రాసౌండ్ ట్రాక్షన్ ఎలక్ట్రోథెరపీ వంటి పరికరాలను అమర్చారు. ప్రధానంగా వెన్ను, అరికాళ్లు, పిక్కలు, మోకాళ్లు, భుజాలతోపాటు ఇతర నొప్పుల నివారణకు నిపుణులైన వైద్యులతో ఫిజియోథెరపీతో సేవలు అందించనున్నారు.
పార్క్‌లపై ప్రత్యేక దృష్టి
పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలని మంత్రి ఆదేశాల మేరకు కలెక్టర్ పార్కుల అభివృద్ధిపై ప్రత్యేక దృ ష్టి పెట్టారు. సిరిసిల్ల అర్బన్ పార్క్‌ను అద్భుతంగా తీర్చిదిద్ది ప్రారంభోత్సవానికి సిద్ధం చేశారు. వేములవాడ మూలవాగు బండ్ పార్క్‌ను అందుబాటులోకి తెచ్చారు. సిరిసిల్ల కొత్త చెరువు ను పర్యాటకంగా రూపొందించారు. ప్రసిద్ధ శైవ క్షేత్రం కలిగిన వేములవాడలో ఆధ్యాత్మికత ఉట్టిపడేలా జంక్షన్లను అభివృద్ధి చేశారు. నంది కమాన్, జగిత్యాల రో్డ్ జంక్షన్ ను చూపరులను కట్టిపడేసేలా, భక్తి భావం పెంపొందించేలా సుందరంగా తీర్చిదిద్దారు.
మానసిక వ్యాధి గ్రస్తులకు ఆశా ‘కిరణం’
మానసిక రుగ్మలతో బాధపడుతున్న వారి కోసం ప్రభుత్వం ‘కిరణం’ కార్యక్రమాన్ని అమల్లోకి తెచ్చింది. పైలెట్ ప్రాజెక్టులో భాగంగా సిరిసిల్లలో రాష్ట్రంలోనే తొలిసారిగా సలహా కేంద్రాన్ని ఏర్పాటు చేసింది. అందులో సైకలాజిస్ట్‌లు, సైక్రియాటిస్ట్‌లను నియమించింది. నిరంతరం సేవలందించేలా 1800425 3333 టోల్‌ఫ్రీ నంబర్‌ను అందుబాటులోకి తెచ్చింది. జిల్లాలో ప్రభావంతంగా అమలు చేసేందుకు జిల్లా కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నారు.
వేములవాడ పట్టణం తిప్పాపూర్‌లో బల్దియా ఆధ్వర్యంలో ఆవు, కోడెల పేడ ఆధారిత బయోగ్యాస్ ఎలక్ట్రికల్ ప్లాంట్‌ను శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయ నిధులు 31. 60 లక్షలతో నిర్మించారు. ఈ ప్లాంట్ నుంచి ఉత్పత్తయ్యే పర్యావరణ హిత గ్రీన్ ఎనర్జీ విద్యుత్ ను గోశాలను ఆనుకుని ఉన్న వేములవాడ ఏరియా దవాఖానతో పాటు ఆలయ విద్యుత్ అవసరాలను తీర్చనున్నది.
స్కూళ్లల్లో ’కంప్యూటర్ చాంప్స్’
ప్రభుత్వ పాఠశాలల్లో ఆధునిక ఐటీ, ఐటీ ఆధారిత విద్యా బోధనే లక్ష్యంగా సిరిసిల్ల జిల్లాలో ప్రయోగాత్మకంగా 60 స్కూళ్లల్లో 12,800 మంది విద్యార్థులకు ’కంప్యూటర్ చాంప్స్’ పేరిట డిజిటల్ అక్షరాస్యత కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. దీనిద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉండే అవకాశాలను ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అందిపించుకోవాలన్నది ఈ కార్యక్రమం ఉద్ధేశ్యం.
ఎల్లారెడ్డిపేటలో రాష్ట్రంలోనే తొలి డే కేర్ సెంటర్
మంత్రి కేటీఆర్ సూచనల మేరకు వృద్ధుల కోసం ఎల్లారెడ్డిపేటలో రాష్ట్రంలోనే తొలి డే కేర్ సెంటర్‌ను ప్రారంభించారు. జీవిత చరమాంకంలో ఆహ్లాదాన్ని అందించి ఆయుష్షు పెంచేందుకు మానవీయ కోణంలో దీనిని ఏర్పాటు చేశారు. అలాగే మండేపల్లిల్లో ప్రభుత్వ వృద్ధాశ్రమాన్ని త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తెచ్చారు. వీటిలో వృద్ధుల కోసం సకల సదుపాయాలు కల్పించారు.
మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్
రాజన్న సిరిసిల్ల జిల్లాను పోషకాహారలోప రహితంగా తీర్చిదిద్దాలన్న మంత్రి కేటీఆర్ మార్గదర్శనం మేరకు కలెక్టర్ అనురాగ్ జయంతి సరికొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. ‘మిల్లెట్ ఫుడ్ ఫెస్టివల్’ పేరిట కార్యక్రమాన్ని కొద్దికాలంగా అమలు చేస్తున్నారు. కాల్షియం, ఐరన్, పీచు పదార్థం ఎక్కువ ఉండే రాగి లడ్డూను ప్రతి శనివారం అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణులకు అందించారు. ఈ ప్రయోగం వెనుక పోషకాహారలోప నివారణే కాక, స్థానిక రైతులను చిరుధాన్యాల సాగువైపు మళ్లీంచే లక్ష్యం కూడా పెట్టుకున్నారు.