Godavarikhani | కోల్ సిటీ, జూలై 12: రామగుండం నగర పాలక సంస్థ పరిధిలో కొద్ది రోజులుగా సామాన్యుల ఇళ్లు కూల్చడం, ఆస్తులకు నష్టం కలిగించడమే అభివృద్ధి అందామా..? అని ఎన్ఐపీ జాతీయ ఉపాధ్యక్షుడు వేముల అశోక్ ప్రశ్నించారు. స్థానిక మార్కండేయ కాలనీలో శనివారం జరిగిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. అభివృద్ధి పేరుతో ఆస్తుల విధ్వంసం వల్ల సామాన్య ప్రజలు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో అని కూడా ఆలోచించడం లేదన్నారు.
తమ రెక్కల కష్టంతో ఇళ్లు కట్టుకున్న వారిని రోడ్ల వెడల్పు పేరుతో అర్ధాంతరంగా అధికారులను పురమాయించి కనీసం నోటీసులు, గడువు ఇవ్వకుండా నిర్ధాక్షిణ్యంగా కూల్చడంతో యజమానుల మానసిక ఆవేదన చెందుతున్నారన్నారు. కార్పొరేట్ శక్తులకు మాత్రమే లాభం చేకూర్చేలా చేస్తున్నారని ఆరోపించారు. దుకాణాలు, ఇళ్లు కూల్చడం వల్ల వ్యాపారులు రోడ్డున పడుతున్నారని పేర్కొన్నారు. ఆర్థిక స్వాతంత్ర్యం కోల్పోయి పిల్లల చదువులు, పెళ్లిళ్లు చేయలేని పరిస్థితి కలిగిస్తున్నారని వాపోయారు.
నగరంను అభివృద్ధి చేయాలంటే చుట్టూ పరిసర ప్రాంతాలను వినియోగంలోకి తీసుకవచ్చి చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడం వల్ల జనాభా కూడా పెరుగుతుందని పేర్కొన్నారు. తద్వారా నగరం కూడా విస్తరిస్తుందన్నారు. అంతేగానీ ఉన్న చోటే ఆస్తులను ధ్వంసం చేసి మాల్స్ నిర్మిస్తామని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఇప్పటివరకూ జరిగిన కూల్చివేతలో ఒక్కరైనా కాంగ్రెస్ పార్టీకి చెందిన వారు కోల్పోయారా అని ప్రజలు ఆలోచించాలన్నారు.