Godavarikhani | కోల్ సిటీ , మే 16: కాంగ్రెస్ పార్టీలో దళిత నాయకులకు స్థానం ఉండదా..? అలాంటప్పుడు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానించడమేననీ, సీఎం రేవంత్ రెడ్డి క్యాంపు ఆఫీసను ముట్టడించి మా దళితుల సత్తా చూపిస్తామని ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బొంకూరి మధు హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ప్రారంభమైన సరస్వతీ పుష్కరాలలో పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఫొటో లేకుండానే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి దళిత జాతి ఎంపీని అవమానించిన దేవాదాయ శాఖ అధికారులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
పుష్కరాలకు వచ్చిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకవెళ్లే ప్రయత్నం చేస్తే పోలీసులను పురమాయించి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలనే రోడ్డుపై ఈడ్చుకుంటూ పోలీస్ స్టేషన్కు తీసుకవెళ్లి బంధించడం ఏమిటని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో దళితులకు చోటు ఉండదా? కాకా కుటుంబంపై కావాలనే మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీ కుట్ర పూరితంగానే వ్యవహరిస్తుందని ఆరోపించారు. ఏమైనా రాజకీయ విభేదాలు ఉంటే పార్టీ పరంగా చూసుకోవాలనీ, కానీ యావత్తు దళిత జాతిని అవమానించే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు.
ఇవాళ దళిత ఎంపీకే స్థానం లేదంటే రేపు సామాన్య ప్రజలను కాంగ్రెస్ పార్టీ మనుషులుగా చూస్తుందా అని ప్రశ్నించారు. పైగా దళిత కార్యకర్తలను అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అన్నారు. ఇందుకు మూల్యంగా సీఎం క్యాంపు ఆఫీసను ముట్టడిస్తామని హెచ్చరించారు. లేదంటే సీఎం, ఉప ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని దేవాదాయ శాఖ అధికారులపై తక్షణమే అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.