వైద్య విద్యను నేర్పే కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కాలేజీ కొలువుల దందాకు కేరాఫ్‌గా మారిపోతున్నదా..? అంటే అవుననే తెలుస్తున్నది! ఓ కీలక అధికారి తీరుతో కళాశాల ప్రతిష్ట రోజురోజుకూ మసకబారుతున్నది. అర్హులైన అభ్యర్థులను వదిలి తన కుటుంబ సభ్యులకే ఔట్ సోర్సింగ్ కింద ఇచ్చిన ఉద్యోగాలపై గత నెల 16న ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురించిన కథనంతో వ్యవహారం బయటపడింది. కలెక్టర్ పమేలా సత్పతి స్పందించి కమిటీని నియమించగా, ఓ వైపు విచారణ చేస్తుండగానే సదరు ఆఫీసర్ మరో దందాకు తెరలేపినట్లు తెలుస్తున్నది.
కొత్తగా 36 మంది శానిటేషన్ సిబ్బందిని ఔట్ సోర్సింగ్ కింద నియమించేందుకు ఓ ఏజెన్సీతో ఒప్పందం జరుగగా, వాటిపై ఆ సారు కన్నుపడింది. మెడికల్ కళాశాల ఏర్పాటు చేసిన సీడ్ గోదాముల్లో గతంలో పనిచేసిన వారిని పిలిచి ఉద్యోగాలు ఇప్పిస్తానని ఆశ చూపి, ఏకంగా కలెక్టర్‌కు ఇచ్చేందుకు వినతి పత్రం ప్రిపేర్ చేసినట్లు తెలిసింది. ఈ విషయంలో తరుచూ జోక్యం చేసుకుంటున్నఈ అధికారికి ఎందుకింత ఇంట్రెస్ట్ అనే సంశయం వ్యక్తమవుతున్నది.
కరీంనగర్, జూన్ 3 (నమస్తే తెలంగాణ)/విద్యానగర్: కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఉద్యోగాల దందా కొనసాగుతూనే ఉంది. ఈ కళాశాలలో పనిచేస్తున్న ఓ కీలక అధికారి అర్హులైన అభ్యర్థులను వదిలి తన కుటుంబ సభ్యులకే ఔట్ సోర్సింగ్ కింద ఉద్యోగాలు ఇప్పించుకున్న విషయాన్ని కొద్దిరోజుల కింద ‘నమస్తే తెలంగాణ’ వెలుగులోకి తెచ్చింది. గత నెల 16న ‘మెడికల్ కళాశాలలో ఉద్యోగాల దందా’ శీర్షికన ప్రముఖంగా ప్రచురితమైంది. ఈ విషయమై స్పందించిన కలెక్టర్ పమేలా సత్పతి, జిల్లా రెవెన్యూ అధికారి బీ వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కే వెంకట రమణ, హాస్పిటల్ సర్వీసెస్ జిల్లా కో ఆర్డినేటర్ డాక్టర్ ఏ చంద్రశేఖర్, మెడికల్ కళాశాల అనస్తీషియా హెచ్‌వోడీ డాక్టర్ శాంతన్ కుమార్‌తో ఒక కమిటీని నియమించారు.
ఈ కమిటీ ఇటీవల కళాశాలకు వెళ్లి విచారణ జరిపింది. ఓ అధికారి కుటుంబ సభ్యులు ఔట్ సోర్సింగ్ విధానంలో ఉద్యోగం చేస్తున్నట్లు ఈ కమిటీ దృష్టికి వచ్చింది. ఒక పక్క ఈ విచారణ జరుగుతుండగానే మరో పక్క 36 మందిని ఔట్ సోర్సింగ్ విధానంలో నియమించేందుకు ఈ అధికారి జోక్యం చేసుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తండ్రి స్థానంలో కొడుక్కు ఉద్యోగం ఇప్పించిన ఆ సారుకు, పెద్ద మొత్తంలోనే డబ్బులు ముట్టినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అయితే ఇపుడు పెద్ద సంఖ్యలో ఉద్యోగ అవకాశాలు ఏర్పడడంతో కొత్త దందాకు తెర తీసినట్లు తెలుస్తున్నది.
ఆయనకు ఎందుకింత శ్రద్ధ?
కరీంనగర్ ప్రభుత్వ మెడికల్ కళాశాలలో ఓ కీలక పోస్టులో ఉన్న అధికారి ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల నియామకాల్లో ఎందుకింత శ్రద్ధ చూపుతున్నారనే చర్చ జరుగుతున్నది. కళాశాలపై అధికారులకు లేని ఆసక్తి ఈయనకు మాత్రమే ఎందుకని ఏకంగా కళాశాల ఉద్యోగులే చర్చించుకుంటున్నారు. గతంలో తన కుటుంబ సభ్యులకు ఔట్ సోర్సింగ్ కింద ఉద్యోగాలు ఇప్పించుకున్న ఈ అధికారి ఇదే బాటలో మరిన్ని ఉద్యోగాలు ఇప్పించాలని చూస్తున్నాడనే ఆరోపణలు వస్తున్నాయి.
నిజానికి గతంలో తెలంగాణ విత్తనోత్పత్తి సంస్థకు చెందిన గోదాముల్లో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశారు. ఈ కళాశాల ఏర్పాటుతో ఇందులో పని చేసిన హమాలీలకు ఉపాధి దెబ్బతింటుందని భావించిన అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన వారికి ఔట్ సోర్సింగ్ కింద ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పింది. ప్రభుత్వం మారినా హమాలీలకు ఇచ్చిన మాట నిలబెట్టుకునే బాధ్యత ఇప్పటి ప్రభుత్వంపై ఉంటుంది. హమాలీలు అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులను సంప్రదించి తమకు ఇచ్చిన మాట నిలబెట్టుకునేలా ఒత్తిడి తెచ్చుకుంటే ఒక రకంగా ప్రయోజనం కలిగే అవకాశాలు ఉంటాయి. కానీ, మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న ఈ అధికారి వారిని ఏకంగా కళాశాలకు రప్పించుకుని అధికారికంగా కలెక్టర్‌కు ఓ వినతి పత్రాన్ని తయారు చేసినట్లు తెలుస్తున్నది.
అందులో గతంలో సీడ్ గోదాముల్లో పని చేసిన వారితో సంతకాలు తీసుకుని కళాశాలలో పనిచేసే మరో అధికారి సంతకం తీసుకుని కళాశాల నుంచి అధికారికంగా కలెక్టర్‌కు లేఖ రాసే ప్రయత్నం చేసినట్లు, ఆయన ప్రతిపాదనను మిగతా అధికారులు తిరస్కరించినట్లు తెలిసింది. కానీ, ఆ అధికారి మాత్రం తన ప్రయత్నాన్ని మానుకోకుండా తాను ప్రిపేర్ చేసిన వినతి పత్రాన్ని కలెక్టర్‌కు చేర్చినట్లు కళాశాల ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. గతంలో ఇదే కళాశాలలో పని చేసిన ఓ కార్మికుని స్థానంలో తన కొడుక్కు ఉద్యోగం ఇప్పించడానికే పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలు వస్తున్నాయి.
ఇపుడు ఒకే సారి 36 ఉద్యోగాల నియామకం జరుగుతున్న నేపథ్యంలో ఈ అధికారి తిరిగి జోక్యం చేసుకొని జిల్లా అధికారులకు తలనొప్పి తెస్తున్నట్లు తెలుస్తున్నది. నిజానికి ఔట్ సోర్సింగ్ ఏజెన్సీతో కళాశాలకు ఒప్పందం జరుగుతుంది. సదరు ఏజెన్సీయే ఉద్యోగులను నియమించాల్సి ఉంటుంది. ఇపుడు కళాశాలలో పనిచేస్తున్న అధికారి జోక్యం చేసుకోవడం, గతంలో పనిచేసిన కార్మికులకు ఉద్యోగాలు ఇవ్వాలని కోరడం వెనక పెద్ద మొత్తంలో డబ్బులు చేతులు మారే అవకాశాలు ఉన్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పిస్తున్న ఓ ప్రభుత్వ ఆమోదిత సంస్థ అధికారుల ప్రోత్సాహం కూడా ఉన్నట్లు, అందుకే సదరు కళాశాల అధికారి ఇంత ఉత్సాహాన్ని ప్రదర్శిస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.
విచారణ కమిటీ ఏం చేసింది?
ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల నియామకంపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో కమిటీ వేసిన కలెక్టర్, సంబంధిత పత్రాలు, నిర్ధిష్ట సిఫారసులతో వివరణాత్మక నివేదికను వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం కార్యదర్శికి నివేదించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. ఈ మేరకు ఇటీవల విచారణ జరిపిన అధికారులు నివేదికలు మాత్రం వెల్లడించలేదు. ఇటు నమస్తే తెలంగాణలో వచ్చిన కథనం వాస్తమా, అబద్దమా..? అనే వివరణ కూడా ఇవ్వలేదు. అయితే ఓ ప్రభుత్వ ఆమోదిత సంస్థకు చెందిన అధికారి విచారణ కమిటీ ముందు హాజరైనట్లు తెలుస్తోంది. ఈ అధికారి ఇచ్చిన వివరణపైనే కమిటీ తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
అయితే ఇప్పటికే మెడికల్ కళాశాలలో కీలకంగా ఉన్న అధికారికి ఈ అధికారికి మధ్య ఔట్ సోర్సింగ్ ఉద్యోగాలు ఇప్పించడంలో సత్సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఇద్దరు అధికారులు ఒక్కటై కమిటీని తప్పుతోవ పట్టించి ఉంటారనే అనుమానాలు కూడా లేక పోలేదు. కొత్తగా వచ్చే ఔట్ సోర్సింగ్ ఉద్యోగాల కోసం గతంలో సీడ్ గోదాముల్లో పనిచేసిన కార్మికులను కూడా ఈ విధంగానే ప్రలోభాలకు గురి చేసి ఉంటారనే ఆరోపణలు వస్తున్నాయి. న్యాయంగా అయితే గత ప్రభుత్వంలో అధికారులు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు హమాలీలకు ఔట్ సోర్సింగ్‌లో ఉద్యోగాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది. కానీ ఈ అధికారి జోక్యంపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సదరు కార్మికులను ప్రలోభ పెట్టి పెద్ద మొత్తంలో వసూళ్ల పర్వానికి ఈ అధికారి తెర తీసినట్లు కళాశాల ఉద్యోగులు, అధికారులే చర్చించుకుంటున్నారు.