ఎన్నో ఏండ్ల నిరీక్షణ, పోరాటం తర్వాత ఉద్యోగాలు సాధించుకున్న 2008 డీఎస్సీ అభ్యర్థులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వానికి పంపిన జాబితాలో తాజాగా అధికారులు భారీ అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ డీఎస్సీకి సంబంధించి ఫలితాలు 2010 లోనే వెలువడగా, ఆనాడు వెల్లడించిన మెరిట్ లిస్ట్‌లోని 13 మంది పేర్లు ప్రస్తుతం గల్లంతయ్యాయి. దీనిపై విద్యాశాఖాధికారులను ప్రశ్నిస్తే.. ఆగమేఘాల మీద అందులో నుంచి ఐదుగురి పేర్లు జాబితాలో చేర్చి, మరో ఎనిమిది మందికి చేయిచ్చారు.
ఇంకోవైపు ఆనాటి జాబితాలో లేని 25 మందికి కొత్తగా అవకాశం కల్పించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే, ఆనాడు లేని ఆ 25 మంది పేర్లు ఇప్పుడెలా వచ్చాయి? అందులో మతలబు ఏమిటి? దీని వెనుక నడిచిన వ్యవహారం ఏమిటన్న దానిపై అనేక సందేహాలు ఉత్పన్నమవుతుండగా, విచారణ జరిపితే మొత్తం అక్రమాలు బహిర్గతం అవుతాయన్న డిమాండ్ వ్యక్తమవుతున్నది. దీనిపై జిల్లా విద్యాశాఖాధికారి పొంతన లేని సమాధానాలు చెప్పడం మరిన్ని అనుమానాలు, అపోహలకు దారి తీస్తున్నది.
కరీంనగర్, అక్టోబర్ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/ కమాన్ చౌరస్తా : 2008లో ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించింది. ఆ సమయంలో జారీ చేసిన నోటిఫికేషన్లో అన్ని పోస్టులకు బీఈడీ, డీఈడీ అభ్యర్థులు అర్హులంటూ స్పష్టంగా పేర్కొంది. ఆ తర్వాత నోటిఫికేషన్‌కు భిన్నంగా జీవో నంబర్ 28ను జారీ చేసి, అందులో ప్యాట్రన్ మార్చింది. 70 శాతం పోస్టులను కామన్‌గా పేర్కొంటూ, 30 శాతం పోస్టులకు మాత్రం డీఈడీ చేసిన వాళ్లు మాత్రమే అర్హులని చెప్పింది. దీని ద్వారా తమకు అన్యాయం జరగుతుందని భావించిన బీఈడీ అభ్యర్థులు, అప్పుడే కోర్టును ఆశ్రయించారు.
ఆ పరిస్థితుల్లోనే ప్రభుత్వం 2010 జూన్‌లో నోటిఫికేషన్ నిబంధనలకు అనుగుణంగానే జిల్లాల వారీగా మెరిట్ జాబితా ప్రకటించింది. దాని ప్రకారం కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి 965 మంది అభ్యర్థుల పేర్లతో డీఎస్సీ కామన్ మెరిట్ జాబితా ఇచ్చింది. కానీ, మళ్లీ నియామకాల సమయంలో మాత్రం జీవో నంబర్ 28లోని నిబంధనలను అమలు చేసింది. దీంతో మెరిట్ జాబితాలో ఉండి కూడా తమకు ఉద్యోగం రాకపోవడానికి గల కారణాలను వివరిస్తూ.. బీఈడీ అభ్యర్థులు మరోసారి కోర్టును అశ్రయించారు. అంతేకాదు, నోటిఫికేషన్ జారీ చేసిన నాటి నింబంధనలనే పరిగణలోకి తీసుకొని, తమకు నియామకాలు చేపట్టాలని ఇన్నాళ్లు పోరాటం చేస్తూ వచ్చారు.
ఫలించిన పోరాటం
దాదాపు పదహారేండ్లుగా ఉద్యోగాల కోసం చేసిన పోరాటం ఫలించింది. 2008లో నిర్వహించిన డీఎస్సీ ద్వారా ఎంపికై, ప్రభుత్వం ప్యాట్రన్ మార్చడం వల్ల నష్టోయిన అభ్యర్థులకు ఉద్యోగాలు కల్పించాలని ఇటీవల కోర్టు ఆదేశాలిచ్చింది. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్న ప్రస్తుత ప్రభుత్వం దీనిపై మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. కమిటీకి మంత్రి దామోదర రాజనర్సింహ అధ్యక్షుడిగా, మన ఉమ్మడి జిల్లా మంత్రు లు దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ సభ్యులుగా వ్యవహరించారు.
కమిటీ పూర్తి అధ్యయనం చేసిన తర్వాత 2008 డీఎస్సీలో ఎంపికైన అభ్యర్థులకు కాంట్రాక్ట్ ప్రాతిపదికన సెకండరీ గ్రేడ్ టీచర్‌గా ప్రస్తుతం ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించింది. ఈ క్రమంలో ఆయా జిల్లాల జిల్లా విద్యాశాఖాధికారులు (డీఈవోలు) ఆనాటి మెరిట్ జాబితాలను అందజేయాలని రా ష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ ప్రకారం చూస్తే.. నోటిఫికేషన్ జా రీ సమయంలో ఉన్న నిబంధనలకు అనుగుణంగా ఆనాడు అంటే 2010లో ప్రకటించిన మెరిట్ జాబితాను అధికారులు ప్రభుత్వానికి పంపించాలి.
అంతా గోల్మాల్?
తాజా, పరిణామాలను చూస్తే ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లా విద్యాశాఖాధికారులు పంపిన జాబితా తప్పుల తడకగా ఉన్నట్టు స్పష్టమవుతున్నది. ఆనాడు ప్రకటించిన మెరిట్ లిస్ట్ ప్రకారం చూస్తే ఇంకా 228 మంది బీఈడీ అభ్యర్థులకు ఉద్యోగాలు ఇవ్వాలి. కానీ, తాజాగా, అధికారులు మొదటి జాబితాలో 186 మంది పేర్లు, రెండో జాబితాలో 14 మంది పేర్లు ప్రభుత్వానికి పంపించారు. ఈ రెండు జాబితాల్లో కలిపి 200 మంది పేర్లు ఉన్నాయి. ఇక్కడే అక్రమాలు చోటుచేసుకున్నాయి. నిజానికి రెండుసార్లు పంపిన జాబితా కలిపి చూస్తే.. 2010లో ప్రకటించిన మెరిట్ జాబితాలో ఉన్న 13 మంది పేర్లు గల్లంతయ్యాయి.
ఈ విషయం తెలుసుకున్న సంబంధిత అభ్యర్థులు వచ్చి రెండు రోజుల పాటు డీఈవో కార్యాలయం ఎదుట పడిగాపులుపడి ఆందోళన చేస్తే.. అందులో నుంచి ఐదుగురు అభ్యర్థులను తిరిగి జాబితాలో చేర్చారు. ఇంకా ఎనిమిది మందికి మాత్రం అవకాశం కల్పించడం లేదు. ఈ 13 మంది మెరిట్ జాబితా ప్రకారమే కాదు, 2016లో సమాచార హక్కు చట్టం కింద సేకరించిన డీఎస్సీ జాబితాలోనూ ఉన్నారు. ఇప్పుడు న్యాయబద్ధంగా రావాల్సిన ఎనిమిది మంది అభ్యర్థుల గురించి ప్రశ్నిస్తే తమకు తెలియదన్నట్టు అధికారులు భిన్నరకాల వాదనలు వినిపిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. 2010లో ప్రకటించిన మెరిట్ లిస్ట్, అలాగే 2016లో సమాచార హక్కు చట్టం కింద తీసుకున్న జాబితాలో లేని 25 మంది కొత్త అభ్యర్థుల పేర్లను ప్రభుత్వానికి జిల్లా విద్యాధికారులు పంపించారు. ఆనాడు మెరిట్ జాబితాలో లేని పేర్లు ఈరోజు జాబితాలోకి ఎలా వచ్చాయన్న దానికి అధికారులు వింత వాదనలు వినిపిస్తున్నారు. దీనిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై లోతైన విచారణ జరిగితే ఈ అక్రమాలన్నీ బహిర్గతం అవుతాయన్న డిమాండ్లు వస్తున్నాయి. అంతేకాదు, రాష్ట్రంలోని ఏ జిల్లాలో లేని సమస్య ప్రస్తుతం కరీంనగర్ జిల్లాలోనే ఎందుకు వస్తుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
అందులోనూ మంత్రి వర్గ ఉపసంఘంలో మన ఉమ్మడి జిల్లా మంత్రులు శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్ ఉన్న ఇలాకాలోనే ఇటువంటి పరిణామాలు చోటుచేసుకోవడంపై అనుమానాలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై లోతైన విచారణ జరిపితే అర్హులకు జరిగిన అన్యాయంతోపాటు అక్రమాలు బహిర్గతం అవుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఏ కోణంలో చూసినా ఆనాటి మెరిట్ జాబితాకు.. ప్రస్తుతం ప్రభుత్వానికి అధికారులు పంపిన వివరాలకు పొంతన కనిపించడం లేదు. అంతా గోల్మాల్ గోవిందం అన్నట్టుగానే ఉన్నది.
డీఈవో పొంతన లేని సమాధానాలు
మెరిట్ జాబితాలో అభ్యంతరాలు, అదనంగా చేరిన 25 మంది అభ్యర్థుల విషయంలో ‘నమస్తే తెలంగాణ’ డీఈవోను ప్రశ్నించగా, కరీంనగర్ జిల్లా విద్యాశాఖాధికారి నుంచి పొంతన లేని సమాధానాలు వచ్చాయి. అప్పుడు పంపిన మెరిట్ జాబితా తప్పుల తడకగా ఉండగా, తాము దాన్ని సరిచేసి పంపామని చెబుతున్నారు. ఈ విషయంలో అప్పటి అధికారులు తప్పు చేశారా? అని ఆయనను ప్రశ్నించగా, అప్పుడు నేను డీఈవోగా లేనందున సమాధానం చెప్పలేనని అంటున్నారు. మరి నష్టపోయిన అభ్యర్థులు మెరిట్ జాబితాలో ఉన్నారని, డీఈవో దృష్టికి తీసుకుపోగా, వారి కంటే మెరిట్ ఉన్న అభ్యర్థులను గుర్తించి ఉద్యోగాలు కల్పిస్తున్నామని చెప్పారు.