International Leadership Award | కోల్ సిటీ, మే 4 : పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన లయన్స్ క్లబ్ జెడ్సీ నార్ల ప్రసాద్ విశిష్ట సేవలకు అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక అంతర్జాతీయ లీడర్ షిప్ అవార్డు వరించింది. ఈ మేరకు లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఏపీ సింగ్ పంపించిన పిన్, అభినందన లేఖతోపాటు అంతర్జాతీయ నాయకత్వ పురస్కారాన్ని ఆదివారం హైదరాబాద్ లో జరిగిన 10వ మల్టీపుల్ డిస్ట్రిక్ట్ కన్వెన్షన్ సందర్భంగా ఇంటర్నేషనల్ డైరెక్టర్ బాబురావు చేతుల మీదుగా ప్రదానం చేశారు.
ఆపదలో, కష్టాల్లో ఉన్న వారి అవసరాలను గుర్తించి వారికి తోడ్పాటు అందించడంతోపాటు సమాజంలో లయన్స్ క్లబ్ కు ఇతోధికమైన ప్రఖ్యాతలు తీసుకవస్తున్నందుకు అంతర్జాతీయ పురస్కారం లభించడం హర్షణీయమని 320జీ డిస్ట్రిక్ట్ గవర్నర్ లయన్ సింహరాజుల కోదండరాం ప్రత్యేకంగా అభినందించారు. తోటి లయన్స్, సమాజంకు ఆదర్శంగా నిలిచారని కొనియాడారు. అలాగే స్థానిక లయన్స్ క్లబ్ ప్రతినిధులు, సీనియర్ సభ్యులు అభినందనలు తెలిపారు. కాగా, నార్ల ప్రసాద్ మాట్లాడుతూ తోటి లయన్స్ సహకారం వల్లనే తనకు ఈ గుర్తింపు లభించడం గర్వంగా ఉందన్నారు. లయన్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.