పరీక్షా కాలం వచ్చేసింది. జూన్ ఆరంభం నుంచి ప్రారంభమైన విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకున్నది. అటు పది, ఇటు ఇంటర్మీడియెట్ సమరానికి సమయం దగ్గరపడుతున్నది. ఇప్పటికే ఇంటర్ ప్రథమ సంవత్సర విద్యార్థులు గత నెల 30 నుంచే ‘పర్యావరణ శాస్త్ర పరీక్షతో’ ఎగ్జామ్ సీజన్లోకి ప్రవేశించగా, ఈ నెల 3 నుంచి ప్రయోగాలు చేసి, మార్చి 5 నుంచి జగిత్యాల జిల్లాలో దాదాపు 13 వేల మంది థియరీ పరీక్షలు రాయబోతున్నారు. ఇక అదే నెల 21 నుంచి పదో తరగతి పిల్లలు 12వేల మందికి బోర్డు ఎగ్జామ్స్ ఉండగా, ఇది కీలక సమయమని, తగిన నిద్ర, ఆహారం తీసుకోవడంతోపాటు విశ్లేషణాత్మక పద్ధతిని అలవరుచుకుంటే మంచి ఫలితాలు వస్తాయని విద్యావేత్తలు సూచిస్తున్నారు.
జగిత్యాల, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : ఇంటర్ ప్రాక్టికల్స్ గత నెల 30 నుంచే ఆరంభమయ్యాయి. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఫస్టియర్‌లో 7,054 మంది, సెకండియర్‌లో 6,141 మంది థియరీ పరీక్షలు రాయబోతున్నారు. ఫస్టియర్ పిల్లలు ఇప్పటికే ఒక సాధారణ పరీక్ష, పర్యావరణం సబ్జెక్టుకు ఎగ్జామ్ జరిగింది. 31న మొదటి సంవత్సరం, ఈనెల 1న రెండో సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 3 నుంచి ప్రాక్టికల్స్ ఆరంభం కాబోతున్నాయి. నాలుగు స్పెల్స్‌లో జరిగే ఈ పరీక్షలు వచ్చే ఈ నెల 25వ తేదీ వరకు జరుగనున్నాయి. మార్చి 5 నుంచి థియరీ పరీక్షలను బోర్డు నిర్వహించనుండగా, ఏర్పాట్లను ఇంటర్‌బోర్డు నియమించిన డెక్ టీమ్ దాదాపుగా పూర్తి చేసింది. జగిత్యాల ఇంటర్ నోడల్ అధికారి బొప్పరాతి నారాయణ నేతృత్వంలో పనులు జరుగనున్నాయి. ప్రాక్టికల్ పరీక్షలకు 29, థియరీ పరీక్షల కోసం 30 కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి.
‘పది’ పరీక్షలకూ ముమ్మరం
పదో తరగతి వార్షిక పరీక్షల నిర్వహణపై అధికారులు దృష్టి పెట్టారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కస్తూర్బా, మోడల్ స్కూల్స్, గురుకుల పాఠశాలల్లో మొత్తంగా 11,855 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇంటర్ పరీక్షలు ముగిసిన తర్వాత మార్చి 21 నుంచి పది పరీక్షలు ఆరంభం కానున్నాయి. మరో నెల పదిహేను రోజుల వ్యవధి ఉన్నప్పటికీ ఇప్పటి నుంచే అధికారులు పరీక్షల ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. గతేడాది కంటే అధికంగానే పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయని విద్యాశాఖ సిబ్బంది పేర్కొంటున్నారు.
సన్నద్ధతకు మంచి సమయం
పరీక్షలు సమీపిస్తున్న ప్రస్తుత తరుణమే సన్నద్ధతకు అత్యంత కీలకమైందని విద్యావేత్తలు, ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. అదే పనిగా చదవడమే కాదు, తగినంత నిద్ర, సరైన ఆహారం, విశ్లేషణాత్మకమైన పద్ధతి, కీలకమైన ప్రశ్నల గుర్తింపు తదితర అంశాలపై దృష్టిని కేంద్రీకరించాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. పరీక్షల కాలంపై వారి అభిప్రాయాలు ఇలా ఉన్నాయి.
సమతుల ఆహారం, నిద్ర అవసరం
పరీక్షల సమయం ఆసన్నమైంది. విద్యార్థులు ఏడాదంతా చదివినప్పటికీ కంగారు పడుతుంటారు. అదే సమయంలో అన్ని సబ్జెక్టులు, అన్ని పాఠ్యాంశాలను చదివామా లేదన్న కంగారు పెరుగుతుంది. దీనికి తోడు తల్లిదండ్రులు సైతం తమ పిల్లల నుంచి అధిక మార్కులను ఆశిస్తారు. ఇవన్నీ క్రమంగా విద్యార్థిని ఒత్తిడికి గురి చేస్తాయి. పరీక్ష సమయంలో విద్యార్థులు ప్రశాంతంగా ఉండాలి. తల్లిదండ్రులు పిల్లలకు బలవర్ధకమైన, సమతులమైన ఆహారం ఇవ్వాలి. ముఖ్యంగా విద్యార్థులు నిద్ర విషయంలో జాగ్రత్త వహించాలి. ఉల్లాసంగా ఉండాలి. చదివిన ప్రశ్నలను మననం చేసుకోవాలి. మాంసాహారానికి దూరంగా ఉండడం మంచిది. అలా చేస్తే విజయం మన సొంతమవుతుంది.
– కొంక వేణు, ప్రిన్సిపాల్ (కొడిమ్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాల)
ఆబ్జెక్టివ్ ప్రశ్నలపై దృష్టి పెట్టాలి
ముఖ్యంగా ఇంటర్ ఆర్ట్స్ విద్యార్థులు ఆబ్జెక్టివ్ ప్రశ్నలపై దృష్టి పెట్టాలి. రెండు మార్కుల ప్రశ్నలను పూర్తిగా అధ్యయనం చేయాలి. పాఠ్య పుస్తకాల్లోని ఏ మూలనుండైనా ప్రశ్నలను సంధించేందుకు అవకాశం ఉంది. అందుకే ప్రతి పాఠాన్ని క్షుణ్ణంగా చదవాలి. ఇక చరిత్ర విద్యార్థులు మ్యాప్‌ను సైతం అధ్యయనం చేస్తే మంచి మార్కులు వస్తాయి. ఓపికగా అన్నీ చదవాలి. ఇంకా మంచి సమయం మిగిలి ఉంది.
– కచ్చు మేఘశ్యాం, పౌరశాస్త్రం ఉపన్యాసకుడు
బట్టీ పద్ధతి మానుకోవాలి
విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో ఈ మధ్య ఒక చిత్రమైన పద్ధతి కనిపిస్తున్నది. మార్కులే పరమావధిగా విద్యార్థులు బట్టీ పద్ధతివైపు వెళ్తున్నారు. ఆఖరికి గణితం విషయం లోనూ అదే పద్ధతిని పాటిస్తున్నారు. ఇది సరైంది కాదు. బట్టీ పడితే గణితంలో రాణించలేమని గుర్తించాలి. లెక్కలను సాల్వ్ చేసే పరిస్థితి ఉండాలి. కానీ, బట్టీ పెడితే ఆ లెక్కలు రాకపోతే ఇబ్బందిప డుతారు. ఇప్పటికైనా మంచి సమయమే ఉంది. లెక్కలను సాధన చేయడం ఆరంభించాలి. మంచి మార్కులు సాధించడానికి అవకాశం ఉన్నది.
– తుంగూరి సురేశ్, టీచర్ (మల్లాపూర్ హైస్కూల్)
విశ్లేషణాత్మకంగా ఆలోచించాలి
విద్యార్థులకు ఈ సమయం అత్యంత కీలకమైంది. సహజంగా విద్యార్థులు రెండు కేటగిరీల్లో ఉంటారు. చురుకైన విద్యార్థులు, అధిక మార్కుల కోసం ఆలోచించే వారు ప్రశ్నలను విశ్లేషించుకునే పద్ధతిని ఎంచుకోవాలి. ఇప్పటికే విద్యా సంవత్సరం ఆరంభం నుంచి కీలకమైన ప్రశ్నలు, మాదిరి లెక్కలను క్షుణ్ణంగా పరిశీలించి ఉంటారు. థియరీ పరీక్షలకు 30 రోజుల టైం మాత్రమే ఉంది. ప్రాక్టికల్ పరీక్షలు ఆరంభం కానున్నాయి. ఇక సాధారణ విద్యార్థులు ఏయే చాప్టర్లు ముఖ్యమైనవో గుర్తించి, మాదిరి ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. అలా చేస్తే మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది.
– శ్రీవాణి, కెమిస్ట్రీ లెక్చరర్ (జగిత్యాల ప్రభుత్వ జూనియర్ కాలేజీ)