Gangadhara | గంగాధర, సెప్టెంబర్ 7 : తాళం వేసి ఉన్న ఇండ్లే లక్ష్యంగా వరుస దొంగతనాలకు పాల్పడుతూ మండల ప్రజలకు కంటిమీద కొనుకు లేకుండా చేసిన అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసినట్లు కరీంనగర్ రూరల్ ఏసీపీ విజయ్ కుమార్ తెలిపారు. కరీంనగర్ రూరల్ ఏసీపీ కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం చల్వాయి గ్రామానికి చెందిన కొండ శశికాంత్ (24) ప్రస్తుతం కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కమాన్ సమీపంలో నివాసం ఉంటున్నాడు. గతంలో చిట్‌ఫండ్ ఏజెంట్‌గా, రేకుర్తిలోని హీరో షోరూంలో సేల్స్‌మెన్‌గా పనిచేశాడు. మద్యపానం, గంజాయి వంటి దురలవాట్లకు బానిసై అప్పులు తీర్చుకునేందుకు దొంగతనాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇందులో భాగంగా తన స్నేహితులైన గోవిందరావుపేటకు చెందిన సీహెచ్ సంతోష్, కరీంనగర్ జిల్లా కేంద్రం కిసాన్ నగర్‌కు చెందిన గనవెల్లి వంశీలతో కలిసి ముఠాగా ఏర్పడ్డారు.
ఇందులో భాగంగా ఆగస్టు 28 న ముగ్గురు నిందితులు స్కూటీపై గంగాధరకు చేరుకుని ఓ ఇంట్లోని పై అంతస్తులో తాళం వేసిన ఉన్న ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి ప్రవేశించారు. ఇంటిలో ఉన్న బంగారు కమ్మలు, మట్టెలు, పట్టీలను అపహరించారు. మధురానగర్, కురిక్యాల గ్రామాల్లో మరో రెండు చోరీలకు పాల్పడ్డట్టు తెలిపారు. సోమవారం మధురానగర్ చౌరస్తాలో బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టడానికి తన ద్విచక్ర వాహనంపై అనుమానాస్పదంగా తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. నిందితుడి వద్ద నుంచి సుమారు 5 గ్రాముల 2 బంగారు చెవుల మాటీలు, 4 గ్రాముల 2 బంగారు చెవుల కమ్మలు, 6 తులాల 2 వెండి పట్టీలతో పాటు, దొంగతనాలకు వినియోగించిన స్కూటీని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితులు సీహెచ్ సంతోష్, గనవెల్లి వంశీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కేసు విచారణలో చాకచక్యంగా వ్యవహరించి నిందితులను పట్టుకున్న ఎస్సై వంశీకృష్ణ, పోలీసులను ఏసీపీ అభినందించారు. ఇక్కడ చొప్పదండి సీఐ ప్రదీప్ కుమార్ పాల్గొన్నారు.