Dharmaram | ధర్మారం, జూలై 8 : పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలను మంగళవారం ఇంటర్మీడియట్ బోర్డు పరిశీలకుడు ఉడిత్యాల రమణారావు సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మమేకమై మాట్లాడారు. ప్రతీ విద్యార్థి క్రమశిక్షణతో చదవాలని ఆయన సూచించారు. విద్య పట్ల ఆసక్తి పెంచుకోవాలని తద్వారా ఉన్నత చదువులు చదివి ఉన్నతమైన స్థితికి చేరుకోవచ్చని సూచించారు.
తద్వారా ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని విద్యార్థులకు ఆయన వివరించారు. ముందుగా మొట్టమొదటి పునాది ఇంటర్ లో ఉత్తమ మార్కులు సాధించి ఉన్నత విద్యకు బాటలు వేసుకోవాలని ఆయన సూచించారు. ఇంటర్ బోర్డ్ డైరెక్టర్ శ్రీ కృష్ణ ఆదిత్య విద్యార్థుల ప్రతిభను వెలికితీయడానికి ఐఐటి, జేఈఈ,నీట్, అప్సెట్, క్లాట్ వంటి పోటీ పరీక్షలకు సిద్ధం చేయడానికి ఫిజిక్స్ వాలా, ఖాన్ అకాడమీ వంటి ప్రసిద్ధ సంస్థలతో ఒప్పందం చేసుకొని ఈనెల 15వ తేదీ నుండి ఆన్లైన్ తరగతుల ద్వారా బోధన చేయడానికి ఏర్పాటు చేస్తున్నారని ఆయన వెల్లడించారు.
అనంతరం కళాశాలలో ఇంటర్ బోర్డు పరిశీలకుడు రమణారావు అధ్యాపకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. విద్యార్థులను ఆకర్షించే విధంగా పాఠాలు బోధించాలని ఆయన సూచించారు. అధ్యాపకులంతా సమిష్టిగా అంకితభావంతో విద్యార్థులకు బోధన చేసి కళాశాలను ఆదర్శంగా ఉండేవిధంగా చూడాలని ఆయన సూచించారు. ప్రతీ అధ్యాపకుడు ఈ అకాడమీలో విద్యార్థుల సంఖ్యను పెంచడానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ డీ అనంతరామకృష్ణ, అధ్యాపక బృందం పాల్గొన్నారు.