కోనరావుపేట, ఏప్రిల్ 24: వడగండ్ల వానతో పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం అందించి ఆదుకోవాలని బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జి చల్మెడ లక్ష్మీనరసింహారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎగ్లాస్పూర్లో రెండు రోజుల క్రితం వడగండ్ల వానతో రాలిపోయిన వరిని గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఈ సందర్భంగా రైతులు తమ బాధలు చెప్పుకొంటూ కన్నీటి పర్యంతమయ్యారు. నాలుగు నెలల పంట నాలుగు నిమిషాల్లో నేలపాలైందని గోడు వెల్లబోసుకున్నారు. అనంతరం చల్మెడ రైతులకు భరోసా కల్పించి, మాట్లాడారు. పంట చేతికొచ్చే దశలో 150 ఎకరాల్లో నేలరాలి పోవడం బాధాకరమన్నారు. పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ కాక, రైతుభరోసా అందక, రైతుబీమా లేక రైతులు ఆగమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రభుత్వం ద్వారా నష్టపరిహారం అందించేలా విప్ కృషి చేయాలని డిమాండ్ చేశారు. ఇక్కడ సెస్ వైస్ చైర్మన్ దేవరకొండ తిరుపతి, సింగిల్ విండో చైర్మన్లు సంకినేని రామ్మోహన్రావు, నర్సయ్య, పార్టీ మండలాధ్యక్షుడు మల్యాల దేవయ్య, నేతలు గోపు పరశురాములు, కెంద గంగాధర్, వంశీకృష్ణరావు, శ్రీనివాస్ ఉన్నారు.