హుజూరాబాద్ రూరల్, జనవరి 20: కొవిడ్ మహమ్మారి విరుచుకుపడుతున్నది. పట్టణంతో పాటు మండలంలోని పలు గ్రామాల్లో కేసులు పెరుగుతున్నాయి. హుజూరాబాద్ ప్రాంతీయ దవాఖానలో గురువారం 140 ర్యాపిడ్ టెస్టులు నిర్వహించగా 40కి పైగా పాజిటివ్ కేసులు నమోరైనట్లు వైద్యాధికారులు పేర్కొన్నారు. నిర్లక్ష్యం చేస్తే ప్రాణాలకే ప్రమాదం జరిగే అవకాశం ఉంది.
నిర్లక్ష్యం వద్దు..
వైరస్‌ను నిర్లక్ష్యం చేయవద్దని… అప్రమత్తతే ఆయుధమని అధికారులు పేర్కొన్నారు. ఇటీవల నమోదవుతున్న కేసుల సంఖ్యను పట్టించుకోకుండా కొంతమంది అవసరం లేకున్నా రోడ్లపైకి రావడం, మాస్కులు ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం, కరోనా లక్షణాలున్నా నిర్లక్ష్యంగా ప్రజల్లో తిరగడంతో వైరస్ చాలా వరకు విజృంభిస్తున్నది. ఈ అలసత్వమే ప్రాణాల మీదికి తీసుకువస్తున్నది. ఇది ఎంత మాత్రం మంచిది కాదని వైద్యులు హెచ్చరిస్తున్నారు. జాగ్రత్తలు పాటించడంతో పాటు చిన్నపాటి లక్షణాలున్నా వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
సొంత వైద్యం పనికిరాదు
కొంత మంది కరోనా లక్షణాలున్నప్పటికీ పరీక్షలు చేయించుకోకుండా ఇంటివద్దనే సొంత వైద్యం చేసుకుంటున్నారు. దీంతో మరింత ప్రమాదం ఉంది. ఇంట్లోనే సొంత వైద్యం చేసుకోవడంతో కుటుంబ సభ్యులకు కూడా వైరస్ సోకే అవకాశాలున్నాయి. ఇంట్లో వృద్ధులు ఉంటే ప్రాణాలకే ప్రమాదం ఉంటుంది. లక్షణాలు కనబడిన వారు హుజూరాబాద్ ప్రాంతీయ దవాఖానలో కరోనా పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్ వస్తే వైద్యుల సలహాలు పాటిస్తే ఎలాంటి హానీ ఉండదు. సొంత వైద్యం ఎప్పటికీ పనికి రాదని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలి
మానకొండూర్ రూరల్, జనవరి 20: లక్ష్మీపూర్ (వెల్ది) పీహెచ్సీ పరిధిలో డాక్టర్ బియాబానీ ఆధ్వర్యంలో గురువారం 77 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా ముగ్గురికి పాజిటివ్‌గా నమోదైనట్లు వైద్య సిబ్బంది తెలిపారు. కరోనా పాజిటివ్‌ల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్నందున ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లక్ష్మీపూర్, వెల్ది, ఊటూర్, పచ్చునూర్, వేగురుపల్లి, కెల్లేడు, జగ్గయ్యపల్లి, రంగపేట గ్రామాల్లో 15-18 ఏండ్ల వారు 12 మంది, రెండు, బూస్టర్ డోస్ 57 మందికి మొత్తం 69 మందికి వ్యాక్సిన్ వేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్లు అన్నపూర్ణ, ఎండీ జుబేర్, ఎల్డీ కంప్యూటర్ ఆపరేటర్ ఎండీ ఇజాజ్, సిబ్బంది ఉన్నారు.