నా పేరు నల్ల గోపాల్‌రెడ్డి. మాది సుల్తానాబాద్ మండలం ఐతరాజ్పల్లి. మా ఊళ్లే నాకు ఎకరం 20 గుంటల భూమి ఉంది. చానా ఏండ్ల నుంచే వరి సాగు చేస్తున్న. మాకు మా ఊళ్లే ఉండే పెద్ద చెరువే బతుకుదెరువు. 150 ఎకరాల భూములకు కల్పతరువు మా చెరువు. నాడు చెరువుల ఫుల్లు నీళ్లుంటుండె. మంచిగా రెండు పంటలు పండించుకునేటోళ్లం. కానీ రానురాను చెరువు పూడిక, చెట్లతో నిండిపోయింది. కాలమేదైనా అడుగంటిపోయి ఉంటుండె. పంటలు నీరందక ఎప్పుడూ ఎండిపోతుండె. చెరువును మంచిగ జేయాలని అప్పటి ప్రభుత్వాలను కోరినా పట్టించుకోలే. కానీ తెలంగాణ వచ్చి కేసీఆర్ మంచి పనిచేసిండు. మా చెరువులో పూడికతీత తీయించి, మత్తడి, తూములు కట్టించి బాగు చేయించిండు. చెరువు లోతు ఎక్కువై ఫుల్లుగా నీళ్లు ఉంటున్నయి. ఏడేండ్ల నుంచి ఇప్పటిదాకా ఏకాలంల గూడా చెరువు ఎండిపోలే. మంచిగ రెండు పంటలూ పండించుకుంటున్నం. కేసీఆర్ సారు, ప్రభుత్వానికి రుణపడి ఉంటం.
సుల్తానాబాద్ రూరల్, మే 18 : ఇది సుల్తానాబాద్ మండలం ఐతరాజ్పల్లిలోని పెద్ద చెరువు. 54 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఈ చెరువు కింద దాదాపు 150 ఎకరాల ఆయకట్టు ఉంది. ఒకప్పుడు రైతులు, సబ్బండవర్గాలకు ఆదరువుగా మారిన ఈ జలవనరు, కాలక్రమేణా పూడికతో నిండిపోయింది. పిచ్చి మొక్కలతో నిండిపోయింది. వానకాలంలో సైతం చుక్కనీరు నిల్వ ఉండని పరిస్థితి నెలకొన్నది. ఫలితంగా చెరువు కింద రైతులు సాగునీటికి, ప్రజలు తాగునీటికి నానా ఇబ్బందులు పడేవారు. గ్రామంలోని రెండు రక్షిత మంచినీటి బావులకు ఈ చెరువు నీరే ఆధారం. నీళ్లు ఉంటేనే గ్రామంలోని రక్షిత మంచినీటి బావులకు నీరందుతుంది. అయితే చెరువును మరమ్మతు చేయాలని గ్రామస్తులు, రైతులు ఏ నాయకుడికి మొరపెట్టుకున్నా, ఏ ప్రభుత్వానికి విన్నవించుకున్నా పట్టించుకునేవారు కాదు. ఈ క్రమంలో స్వరాష్ట్రం సిద్ధించి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చెరువుల పునరుద్ధరణకు మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని చేపట్టింది.
ఏడాది పొడవునా నీళ్లు
మిషన్ కాకతీయ కింద పెద్దచెరువు మరమ్మతులకు ప్రభుత్వం 2016లో రూ.50 లక్షలు మంజూరు చేసి, పూడికతీయించింది. మత్తడి, తూములు నిర్మించింది. చెట్లు, ముళ్లపొదలను తొలగించి నీరు నిల్వ ఉండేలా పునరుద్ధరించగా, ప్రభుత్వ ప్రయత్నం ఫలించింది. నాటి నుంచి నేటిదాకా వర్షాకాలంలో చెరువు పూర్తిగా నిండి ఏడాది పొడవునా నీరు నిల్వ ఉంటున్నది. వానకాలమే కాదు యాసంగిలోనూ రెండు పంటలకూ నీరందిస్తున్నది. చెరువులో పుష్కలంగా నీరు ఉండడంతో గ్రామంలో తాగునీటికి ఇబ్బంది లేకుండా పోయింది. ప్రభుత్వం ఏటా అందించే ఉచిత చేప పిల్లల పంపిణీతో మత్స్యకారులకు చేతి నిండా ఉపాధి దొరుకుతున్నది.