Bus pass charges | జగిత్యాల, జూన్ 28: టోల్ ఛార్జిల పేరుతో కేంద్రం, బస్ పాస్, బస్ ఛార్జిలతో రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులు, ప్రజల జీవితాలతో చెలగాటమాడుతున్నాయని జగిత్యాల జెడ్పీ మాజీ ఛైర్ పర్సన్ దావ వసంత విమర్శించారు. పెంచిన బస్ పాస్, బస్ చార్జీలు తగ్గించాలనే డిమాండ్ తో జగిత్యాల ఆర్టీసీ డిపో ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలతో కలిసి దావ వసంత ధర్నా నిర్వహించారు. పెంచిన చార్జీలు తగ్గించాలని కోరుతూ డిపో మేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వసంత మాట్లాడుతూ గత ప్రభుత్వం పాలన తీరుకు భిన్నంగా ప్రజా పాలనే ధ్యేయంగా ముందుకు వెళ్తామని, మార్పు దిశగా అడుగులు వేస్తామని ప్రగల్బాలు పలికిన కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే బస్ పాస్, బస్ ఛార్జిల ధరలు పెంచి నిరుపేద విద్యార్థుల తల్లితండ్రులపై ఆర్థిక భారం మోపిందని విమర్శించారు. అరు గ్యారంటీ లు, 420 హామీలతో గద్దెనెక్కి పాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క హామీని నెరవేర్చకుండా ప్రజలపై భారం మోపడం దురదృష్టకరం అన్నారు. హామీల అమలులో ప్రభుత్వం పూర్తిగా విఫలం అయ్యిందని ఆరోపించారు. స్థానిక సంస్థల ఎన్నికల నగరా మొగగానే రైతు భరోసా వేశారని, ఎగొట్టిన, ఇచ్చిన అర్హులకు అందని రైతు భరోసా నిధుల సంగతి ఏంటని వసంత రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
విద్యార్థుల కు అందించాల్సిన రూ.8వేల కోట్ల స్కాలర్షిప్, ఫీజు రియీంబర్స్మెంట్ బకాయిలు నేటికీ చెల్లించలేదని, బెస్ట్ అవైలబుల్ స్కూల్ లకు కోట్లల్లో నిధులు రావాల్సి ఉన్నప్పటికీ ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నర్తకంగా మారిందన్నారు. ఇవన్నీ ఇలా ఉంటే ములిగే నక్కపై తాటి పండు పడ్డ చందాన బస్ పాస్, బస్ ఛార్జిల పేరుతో భారం మోపడం సరికాదన్నారు. మహాలక్ష్మి పథకం లోని ఉచిత బస్ సౌకర్యం పై ప్రజలకే విరక్తి వచ్చే పరిస్థితి ఏర్పడిందని, బస్ ల సంఖ్యను తగ్గించి, ఉచిత ప్రయాణం అమలు చేస్తుండడంతో ప్రజల నుండి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుందని వసంత ఆరోపించారు.
స్కూటీలు జాడ లేదని, తులం బంగారం ఊసే లేదని, మహిళలకు రూ.2500/- పెన్షన్ నేటికీ అమలుకు నోచుకోలేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు అయ్యే వరకు పోరాటం చేయడంతో పాటు, ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ ముందుండి పోరాటం చేస్తుందని తేల్చిచెప్పారు. అంతేకాకుండా పాలన చేతకాని కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులపై విమర్శలు చేస్తూ పబ్బం గడుపుతోందని ధ్వజమెత్తారు.
రాయికల్ కళాశాల వరకు బస్ నడపాలి
రాయికల్ పట్టణ శివారులోని ఇటిక్యాల సమీపంలో గల ప్రభుత్వ జూనియర్ కళాశాలకు వెళ్లే విద్యార్థులు కళాశాల వరకు ప్రయాణ సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, రింగ్ బస్ అనగా రాయికల్ మండలంలోని ఆలూరు, వీరాపూర్, ధర్మాజిపేట్, తాట్లావాయి, కట్కాపూర్, దావన్ పెల్లి, వస్తాపూర్, ఒడ్డె లింగాపూర్, కొత్త పేట్, మూట పెల్లి, భూపతిపూర్, రామోజీ పేట్, ఇటిక్యాల గ్రామాల మీదుగా బస్ సౌకర్యం కల్పిస్తూ, ప్రభుత్వ కళాశాల వరకు బస్ నడపాలని సైతం వినతిపత్రం అందజేశారు.
ఈ కార్యక్రమంలో పాక్స్ చైర్మన్లు మహిపాల్ రెడ్డి, సందీప్ రావు, పార్టీ మండల పట్టణ అధ్యక్షులు తుమ్మ గంగాధర్, బర్కం మల్లేష్, అనిల్, తెలు రాజు, మాజీ జడ్పీటీసీ మహేష్, మాజీ ప్రజా ప్రతినిధులు దేవేందర్ నాయక్, తురగ శ్రీధర్ రెడ్డి, బుర్ర ప్రవీణ్ గౌడ్, జక్కుల తిరుపతి, సాయి కుమార్, మహేందర్, సీనియర్ నాయకులు కమలాకర్ రావు, గంగారెడ్డి,సాగి సత్యం రావు, చింతల గంగాధర్, నక్క గంగాధర్, ఎల్లా రాజన్న, కిషోర్, చాంద్, గంగిపెల్లి వేణు, రాజేందర్ గౌడ్, ఆదిరెడ్డి శ్రీను, ముత్తయ్య ప్రమోద, మూలాస్తం శివ ప్రసాద్, మహిళా నాయకులు అనురాధ, లక్ష్మి, సులోచన, యూత్ నాయకులు హరీష్, సన్నిత్ రావు, గంగారెడ్డి, ప్రతాప్, మధుకర్, ప్రణయ్, మదన్ పుధరి శ్రీను, మోహన్, షఫీ, బాలే చందు, భగవాన్, నవీన్, నరేష్, ముకిడ్, పార్టీ కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.