Odela | ఓదెల, జులై 30 : గత రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా ఓదెల మండలంలోని పలు గ్రామాల్లో చెరువులు, కుంటలు నీటితో నిండుతున్నాయి. చాలా చెరువులు మత్తడులు దూకుతున్నాయి. కొలనూరు-ఓదెల, గూడెం-మల్యాల గ్రామాల మధ్యన ఉన్నలో లెవెల్ కాజువేల పైనుంచి వర్షపు వరద నీరు పారుతోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. కాగా హరిపురం గ్రామంలో గురువారం ఈదురు గాలుల కారణంగా కాసారపు ఐలయ్య గౌడ్ ఇంటి సమీపంలోని తాటిచెట్టు నేల వాలింది.
ఈ కారణంగా మూడు కరెంటు స్తంభాలు విరిగిపోయాయి. దీంతో సర్పంచ్ గారవేణి విజయనాగరాజ్ యాదవ్ వెంటనే స్పందించి ట్రాన్స్ కో అధికారులకు సమాచారమిచ్చారు. యుద్ధ ప్రాతిపదికన కరంటు పునరుద్ధరణ పనులను సర్పంచ్ దగ్గర ఉండి చేయించారు. మధ్యాహ్నం వరకు గ్రామంలో కరెంట్ సరఫరా చేయించారు. ఇందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ట్రాన్స్ కో డీఈ రవీందర్, ఏఈ మోహన్ నాయక్, లైన్ ఇన్స్పెక్టర్ సదానందం, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.